ఖమ్మం, అక్టోబర్ 27 : పెండింగ్‌లో ఉన్న పెన్షనర్ల బకాయిలను సత్వరమే చెల్లించాలని, లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం(ఎస్జీపీఏటీ) ఆధ్వర్యంలో జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ ఎదుట పెన్షనర్లు సోమవారం ధర్నా నిర్వహించారు. పెన్షనర్లు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ధర్నా కార్యక్రమాన్ని ఎస్జీపీఏటీ రాష్ట్ర కార్యదర్శి వి.మేరీ ఏసుపాదం ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు పరిశ పుల్లయ్య అధ్యతక్షన జరిగిన కార్యక్రమంలో పెన్షనర్ల సంఘాల నేతలు, ఉపాధ్యాయ, ప్రజా సంఘాలు, వివిధ పార్టీల నేతలు పాల్గొని ప్రసంగించారు.
రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్ల పట్ల వివక్ష పూరిత వైఖరిని అవలంబిస్తున్నదని, వారిని ఆర్థిక ఇబ్బందులకు గురిచేసి వారి మరణాలకు కారణమవుతున్నదని ఆరోపించారు. 18 నెలల క్రితం ఉద్యోగ విరమణ చేసినా ఏ ఒకరికి బకాయిలు చెల్లించలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఉద్యోగులు దాచుకున్న సొమ్మును సైతం ప్రభుత్వాలు వాడుకుంటున్నాయని ఆరోపించారు. పెద్ద పెద్ద గుత్తేదారులకు, ఇతర అవసరాలకు కోట్లు ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు దాచుకున్న సొమ్ము ఇచ్చేందుకు వచ్చిన ఇబ్బంది ఏమిటని వారు ప్రశ్నించారు.
సమస్యల పరిషారానికి సంఘటిత ఐక్య పోరాటాలే మార్గమని, ఆందోళనలను మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కలెక్టరేట్లో డీఆర్వో పద్మశ్రీకి వినతిపత్రం అందజేశారు. ధర్నాలో సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వరరావు, టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె.విజయ్, మాజీ ప్రధాన కార్యదర్శి వి.మనోహర్‌రాజు, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్కే కరీం, టాప్రా జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణం నాగేశ్వరరావు, టీయూసీఐ రాష్ట్ర కార్యదర్శి ఆవుల అశోక్, విశ్రాంత అధ్యాపక సంఘ నాయకులు ఎ.విద్యాసాగర్, మారెట్ కమిటీ ఉద్యోగ సంఘం నాయకులు జల్లా వెంకటేశ్వర్లు, ఎస్జీపీఏటీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాయల రవికుమార్, ఐవీ భాసరాచారి, శ్యాంసుందర్, జి.లక్ష్మయ్య, భద్రయ్య తదితరులు ప్రసంగించారు.