ఖమ్మం, నవంబర్ 11 : పెన్షనర్ల పెండింగ్ బకాయిలతోపాటు అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఖమ్మం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద మంగళవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. శిబిరాన్ని జిల్లా శాఖ గౌరవ అధ్యక్షుడు మల్లికార్జునరావు ప్రారంభించగా.. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎల్.గోపీచంద్, కళ్యాణం నాగేశ్వరరావు మాట్లాడుతూ 18 నెలల క్రితం ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు చెల్లించకపోగా.. కనీసం జీపీఎఫ్ సొమ్ములు ఇవ్వడం లేదని ఆరోపించారు.
వెంటనే రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ చెల్లించాలని, నగదు రహిత హెల్త్ కార్డులు అందించాలని, 2023, జూలై 1 నుంచి ఆర్థిక ప్రయోజనాలు కలిగిన పీఆర్సీ ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న 5 డీఆర్‌లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు శ్రీరాములు, వై.రవికుమార్, మాధవరావు, భారతి ప్రసంగించారు. రేవా బాధ్యులు జైరామ్, లక్ష్మయ్య, రామారావు, శ్రీనివాస్‌రావులు శిబిరాన్ని సందర్శించి, సంఘీభావం తెలియజేసి మాట్లాడారు. దీక్షలో యూడీవీఎస్ రత్నకుమార్, వి.అంజయ్య, ఎల్.హరిసింగ్, టి.మురళీధర్‌రావు, చావా వెంకటేశ్వరరావు తదితరులు కూర్చున్నారు.
భద్రాద్రి కలెక్టరేట్ ఎదుట…
పాల్వంచ, నవంబర్ 11 : తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు భద్రాద్రి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉన్న ధర్నా చౌక్‌లో రిటైర్డ్ ఉద్యోగులు మంగళవారం ఒకరోజు నిరసన దీక్ష చేపట్టారు. దీక్షలో కూర్చున్న వారికి పూలమాలలు వేసి శిబిరాన్ని ప్రారంభించారు. ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ భద్రాచలం కమిటీ ట్రెజరర్ బందు వెంకటేశ్వరరావు, రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.ముత్యం, అసోసియేషన్ ముఖ్య సలహాదారు వెంకటేశ్వర్లు, రమణమూర్తి, రిటైర్డ్ పోలీస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు, మెడికల్ అండ్ హెల్త్ నాయకుడు వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. 2024లో ఉద్యోగ విరమణ పొందిన రిటైర్డ్ ఉద్యోగులకు అందాల్సిన కమ్యూటేషన్, గ్రాట్యుటీ తదితర రిటైర్డ్ బెనిఫిట్స్ అందలేదని, వాటిని వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. అలాగే అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నింటినీ ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.