ఆదుకుంటున్నది ఆసరానే !
ఉమ్మడి పాలనలో అప్పటికీ పింఛను పొందుతున్న వారు మృతిచెందితే తప్ప కొత్తవారికి పింఛను అందేది కాదు. ఆ పింఛను సాధించడానికి కూడా సిఫార్సులు, గంటల కొద్దీ నాయకుల ఇళ్ల ఎదుట పడిగాపులు..
- జిల్లావ్యాప్తంగా 1.91 లక్షల మందికి పింఛన్లు
- 28,831 మంది దివ్యాంగులకు పెరిగిన పెన్షన్లు
- సీఎం కేసీఆర్ వచ్చాకే పింఛన్ పంపిణీ విధానంలో మార్పులు
- వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలకు చేదోడుగా నిలుస్తున్న పథకం
కూసుమంచి, డిసెంబర్ 1: ఉమ్మడి పాలనలో అప్పటికీ పింఛను పొందుతున్న వారు మృతిచెందితే తప్ప కొత్తవారికి పింఛను అందేది కాదు. ఆ పింఛను సాధించడానికి కూడా సిఫార్సులు, గంటల కొద్దీ నాయకుల ఇళ్ల ఎదుట పడిగాపులు.. అంత కష్టపడీ పింఛను సాధిస్తే అందేది కేవలం రూ.వందల్లోనే.. అందిన అరకొర పింఛను చాలక వితంతువులు, దివ్యాంగులు, వృద్ధులు చేతిలో ఉన్న ఆ కాస్త సొమ్ముతో సరైన వైద్యం చేయించుకోలేక, మెడిసిన్ కొనుక్కోలేక ఇబ్బందిపడేవారు. ఇక గీత కార్మికులు, బోదకాలు, డయాలసిస్, హెచ్ఐవీ బాధితుల సంగతి సరేసరి. వారి బాధలు పట్టించుకునే నాథుడే ఉండేవారు కాదు. తెలంగాణ వచ్చిన తర్వాతే సీఎం కేసీఆర్ పింఛన్ పంపిణీ విధానంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చారు. వందల్లో అందే పింఛనును వేలాల్లోకి తీసుకొచ్చారు.
పింఛను పెంపు..
తెలంగాణ సిద్ధించిన తర్వాత పింఛను పంపిణీ పథకానికి సీఎం కేసీఆర్ ‘ఆసరా’ అని నామకారణం చేశారు. ఉమ్మడి పాలనలో కేవలం రూ.200 ఉన్న వృద్ధులు, వితంతవుల పింఛనును ఏకంగా రూ.వెయ్యిగా ప్రకటించారు. అలాగే దివ్యాంగుల పింఛనును రూ.500 నుంచి రూ.1,500 పెంచారు. 2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ వృద్ధులు, వితంతువుల పింఛనును రూ.1,000 నుంచి రూ.2,016కు, దివ్యాంగుల పింఛనును రూ.1,500 నుంచి రూ.3,016కు పెంచారు. 2020 మార్చిలో సీఎం కేసీఆర్ పింఛను అర్హత వయస్సును 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు కుదించారు. 2023 జనవరిలో పింఛను తీసుకుంటున్న భర్త చనిపోతే అతని భార్యకు వెంటనే పింఛను వర్తింపజేయాలని సీఎం ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 1.91 లక్షల మంది వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులు, డయాలసిస్, బోదకాలు, హెచ్ఐవీ బాధితులు, గీతకార్మికుల ఖాతాల్లో నెలనెలా రూ.44.29 కోట్లు జమ అవుతున్నాయి. వీరిలో దివ్యాంగులు 28,831 మంది ఉన్నారు. అత్యధికంగా ఖమ్మం రూరల్ మండలంలో 11,431 మంది, అతి తక్కువగా మధిర మున్సిపాలిటీలో 3,003 మంది పెన్షన్ తీసుకుంటున్నారు.

పెన్షనే ఆధారం..
మాది పేద కుటుంబం. నాకు చిన్నతనంలోనే పోలియో వచ్చింది నాన్న గతంలోనే చనిపోయాడు. నాకు ఆసరా పెన్షనే ఆధారం. నేను అనాథాశ్రమంలో ఉంటున్నా. నాలాంటి అనేక మందికి పెన్షన్ ఆధారమైంది. దివ్యాంగులకు నెలకు రూ.4,016 పింఛను అందుతున్నది. మళ్లీ కేసీఆర్ సీఎం అయితే పింఛను పెరుగుతుంది. కేసీఆరే సీఎం కావాలని కోరుకుంటున్నా.
– రమేశ్, దివ్యాంగ పింఛనుదారు, చౌటపల్లి, కూసుమంచి మండలం
పెన్షన్ కొండంత అండ..
మాది పాలేరు. నేను పుట్టకతోనే దివ్యాంగుడిని. నాన్న గతంలోనే చనిపోయాడు. అమ్మ కూలీ. అమ్మ పనికిపోతేనే మాకు పూట గడుస్తుంది. ఇలాంటి పేదరికంలో నాకు నెల నెలా వచ్చే పింఛనే కొండంత అండ. నా అవసరాలు పింఛనుతోనే తీరుతున్నాయి.
– వెంకన్న, దివ్యాంగ పింఛనుదారు, పాలేరు
కేసీఆర్ మా పెద్ద కొడుకు..
సీఎం కేసీఆర్ పెద్ద కొడుకులా వృద్ధులకు పింఛను అందిస్తున్నరు. నా లాంటి ఎంతోమంది వృద్ధులకు పింఛనే ఆసరా. ఎవరి మీదా ఆధారపడకుండా మందులు కొనుక్కుంటున్నా. చిన్న చిన్న అవసరాలు తీర్చుకుంటున్నా. కేసీఆర్ వంటి మంచి నేత మళ్లీ సీఎం అయితే ఇంకా ఎన్నో మంచి పథకాలు వస్తాయి. నిరుపేదలకు మేలు జరుగుతుంది.
– సూరయ్య, వృద్ధాప్య పింఛనుదారు, అగ్రహారం, కూసుమంచి మండలం
కేసీఆరే మాకు పెద్ద దిక్కు..
నేను ఏళ్ల నుంచి బోదకాలు వ్యాధితో బాధపడుతున్నా. నాలాంటి వారెందరో ఈ వ్యాధితో బాధపడుతున్నారు. మా బాధలు వర్ణనాతీతం. నెలలో వారం రోజులు జ్వరంతో పాటు ఇతర సమస్యలతో సతమతమవుతుంటాం. గతంలో ఏ ప్రభుత్వమూ మా బాధలు పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ గోడు చూసి పింఛను మంజూరు చేస్తున్నారు. పింఛను మాకెంతో ఆసరా.
– కనకం లచ్చయ్య, బోదకాలు బాధితుడు, కూసుమంచి
తెలంగాణ వచ్చినంకనే పింఛను పెంపు..
నా భర్త ఆరేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు. అప్పటి నుంచి కూలి పని చేసుకుంటూ బతుకుతున్నా. కేసీఆర్ సర్కారు నన్ను ఆసరా పథకానికి అర్హురాలిగా గుర్తించింది. నెల నెలా రూ.2,016 పింఛను ఇస్తున్నది. మాలాంటి వారెందరో జీవితాలను ఆసరా నిలబెడుతున్నది. గతంలో పింఛను తక్కువగా ఉండేది. తెలంగాణ వచ్చినంకనే పింఛను పెరిగింది.
– చావా రేవతి, వితంతు పింఛనుదారు,కూసుమంచి

Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

