వేంసూరు, ఆగస్టు 17 : సబ్జెక్టు టీచర్లు లేకపోవడంతో చదువులు ముందుకు సాగడం లేదని, వెంటనే ఉపాధ్యాయులను నియమించి తమకు న్యాయం చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు తల్లిదండ్రులు మాట్లాడుతూ పాఠశాలలో 6 నుంచి పదో తరగతి వరకు 204 మంది విద్యార్థులున్నా సబ్జెక్టు టీచర్లు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, పరీక్షలు దగ్గర పడుతుండడంతో ఎలా రాయాలోనని దిగులు చెందుతున్నారని అన్నారు.
ఇద్దరు తెలుగు, ఇద్దరు జీవశాస్త్రం, ఒక హిందీ టీచర్ ఇటీవల బదిలీ కావడంతో ఖాళీలు ఏర్పడ్డాయని, ఆ పోస్టుల్లో ఇంతవరకు ఎవరినీ కేటాయించలేదని ఆరోపించారు. దీనిపై ఎంఈవో వెంకటేశ్వర్లును విద్యార్థుల తల్లిదండ్రులు ఫోన్లో సంప్రదించగా.. ఇది తన పరిధిలో లేదని, జిల్లాస్థాయి పరిధిలో ఉన్నదని తెలిపారు. ఈ క్రమంలో డీఈవోకు ఫోన్ చేయగా.. పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉన్న మాట వాస్తవమేనని, మంగళవారం వరకు టీచర్లను సర్దుబాటు చేస్తామని చెప్పారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన విరమించారు.