ఖమ్మం ఎడ్యుకేషన్/ ఖమ్మం రూరల్, డిసెంబర్ 22 : కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లోని బాలికలకు సత్వరమే విద్యాబోధన అందించాలని పీడీఎస్‌యూ నాయకులు డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం కేజీబీవీ ఉద్యోగులు గడిచిన పది రోజులుగా సమ్మె చేస్తుండడంతో ఈ విద్యాలయాల్లో విద్యార్థినులకు బోధన నిలిచిపోయిందని అన్నారు. దీంతో కీలకమైన టెన్త్, ఇంటర్ పబ్లిక్ పరీక్షలు మరో మూడు నెలల్లో ఉన్న సమయంలో విద్యార్థినులు బోధనను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేజీబీవీ విద్యార్థినులకు సత్వరమే బోధనను ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఆయా విద్యార్థినులతో కలిసి ఖమ్మం అర్బన్ వెలుగుమట్ల కేజీబీవీ, ఖమ్మం రూరల్ మండలం బైపాస్‌రోడ్డు కేజీబీవీల ఎదుట పీడీఎస్‌యూ నాయకులు ఆదివారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నేతలు నామాల ఆజాద్, వెంకటేశ్ మాట్లాడుతూ.. కేజీబీవీల్లోని ఎస్ఎస్ఏ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం పది రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం, పైగా కేజీబీవీల్లో విద్యాబోధనకు అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అవి నామమాత్రంగానే ఉన్నాయని అన్నారు. ప్రభుత్వం తక్షణమే కేజీబీవీ ఉద్యోగులతో చర్చలు జరిపి వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకుంటే పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. సంఘం నాయకులు యశ్వంత్, స్టాలిన్, కార్తీక, దీపిక, నవీన, సంధ్య, స్వరూప, అనూష, దీప్తి, అనిత, శ్రీను, వెంకటేశ్, అశోక్, అఖిల, స్పందన, సింధు, మనీషా తదితరులు పాల్గొన్నారు.