ఏడాది కాలానికే కాంగ్రెస్ పాలనపై రాష్ట్రంలో తిరుగుబాటు మొదలైంది. సకలవర్గాలు సమ్మెబాట పట్టాయి. సంవత్సరంపాటు ప్రజాపాలన గొప్పగా సాగిందంటూ కాంగ్రెస్ పాలకులు సంబురాలు చేసుకున్నప్పటికీ ఆ సంతోషాల జాడలు ప్రజల్లో మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. పైగా ‘మా సమస్యలను పరిష్కరించండి మహాప్రభో..’ అంటూ అన్నివర్గాల ప్రజలు నిత్యం రోడ్డెక్కుతున్నారు.
ప్రస్తుతం ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా వేలసంఖ్యలో కార్మికులు, చిరుద్యోగులు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, మధ్యాహ్న భోజన కార్మికులు, పంచాయతీ కార్మికులు మ్మెబాట పట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆశా కార్యకర్తలు ఏకంగా ఒకడుగు ముందుకేసి బస్సుయాత్రకు శ్రీకారం చుట్టారు.
– భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ)
అమలు సాధ్యంకాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ ఆ హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైంది. దీంతో కార్మిక సంఘాలు పెద్దఎత్తున నిరసన గళం వినిపిస్తున్నాయి. పంచాయతీ కార్మికులు తాజాగా సమ్మె నోటీసు ఇచ్చి రెండ్రోజులు సమ్మెలో పాల్గొన్నారు. నెలనెలా వేతనాలు ఇవ్వలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ సర్కారు ఉండడంతో వ్యతిరేకత కూడగట్టుకున్నది. సర్వశిక్షా ఉద్యోగులు గత 20 రోజులుగా కలెక్టరేట్ వద్ద పెద్దఎత్తున సమ్మె చేస్తున్నారు. దీంతో 23 కస్తూర్బాగాంధీ స్కూళ్లు మూతబడ్డాయి. అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు.
రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో విఫలమైంది. రూ.2 లక్షల వరకు తీసుకున్న రైతు రుణాలనుమాఫీ చేస్తామన్న సీఎం రేవంత్రెడ్డి నేటికి 50 శాతం కూడా మాఫీ చేయలేదు. దీంతో రైతులు రోడ్డెక్కారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. రైతుభరోసా మీద కూడా విధివిధానాలు కూడా ప్రకటించకపోవడంతో యాసంగి పంట తర్వాత రైతులు మళ్లీ రోడ్డెక్కనున్నారు.
ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతుగా నిలిచిన ఎర్రజెండాలు.. అధికారంలోకి వచ్చాక హామీలు అమలు చేయకపోవడంతో కార్మికుల పక్షాన నిలబడుతున్నాయి. దీంతో సమ్మెలు చేస్తున్న కార్మికులకు, ఉద్యోగులకు మద్దతు తెలుపుతున్నాయి. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా ఉపయోగంలేదని తాజాగా సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు ఆరోపణ కూడా చేశారు. మరోవైపు పంచాయతీ కార్మికులకు అండగా ఉంటున్నామని సీపీఐ అనుబంధ సంఘమైన ఏఐటీయూసీ నాయకులు అంటూ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. మినీ అంగన్వాడీలకు జీతాలు ఇవ్వడం లేదని, మధ్యాహ్న భోజనవర్కర్లకు పెండింగ్ బిల్లులు ఇవ్వలేదని, సెకండ్ ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించలేదని దుయ్యబడుతున్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేకపోతున్నారు. రైతులకు రుణమాఫీ అన్నారు. 50 శాతం కూడా రుణమాఫీ అవ్వలేదు. రెండు లక్షలపైన ఉన్నవారికి కూడా చేస్తామన్నారు. రెండు లక్షలలోపు వారికే పూర్తిగా చెయ్యలేదు. మిగతా వాళ్లకి ఎప్పుడిస్తారో మరి? మూడు పంటలు దాటిపోయినా రైతుభరోసా ఇవ్వలేదు. నేటికీ ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. బీఆర్ఎస్ హయాంలో టంఛన్గా ఖాతాల్లో పడేవి.
– భూపతి రమేశ్, రైతు, రావికంపాడు
సర్వశిక్షా ఉద్యోగులు సమ్మె చేయడం ఇప్పటికీ 20 రోజులు అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదు. కస్తూర్బాగాంధీ పాఠశాలులు మూతబడ్డాయి. పదో తరగతి, ఇంటర్ పరీక్షలు దగ్గరపడ్డాయి. విద్యార్థులు ఇంటికి వెళ్లిపోయారు. భోజనం తిని కొంతమంది స్కూళ్ల వద్దనే ఉంటున్నారు. అలవిగాని హామీలు ఎందుకు ఇవ్వాలి. జిల్లాలో 23 స్కూళ్లు బంద్ అయ్యాయి.
– మోహన్, సర్వశిక్షా అభియాన్ సంఘం జిల్లా అధ్యక్షుడు
గ్రామాల్లో ఎవరికి అనారోగ్యం వచ్చినా ఫస్ట్ చూసేది మేమే. కానీ మాకు పెండింగ్ వేతనాలు ఇవ్వడం లేదు. ఫిక్స్డ్ జీతం ప్రకటించలేదు. ఎన్నికల్లో మాత్రం హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. మేమూ మనుషలమే కదా? బతకాలంటే మాకు సరైన జీతాలు ఉండాలి. స్టేట్ మొత్తం కదిలింది. మాకు సీఐటీయూ, ఏఐటీయూసీ మద్దతు ఉంది.
– ధరావత్ విజయ, శాంతినగర్, టేకులపల్లి మండలం