‘సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే’పై సర్వత్రా ఆందోళన నెలకొంటోంది. సర్వేకు వచ్చిన ఎన్యూమరేటర్లను ప్రజలు సవాలక్ష ప్రశ్నలు అడుగుతున్నారు. వారి సందేహాలు నివృత్తి చేయలేక క్షేత్రస్థాయిలో ఎన్యూమరేటర్లు తలలు పట్టుకుంటున్నారు. ఇటు ప్రజల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోవడం, అటు ప్రభుత్వ ఆదేశాలను పాటించాల్సి రావడం వంటి కారణాలతో విలవిల్లాడుతున్నారు. ఇదివరకు తీసుకున్న ప్రజాపాలన దరఖాస్తులు ఏమయ్యాయని, గ్యారెంటీ పథకాలు ఎక్కడిదాకా వచ్చాయని ప్రజలు అడుగుతుండడంతో సర్వే సిబ్బంది మౌనం వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ‘వివరాలు చెబితే పథకాలు పోతాయా?’ అంటూ కొన్నిచోట్ల ఎన్యూమరేటర్లపై ప్రజలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): కొత్తగా వివాహాలై వేరు పడిన కుటుంబాల్లో సమగ్ర సర్వే సరికొత్త చిక్కు వచ్చిపడుతోంది. రేషన్ కార్డు నంబరును ఎవరి ఫ్యామిలీలో నమోదు చేసుకోవాలో అనే అంశంపై అయోమయం నెలకొంటోంది. మరోవైపు ఎన్యూమరేటర్లపై కూడా అధిక పనిభారం పడుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో సర్వే మొదలు పెడితే.. రాత్రి పొద్దుపోయే వరకు చేసినా ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఇక్కో ఇంటి సర్వేకు గంటల గంటలు సమయం పడుతుండడం, అందులో సందేహాల నివృత్తికే అధిక సమయం కేటాయించాల్సి రావడం వంటివి మరింత ఒత్తిడిని పెంచుతున్నాయి.
మొన్ననే ప్రజాపాలనలో సమగ్ర వివరాలు తీసుకొని మళ్లీ ఇప్పుడు సమస్త వివరాలు చెప్పాలంటూ సర్వే సిబ్బంది వస్తుండడంతో ప్రజలు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. వివరాలు చెప్పాలంటూ ఏ ఇంటికి వెళ్లినా.. ‘అప్పటి దరఖాస్తులు ఏమయ్యాయి?’ అంటూ మొట్టమొదలే ప్రశ్న ఎదురవుతోంది. కొందరు ప్రజలైతే తమకు కల్యాణలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లు, గ్యాస్ సబ్సిడీ వంటి పథకాలు రావడం లేదని ఫిర్యాదులు చేస్తున్నారు. తాము పథకాల వివరాల కోసం రాలేదని, సర్వే సమ్రగ సమాచారం నమోదు చేసుకునేందుకు వచ్చామని ఎన్యూమరేటర్లు సమాధానాలు చెబుతున్నారు. దీంతో గ్యారెంటీ హామీలు అందని ప్రజలందరూ నిట్టూర్చుతున్నారు. కాగా, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు మధ్యాహ్నం నుంచి సర్వే విధులకు వెళ్తుండడంతో పాఠశాలలన్నీ ఆ పూట మూతబడుతున్నాయి.
గడువులోగా సాధ్యమేనా?
ఒకటి కాదు రెండు కాదు సుమారు 56 కాలమ్స్‌లో 70కిపైగా ప్రశ్నలతో చేయాల్సిన ఈ సర్వే సకాలంలో పూర్తి కావడం అసాధ్యమంటూ ఎన్యూమరేటర్లు స్పష్టం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని, ప్రజల సందేహాలను నివృత్తి చేయలేకపోతున్నానమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలను పాటించాలి కాబట్టి తప్పనిసరైనందునే సర్వేలో పాల్గొంటున్నామంటూ తలలు పట్టుకుంటున్నారు. అదీగాక.. ఉన్నది మూడు వారాల గడువేనని, ఈ సమయంలోనే ఒక్కో ఎన్యూమరేటర్ 150 నుంచి 200 పైగా ఇళ్లకు వెళ్లి సర్వే చేయడం అసాధ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పథకాలు అందలేదంటున్న ప్రజలు..
