కొత్తగూడెం క్రైం, డిసెంబర్ 15: అన్ని విభాగాల అధికారుల సమష్టి కృషి వల్లే మావోయిస్టుల నిర్మూలన సాధ్యమైందని డీజీపీ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. కాలం చెల్లిన సిద్ధాంతాలతో మావోయిస్టు పార్టీ సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని అన్నారు. ఇకపై మావోయిస్టులు తెలంగాణలో అడుగుపెట్టకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. భద్రాద్రి, ములుగు జిల్లాల పెర్ఫార్మెన్స్ రివ్యూ కోసం గురువారం హెలికాప్టర్ ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని హేమచంద్రాపురం పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు చేరుకున్న ఆయన.. రెండు జిల్లాల అధికారులతో సమీక్షించారు. అనంతరం విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందిని ప్రశంసించి వారికి రివార్డులను అందజేశారు. తరువాత విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మావోయిస్టుల ఆపరేషన్స్‌లో భాగంగా గ్రేహౌండ్స్, ఎస్ఐబీ అధికారులతో ములుగు, భద్రాద్రి జిల్లాలను, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో ఉన్న అలుబాక క్యాంపును సందర్శించినట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ర్టాన్ని మావోయిస్టు రహిత రాష్ట్రంగా కొనసాగించేందుకు రాష్ట్ర పోలీస్ శాఖ అనునిత్యం, అహర్నిషలూ శ్రమిస్తోందన్నారు. ఇందులో భాగంగానే ములుగు, భద్రాద్రి జిల్లాల పోలీసుల పెర్ఫార్మెన్స్ రివ్యూ నిర్వహించి పోలీస్ అధికారులు, సిబ్బంది చేసిన కృషి, సాధించిన ఫలితాలు, భవిష్యత్ ప్రణాళికపై సమీక్షించినట్లు వివరించారు. ఈ రెండు జిల్లాల పోలీసు వ్యవస్థలు సమష్టిగా పని చేస్తూ ప్రజల భాగస్వామ్యంతో మావోయిస్టుల కార్యకలాపాలను నిర్మూలిస్తున్నట్లు చెప్పారు. లక్ష్యసాధనలో ఈ రెండు జిల్లాలో పోలీస్ అధికారులు అద్భుతంగా పని చేసి భవిష్యత్తులో కూడా మావోయిస్టుల సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ముఖ్యంగా భద్రాద్రి, ములుగు జిల్లాల్లో ప్రజలు కూడా మావోయిస్టులను దూరం పెట్టి వారికి ఎలాంటి సహాయ సహకారాలూ అందించకుండా ఉండడం అభినందనీయమన్నారు.
ప్రభుత్వ అందించే వివిధ అభివృద్ధి ఫలాలను పొందుతూ, ప్రభుత్వానికి చేదోడువాదోడుగా ఉంటూ ప్రజలు చైతన్యవంతంగా వ్యహరిస్తున్న తీరు ప్రశంసనీయమన్నారు. శాంతి భద్రతలు బాగుంటే అభివృద్ధి బాగుంటుందని, శాంతి ఉన్న చోటే అభివృద్ధి త్వరగా జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం బలంగా నమ్ముతోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీస్ శాఖకు పెద్దపీట వేసి కావాల్సిన వనరులను అందించడం వల్లే రాష్ట్రంలో శాంతిభద్రతలు పరిఢవిల్లుతున్నాయన్నారు. మావోయిస్టులు ఏ సమయంలోనూ తెలంగాణలోకి చొరబడడానికి వీలులేకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. రాష్ట్ర సరిహద్దుల్లో కెమెరాలు ఏర్పాటు చేశామని, మావోయిస్టుల కదలికలు ఉండే అవకాశం ఉన్న చోట కూడా సీసీ కెమెరాలను అమర్చామని అన్నారు. ఇవేగాక నేరాల నియంత్రణ కోసం గ్రామాలు, పట్టణాల్లో కూడా సీసీ కెమరాలను ఏర్పాటు చేస్తూ ప్రజల్లో భద్రతా భావాన్ని పెంచుతున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని వివరించారు. వీటి ద్వారా పోలీస్ శాఖ ఫలితాలు సాధించిందని అన్నారు. గ్రేహౌండ్స్ అదనపు డీజీపీ శ్రీనివాసరెడ్డి, నార్త్ జోన్ అదనపు డీజీపీ వై.నాగిరెడ్డి, సీఆర్పీఎఫ్ సౌత్ సెక్టర్ ఐజీ మహేశ్ చంద్ర లడ్డా, ఎస్ఐబీ ఆపరేషన్స్ చీఫ్ ప్రభాకర్‌రావు తదితరులు డీజీపీ వెంట ఉన్నారు. భద్రాది కొత్తగూడెం ఎస్పీ డాక్టర్ వినీత్, ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్, కొత్తగూడెం ఓఎస్డీ సాయి మనోహర్, ములుగు ఓఎస్డీ శోభన్‌కుమార్, భద్రాచలం ఏఎస్పీ రోహిత్‌రాజు, ములుగు ఏఎస్పీ అశోక్‌కుమార్, ఏటూరు నాగారం ఏఎస్పీ సుధీర్ కే కేకర్, సీఆర్పీఎఫ్ కమాండెంట్లు ప్రశాంత్ ధర్, సంజీవ్‌కుమార్, టీఎస్ఎస్పీ 6వ బెటాలియన్ కమాండెంట్ రమణారెడ్డి, డీఎస్పీలు గుడ్ల వెంకటేశ్వరబాబు, రమణమూర్తి, తాళ్లపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.