ఖమ్మం రూరల్, ఆగస్టు 25 : ఒకవైపు ప్రజా సమస్యలు, మరోవైపు రైతులు పడుతున్న తిప్పలు వెరసి ఖమ్మం రూరల్ మండలంలో ప్రభుత్వ తీరుపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది. గడిచిన వారం రోజుల నుంచి వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయా పార్టీల నాయకులు ఆదివారం సెలవు రోజు అనంతరం సోమవారం నిరసనలు, వినతి పత్రాల అందజేత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గత ఐదు నెలలుగా రేషన్ డీలర్లకు కమిషన్లు నిలిచిపోయాయని, తక్షణం నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రేషన్ డీలర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి తాసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. అనంతరం తాసీల్దార్ పి.రాంప్రసాద్‌కు వినతి పత్రం అందించి తమ గోడును వినిపించారు.
మరోవైపు యూరియా కొరతతో ఇబ్బందు పడుతున్న రైతుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని కోరుతూ ఏఐకేఎస్ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు తాసీల్దార్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున జెండాలతో నిరసన చేపట్టారు. అన్నదాతలు పడుతున్న సమస్యలు ఆలకించి తక్షణం అవసరమైన మేర యూరియా నిల్వలను అందుబాటులో ఉంచాలని, యూరియా బ్లాక్ మార్కెట్ దందాను అరికట్టాలని డిమాండ్ చేస్తూ తాసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. మరోవైపు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పలువురు నాయకులు, కార్యకర్తలు ఎదులాపురం మున్సిపాలిటీ కార్యాలయంలో కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డిని కలిశారు. మున్సిపాలిటీలో పారిశుధ్యం పూర్తిగా స్తంభించి పోయిందని తద్వారా సీజనల్ వ్యాధులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం పారిశుధ్య పనులను చేపట్టాలని డిమాండ్ చేస్తూ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమాల్లో రేషన్ డీలర్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ వెంకన్న, సిపిఐ నాయకులు దండి రంగారావు, పుచ్చకాయల సుధాకర్, సిపిఎం నాయకులు నందిగామ కృష్ణ, బాపట్ల సత్యనారాయణ, ప్రసాద్ పాల్గొన్నారు.
Khammam Rural : అటు వినతులు ఇటు నిరసనలు.. ఖమ్మం రూరల్ మండలంలో రోడ్డెక్కిన ప్రజానీకం