గత ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తులకు ఇంత వరకూ ఎందుకు మోక్షం కలగలేదంటూ ప్రతి ఇంట్లోనూ ప్రజలు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వలేదని, పెంచిన పింఛన్లు రావడం లేదని, కొత్త పింఛన్ల జాడ ఏమైందని, మహిళలకు ఇస్తామన్న రూ.2,500 ఎప్పుడిస్తారని, గ్యాస్ సబ్సిడీ బ్యాంకులో జమ కావడం లేదని పేర్కొంటూ ప్రతి ఒక్కరూ పలు ప్రశ్నలు అడుగుతుండడంతో సర్వే సిబ్బంది సహనంతో సమాధానాలు చెప్పాల్సి వస్తోంది. పైగా ఇందులోనే పథకాల గురించి గుచ్చిగుచ్చి మరీ అడుగుతున్నారు. ‘ఈ సర్వే పూర్తయ్యాక ఇప్పటికే ఇస్తున్న పథకాలను తొలగిస్తారా?’ అంటూ ప్రశ్నిస్తున్నారు. చాలామంది రైతులు మాత్రం తమ పట్టాదారు పాస్ పుస్తకాల వివరాలు ఇవ్వబోమంటూ తేల్చిచెబుతున్నారు.
భద్రాద్రి జిల్లాలో 3,17,615 గృహాలు..
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 481 గ్రామ పంచాయతీలు, నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి. తొలి రోజు సర్వే నత్తనడకగానే సాగింది. ఇక సమగ్ర సర్వే కోసం 2,386 ఎన్యూమరేటర్లను నియమించారు. వీరు 2,761 బ్లాకుల్లో సర్వే చేయాల్సి ఉంది. ఒక్కో ఎన్యూమరేటర్‌కు గరిష్టంగా 175 నుంచి 200కుపై కుటుంబాలను కేటాయించారు. అలాగే, సర్వే పర్యవేక్షణకు ప్రతి నియోజకవర్గానికీ ఒక ప్రత్యేక అధికారిని నియమించారు. పినపాక నియోజకవర్గానికి భద్రాచలం ఆర్డీవో దామోదర్, ఇల్లెందుకు కొత్తగూడెం ఆర్డీవో మధు, అశ్వారావుపేటకు జడ్పీ సీఈవో చంద్రశేఖర్‌రావు, భద్రాచలానికి డీఎల్పీవో సుధీర్, కొత్తగూడేనికి మరో డీఎల్పీవో రమణలను నియమించారు. ప్రతి రోజూ వీరి నుంచి పూర్తి సమాచారాన్ని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ సేకరిస్తారు. కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ప్రతి రోజూ మూడు నాలుగు ఏరియాల్లో పర్యవేక్షిస్తున్నారు.
కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాది దగ్గర పడుతోంది. ఉచిత బస్సు తప్ప మిగతా పథకాలేవీ ఇంత వరకు అమలు చేయడం లేదు. మళ్లీ సర్వే అంటూ ఇంటింటికీ తిరుగుతున్నారు. ఇటు ప్రజలను, అటు ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం తప్ప ఎందుకు ఈ సర్వే? టీచర్లను పాఠాలు చెప్పనివ్వడం లేదు. ఉద్యోగులు కూడా ఈ సర్వే భారం గురించి బయటకు చెప్పుకోలేకపోతున్నారు. ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది. సరైన సమయంలో బుద్ధిచెప్పడానికి వారు సిద్ధంగా ఉన్నారు. ఏం సమాచారం ఇస్తే మళ్లీ ఏం కోతలు పెడతారో అని జనం భయపడుతున్నారు.
-రేగా కాంతారావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు