కారేపల్లి, డిసెంబర్ 08 : వివిధ ప్రాంతాల్లోని పేపర్ మిల్లులకు సుబాబుల్ లోడు లారీలు సింగరేణి (కారేపల్లి) మండలం మీదుగా నిత్యం వెళ్తుంటాయి. ఖమ్మం జిల్లా మండలాల్లో గల గ్రామాల నుండి వచ్చే పలు లారీలు అధిక లోడుతో అతివేగంగా వెళ్తున్నాయి. దీంతో ప్రజలు, ప్రయాణికులు, పాదచారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆగి ఉన్న సుబాబుల్ లోడు వాహనాలను ఢీకొని ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇరువైపులా పొడచుకు వచ్చేలా ఉండే కర్రలు తగిలి పాదచారులు గాయాలపాలైన ఘటనలు చోటుచేసుకున్నాయి. లోడుతో వెళ్లే లారీలు మోటారు వాహన చట్టం నిబంధనలు పాటించడం లేదనే విమర్శలున్నాయి.
మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు ఇరుకుగా ఉండడం వల్ల ఎదురుగా వచ్చే వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. సుబాబుల్ కర్ర లోడుతో వస్తున్న లారీలకు విద్యుత్ తీగలు తగలకుండా వ్యాపారులు కొంతమంది పొరుగు రాష్ట్ర యువకులను ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టకుండా ఉపయోగించుకుంటున్నారు. దాంతో వారు విద్యుత్ ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రోడ్డు రవాణా, పోలీసు శాఖ అధికారులు స్పందించి సుబాబుల్ లోడు వాహనాలను విస్తృతంగా తనిఖీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.