స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ సమాయత్తమవుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై ప్రజల్లోంచి వస్తున్న వ్యతిరేకత బీఆర్ఎస్కు సానుకూలంగా మారుతుండడంతో పార్టీ నుంచి వివిధ స్థానిక సంస్థల పదవులకు పోటీ చేసేందుకు గ్రామ, మండల స్థాయి నాయకుల్లో ఉత్సాహం పెల్లుబుకుతోంది. ఖమ్మం జిల్లాలోని 20 మండలాల్లో 20 జడ్పీటీసీ స్థానాలకు, 283 ఎంపీటీసీ స్థానాలకు, 571 సర్పంచ్ స్థానాలకు, అలాగే వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్ల్లో బీఆర్ఎస్కు చెక్కు చెదరని క్యాడర్, జన బలం ఉండడంతో పార్టీ శ్రేణులు ఆయా పదవులకు పోటీ చేసి తమ రాజకీయ భవితవ్యాన్ని పరీక్షించేందుకు క్షేత్రస్థాయిలో సిద్ధమవుతున్నాయి.
-ఖమ్మం, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం కోసం ఖమ్మం జిల్లావ్యాప్తంగా శ్రేణులను బీఆర్ఎస్ సమాయత్తం చేస్తోంది. పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు అధ్యక్షతన ఖమ్మంలోని సప్తపది ఫంక్షన్ హాల్లో జిల్లాలోని ఐదు నియోజకవర్గాల పరిధిలోని పార్టీ శ్రేణులతో బుధవారం సన్నాహక సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది.
బుధవారం మధ్యాహ్నం జరిగే ఈ సమావేశంలో పార్టీ నేతలు స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సన్నాహక సమావేశానికి రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్‌రెడ్డి, బానోతు చంద్రావతి, ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు తదితరులు హాజరుకానున్నారు.
తిరుగులేని శక్తిగా బీఆర్ఎస్..
2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా అనేక జడ్పీటీసీ స్థానాలను, ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకొని బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్‌గా లింగాల కమల్‌రాజు, భద్రాద్రి కొత్తగూడెం తొలి జిల్లా పరిషత్ చైర్మన్‌గా కోరం కనకయ్య బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. అయితే, కనకయ్య ఆ తరువాత బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రెండు జిల్లాల వైస్ చైర్మన్లను సైతం బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అత్యధిక ఎంపీటీసీ స్థానాలను గెలుపొందడం ద్వారా ఎంపీపీ పదవులను కూడా బీఆర్ఎస్ గెలుచుకుంది.
ఇంకా గ్రామ పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో అనేక గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీఆర్ఎస్కు పూర్తిస్థాయిలో వెన్నుదన్నుగా ఉన్న ఖమ్మం జిల్లా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇదే రీతిలో అత్యధిక స్థానాలను గెలుపొందే విధంగా సమాయత్తమవుతోంది. ఇందుకోసం పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధు ఆయా నియోజకవర్గాల ఇన్చార్జులకు ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు.
అలాగే, బీఆర్ఎస్కు చెందిన రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్‌రెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు తదితరులు హాజరై పార్టీ అభ్యర్థుల గెలుపునకు వ్యూహ ప్రతివ్యూహాలను రూపొందించనున్నారు. సన్నాహక సమావేశం నిర్వహిస్తుండడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
ఈ స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహం నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలు విసిగివేసారి ఉన్నారు. అందుకని ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయదుందుభి మోగిస్తుంది. క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వస్తున్న స్పందన, పార్టీ శ్రేణుల ఉత్సాహమే జిల్లాలో బీఆర్ఎస్ పార్టీగా తిరుగులేని శక్తిగా నిలుస్తుందనడానికి నిదర్శనం. గురువారం నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో నాతోపాటు పార్టీ కీలక నేతలు పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు.
-తాతా మధు, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు
బోనకల్లులో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిక
బోనకల్లు, అక్టోబర్ 7: మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మరీదు శ్రీను, మరీదు వెంకట్, బాణావత్ వెంకటేశ్వర్లు, మోర్ల రమేశ్, మరీదు గోపి, మోర్ల గోపి, శ్రీను, మురళితోపాటు మరో రెండు కుటుంబాల వారు మంగళవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జునరావు, మాజీ జడ్పీటీసీ బానోతు కొండ, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గుండపునేని సుధాకర్‌రావులు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 22 నెలల కాంగ్రెస్ పాలనతో విసుగు చెందిన ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు యార్లగడ్డ చిన్ననరసింహ, తేల్లూరి రమేశ్, యార్లగడ్డ రమేశ్, మోర్ల నరసింహారావు, మోర్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఈసారి బీఆర్ఎస్ విజయఢంకా ఖాయం: సండ్ర
తల్లాడ, అక్టోబర్ 7: కేసీఆర్ పదేళ్ల పాలనలో రైతు సంక్షేమమే ధ్యేయంగా పని చేశారని, ఆయన పాలనను ప్రజలు ఇప్పటికి గుర్తు చేసుకుంటున్నారని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. అంజనాపురం గ్రామానికి చెందిన ఆర్ఎంపీ కిన్నెర వెంకటేశ్వరరావుతోపాటు మరికొందరు వివిధ పార్టీల నుంచి మాజీ ఎమ్మెల్యే సండ్ర సమక్షంలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి సండ్ర పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయఢంకా మోగించడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ నాయకులు రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, కేతినేని చలపతిరావు, మువ్వా మురళి, నల్లగొర్ల కృష్ణయ్య, సాయినేని రామారావు, అంకోలు శ్రీను, జోగయ్య తదితరులు పాల్గొన్నారు.