సంక్రాంతి సంబురాలకు ప్రజలు సిద్ధమయ్యారు. కన్నతల్లి లాంటి సొంతూరులో పండుగ జరుపుకునేందుకు పట్టణాల నుంచి పల్లెలకు చేరుకుంటున్నారు. అన్ని దారులు పల్లెల వైపే కదులుతున్నాయి. ఆరురోజుల సెలవులు కలిసిరావడంతో కుటుంబసమేతంగా పల్లెలకు పరుగులు పెడుతున్నారు. దీంతో బస్సులు, రైళ్ల ప్రాంగణాలు కిక్కిరిసిపోతున్నాయి. హైదరాబాద్ వంటి ప్రధాన నగరం నుంచి రావడానికి సరిపడా బస్సులు లేకపోవడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. పిండివంటల ఘుమఘుమలు, ఇళ్ల అలంకరణలతో ఊళ్లల్లో పండుగ శోభ ఉట్టిపడుతున్నది. మూడ్రోజుల పండుగను మది నిండుగా జరుపుకునేందుకు సర్వం సిద్ధమైంది.
– భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 11 (నమస్తే తెలంగాణ)
సంక్రాంతి పండుగకు దారులన్నీ పల్లెల వైపే పరుగులు పెడుతున్నాయి. పండుగకు ఆరురోజుల సెలవులు కలిసిరావడంతో దూరప్రాంతం నుంచి బంధువులందరూ పల్లెలకు పరుగెడుతున్నారు. హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు బస్సులు దొరక్క ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తున్నది. మరోవైపు మహిళలకు ఉచిత బస్సులు ఉండడంతో బస్సులన్నీ మహిళలతో కిక్కిరిసిపోయాయి. మగవాళ్లకు బస్సులు లేక తలోదారి అవుతున్నారు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు పుట్టిన ఊరులో జరిగే సంబురాలకు రెడీ అయిపోతున్నారు. ఒకవైపు కోళ్లపందేలు, మరోవైపు ఏడాదికి ఒకసారి కలుసుకునే అవకాశాలు రెండూ కలిసి రావడంతో ఏటా పట్నంవాసులు పల్లెలకు పరుగెత్తడం ఆనవాయితీగా మారింది.
ఎక్కడున్నామన్నది కాదు.. ఎక్కడ పుట్టామన్నది లెక్క.. పుట్టిన ఊరును కన్నతల్లిని ఎవరూ మరచిపోరు.. అలాంటి కన్నఊరు సంక్రాంతి పండుగ ప్రతి ఏటా పట్నంవాసులకు మధుర జ్ఞాపకాలను మిగుల్చుతుంది. బతుకుదెరువు కోసం పట్నం వెళ్లినా పల్లె సంస్కృతి మదిలోనే మెదులుతూ ఉంటుంది. చదువుకున్న రోజులు.. స్నేహితులతో ఆడుకున్న ఆటలు, వచ్చీరాని పాటలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు తాతయ్యలతో సరదాగా చెప్పిన కబుర్లు గుర్తుకురావడంతో మనసులో గూడు కట్టుకున్న ఆనందోత్సాహం మనిషి మనసును పులకింపజేస్తుంది. అంతటి సరదాను అందరితో పంచుకోవడం కోసం పల్లెకు వెళ్లాల్సిందే మరి.
తెలుగు రాష్ర్టాల్లో ఎక్కడకు వెళ్లినా సంక్రాంతి పండుగ తాలూకా కబుర్లు చెప్పుకుంటారు. అలాంటి సరదాను పంచుకోవడం కోసం పట్నంవాసులు పల్లెలకు పరుగెడుతున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాల పల్లెల్లో బంధువులతో గడపడానికి సిద్ధమయ్యారు. నెలరోజుల ముందుగానే బస్సులు, రైళ్లకు రిజర్వేషన్లు చేసుకుని సిటీ తీపిని పల్లెల్లో ఉన్న అమ్మానాన్నలకు తినిపించేందుకు పయనమయ్యారు. గత వారంరోజుల నుంచి బస్సులు, రైళ్లు ప్రయాణికులతో రద్దీగా మారాయి. ప్రైవేటు ట్రావెల్స్ సైతం బిజీ అయిపోయాయి.
సంక్రాంతి పండుగకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నాయి. కానీ.. అవి ప్రయాణికులకు సరిపోవడం లేదు. అయినా రద్దీ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. నెలరోజుల ముందు నుంచే రిజర్వేషన్లు చేయించుకుని పట్నం నుంచి ప్రయాణికులు ప్రయాణమవుతున్నారు. దాంతో ఖమ్మం వరకు నడుస్తున్న రైళ్లు, బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. ప్రైవేటు బస్సులు కూడా ఖాళీ లేకుండా ఉన్నాయి. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఈ పండుగకు మరింత కళను తెచ్చిపెట్టనుంది. ప్రత్యేక బస్సులను కూడా మహిళలకు ఉచితమే అని చెప్పడంతో ఆడబిడ్డలు పల్లెలకు పయనమవుతున్నారు. ఆర్టీసీ అదనంగా బస్సులు వేసినా ప్రయాణికుల రద్దీ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇదే అదునుగా ఆర్టీసీ డైరెక్ట్ సర్వీసులను వేసి అధికరేట్లను వసూళ్లు చేస్తున్నది. ముక్కోటికి కూడాప్రత్యేక బస్సులను నడపకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సంక్రాంతికి కూడా అదే పరిస్థితి కొనసాగుతున్నది.
పల్లెలు సంక్రాంతి శోభను సంతరించుకుంటున్నాయి. ఏ పల్లె చూసినా పందెంకోళ్ల కూతలు, సైకిల్ కనబడే రహదారుపై కార్ల హారన్లు, తాటిచెట్ల కింద సరదాగా ముచ్చట్లు చెప్పుకునే దోస్తులు, తాతముత్తాల పిల్లలతో బంధువుల ఇళ్ల వద్ద సందడిగా మారనున్నాయి. ఎన్నాళ్లకి తాగామురా మన పాడి ఆవుల పాలు, మజ్జిగ అంటూ ఎంజాయ్ చేస్తూ రోడ్లపై సందడిగా కనిపించే పాతమిత్రులను చూసి ముసలోళ్ల సంతోషం అంతాఇంతా కాదు. మరోవైపు పిండి వంటకాలతో ఇళ్లన్నీ ఘుమఘుమలాడుతున్నాయి.