ఇల్లెందు, సెప్టెంబర్ 3: ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, మంత్రులు, ఎమ్మెల్యేలు రోజుకో మాట చెబుతూ పబ్బం గడుపుతున్నారని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి బానోతు హరిప్రియానాయక్ మండిపడ్డారు. ఇల్లెందు నియోజకవర్గ పరిధి గార్ల మండలం సత్యనారాయణపురం మాజీ సర్పంచ్ బాదావత్ రాందాస్.. 20 కుటుంబాలతో కలిసి మాజీ ఎమ్మెల్యే హరిప్రియ సమక్షంలో బుధవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వారికి ఆమె కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరిప్రియ మాట్లాడుతూ కాంగ్రెస్ 420 హామీలతో విసిగిపోయిన ప్రజలు బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, రానున్న రోజుల్లో భారీ చేరికలు ఉంటాయన్నారు. పార్టీలో చేరిన వారికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని, అందరూ సమన్వయంతో పనిచేసి బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని ఆమె కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంగావత్ లక్ష్మణ్‌నాయక్, పి.రాధాకృష్ణ, శీలంశెట్టి రమేశ్, వెంకటేశ్వర్లు, శ్రీనాథ్, మురళి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.