కారేపల్లి, జూన్ 3: ఖమ్మం జిల్లా సింగరేణి మండల వ్యాప్తంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో 132 అంగన్వాడీ కేంద్రాలు (Anganwadi Center) పనిచేస్తున్నాయి. కొన్ని సెంటర్లు చిన్నారులతో కలకలలాడుతుండగా కొద్ది గ్రామాలలోని సెంటర్లలో మాత్రం 3 నుంచి 5 సంవత్సరాల లోపు చిన్నారులు ఉన్నప్పటికీ అక్కడి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా బోసిపోతున్నాయి. కొన్ని సెంటర్లలో పని చేసే సిబ్బంది ప్రవర్తన సరిగా లేకపోవడంతో పిల్లల తల్లిదండ్రులు అంగన్వాడీ కేంద్రాలకు పంపడానికి మక్కువ చూపడం లేదు. దీనికితోడు పలువురు సిబ్బంది అంగన్వాడీ కేంద్రాలలో ఉంటూనే ఇతర మార్గాల్లో ఆదాయం వచ్చే వ్యాపారాలు చేస్తున్నట్లు తెలిసింది.
ఈ విషయమై కామేపల్లి కారేపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారి(సీడీపీఓ) దయామణిని ‘నమస్తే తెలంగాణ’ వివరణ కోరగా.. వేసవి సెలవుల తర్వాత జూన్ 2 నుంచి అంగన్వాడీ కేంద్రాలను పునఃప్రారంభించినట్లు తెలిపారు. సింగరేణి మండల వ్యాప్తంగా 8 మంది టీచర్లు, 62 మంది ఆయాల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. కొన్ని సెంటర్లలో పిల్లలు ఉన్నప్పటికీ అంగన్వాడీ కేంద్రాలు ఖాళీగా ఉంటున్నాయన్న విషయం తమ దృష్టికి కూడా వచ్చినట్లు చెప్పారు. రెండు మూడు రోజుల్లో అంగన్వాడీ టీచర్లు, ఆయాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని, ప్రీస్కూల్ పిల్లలందరూ అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే విధంగా వారికి బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలిపారు. గ్రామాలలో ప్రీస్కూల్ పిల్లలు ఉండి కూడా అంగన్వాడీకి రాని వారిని సెంటర్లకు వచ్చే విధంగా కృషి చేయని సిబ్బందికి హెచ్చరికలు జారీ చేస్తానన్నారు.