మామిళ్లగూడెం, జూలై 7 : వారం వారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంపై ప్రజలకు విశ్వాసం కల్పించాలని, వారు సమర్పించిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్.. అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డిలతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2025 జనవరి నుంచి ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న 185 ప్రజావాణి దరఖాస్తులను వారం రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు.
జిల్లాస్థాయి అధికారులు ప్రతీ వారం మండలస్థాయి అధికారులతో ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంపై సమీక్షించాలని సూచించారు. మండల స్థాయిలో ప్రజావాణిని సమర్థవంతంగా చేపట్టాలని, ప్రజల సమస్యలు చాలా వరకు అక్కడే పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేయాలని, ప్రతీ అధికారి చెక్ లిస్టు తయారు చేసుకుని పాఠశాల పనితీరుపై ఫీడ్ బ్యాక్ అందించాలని తెలిపారు. అనంతరం వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. డీఆర్వో పద్మశ్రీ, వివిధ శాఖల, జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏవో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.