ఖమ్మం, డిసెంబర్ 31 : కోటి ఆశలతో ప్రజలు నూతన సంవత్సరంలోకి ప్రవేశించారు. జీవనచక్రంలో కాలచక్రం గిర్రున తిరిగింది. ఏడాది ఇట్టే గడిచిపోయింది. కష్టసుఖాలు, మంచిచెడులు, తీపిచేదు అనుభవాలతో ఏడాదంతా కాలగర్భంలో కలిసిపోయింది. 2024 సంవత్సరానికి ఆనందభాష్పాలతో వీడ్కోలు పలికారు. 2025 కొత్త సంవత్సరానికి ఆనందంగా స్వాగతం పలికారు. మంగళవారం రాత్రి నుంచి ఖమ్మం ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ జరుపుకున్న న్యూ ఇయర్ సంబరాలు అంబరాన్నంటాయి. జీవితంలోకి కొత్త పేజీని ఉత్సాహంగా తెరిచారు. కొంగొత్త ప్రణాళికలు, ఆశలు, ఆశయాలు, ఎన్నో కలలతో కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. వాట్సాప్, ఈమెయిల్స్, ఫేస్‌బుక్‌ల ద్వారా బంధువులు, స్నేహితులు, సన్నిహితులకు శుభాకాంక్షలు తెలిపారు. కేక్‌లు కట్ చేసుకుని, స్వీట్లు పంపిణీ చేశారు.
కొత్త సంవత్సర రాక సందర్భంగా ఖమ్మం జిల్లా కేంద్రంలోని రెస్టారెంట్లు బిర్యానీలపై పలురకాల ఆఫర్లు అందించాయి. స్వీట్‌షాపులు, బేకరీలు, వస్త్ర దుకాణాలు కిక్కిరిశాయి. దుకాణాల యజమానులు ఆఫర్లు ప్రకటించి ఆకర్షించారు. వీటితోపాటు బంగారం ఆభరణాల షోరూమ్‌లు వినియోగదారులతో సందడి చేశాయి. జిల్లాకేంద్రంలో జడ్పీ సెంటర్, వైరారోడ్, మయూరిసెంటర్, గాంధీచౌక్‌లో గల పలు దుకాణాలు క్రయవిక్రయాలతో కిటకిటలాడాయి.
జిల్లా ప్రజలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్, బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ వీ పాటిల్ వేర్వేరు ప్రకటనల్లో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరారు. ప్రతి ఇంట్లో నూతన కాంతులు వెదజల్లాలని, ప్రతిఒక్కరూ ఆయురారోగ్యాలతో విరాజిల్లాలని ఆకాంక్షించారు. సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు వెల్లివిరియాలని అభిలాషించారు.