దమ్మపేట రూరల్, ఫిబ్రవరి 13: ఏడేళ్లుగా పామాయిల్ గెలల క్రషింగ్ లక్ష్యం చేరడం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న అశ్వారావుపేట, అప్పారావుపేట ఫ్యాక్టరీల సామర్థ్యానికి సరిపడా పామాయిల్ గెలల ఉత్పత్తి జరగడం లేదు. రాష్ట్రంలో తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌కు ఎనిమిది జిల్లాల్లో పామాయిల్ ఫ్యాక్టరీ జోన్లు ఉన్నాయి. వీటిలో 2021-22 ఆర్థిక సంవత్సరం వరకు 56,038 ఎకరాల్లో పామాయిల్ తోటలు సాగవుతున్నట్లు ఆయిల్‌ఫెడ్ లెక్కల ప్రకారం తెలుస్తోంది. 7-8 సంవత్సరాల వయసు పైబడిన తోటల నుంచి మాత్రమే పూర్తిస్థాయిలో పామాయిల్ గెలల సగటు దిగుబడి 8-10 మెట్రిక్ టన్నుల గెలలు వస్తుందని అధికారిక అంచనా. దీని ప్రకారం 39,400 ఎకరాల నుంచి సగటు దిగుబడి వస్తున్నది. మిగిలిన 16,638 ఎకరాల నుంచి సగటు దిగుబడి 3-5 టన్నుల సగటు దిగుబడి వస్తున్నది.
అశ్వారావుపేట, అప్పారావుపేట ఫ్యాక్టరీల్లో 2018-19 ఆయిల్ ఇయర్ నుంచి ఇటీవల ముగిసిన 2023-24 ఆయిల్ ఇయర్ వరకు లక్ష్యం చేరుకోలేదు. ముగిసిన ఆయిల్ ఇయర్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా మినహాయిస్తే రాష్ట్రంలోని మిగిలిన ప్రైవేటు కంపెనీల జోన్లతో సహా వచ్చిన గెలలు సుమారు 1,580 టన్నులు మాత్రమే. ఇది ఈ ఆయిల్ ఇయర్లో 6 వేల మెట్రిక్ టన్నులు మించకపోవచ్చనేది అంచనా. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో సుమారు 10 వేల ఎకరాల్లో పామాయిల్ తోటలు కలిగిన ప్రైవేటు కంపెనీ ఇప్పటివరకు ఫ్యాక్టరీ నిర్మించలేదు. ఈ కంపెనీ తప్పని పరిస్థితుల్లో ఫ్యాక్టరీ నిర్మించినా 5 టీపీహెచ్తో మాత్రమే నిర్మించనుంది. ప్రాసెసింగ్ ప్లాంట్ల అవసరమని ఆయిల్‌ఫెడ్ అంచనా ప్రకారం 124 టీపీహెచ్ ప్రాసెసింగ్ ప్లాంటు అవసరం కాగా.. లక్ష్యానికి మించి 150 టీపీహెచ్ సామర్థ్యం కలిగిన ఫ్యాక్టరీలు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆయిల్‌ఫెడ్ మాత్రం వందల కోట్లు అప్పు చేసి మరీ అవసరం లేని అధిక సామర్థ్యంతో కొత్త ప్లాంట్లు నిర్మిస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు.
ఇప్పటికే అశ్వారావుపేటో 30 టీపీహెచ్(టన్ను పర్ హవర్), అప్పారావుపేటలో 90 టీపీహెచ్ సామర్థ్యంతో పామాయిల్ ప్రాసెసింగ్ ప్లాంట్లు తెలంగాణ ఆయిల్‌ఫెడ్ యాజమాన్యంలో పని చేస్తున్నాయి. వీటికి త్వరలో సిద్దిపేట జిల్లాలో నిర్మాణం పూర్తవుతున్న 30 టీపీహెచ్ ఫ్యాక్టరీ తోడై 150 టీపీహెచ్ సామర్థ్యానికి చేరుకోనుంది. సాధారణంగా రోజులో సగటున 20 గంటలు ప్రాసెసింగ్ ప్లాంట్(ఫ్యాక్టరీ) పనిచేస్తుంది. ఈ సామర్థ్యం ప్రకారం రోజుకు 3 వేల మెట్రిక్ టన్నుల పామాయిల్ గెలలను ప్రాసెసింగ్ చేసే సామర్థ్యం వస్తోంది. ఇప్పుడు పనిచేస్తున్న అశ్వారావుపేట ఫ్యాక్టరీ సుమారు 6 నెలలు, అప్పారావుపేట ఫ్యాక్టరీ 4-5 నెలలు మెయింటెనెన్స్ పేరుతో మూతవేస్తున్నారు. సిద్దిపేటలో నిర్మిస్తున్న ఫ్యాక్టరీ 6 నెలలకు మించి మూతవేయాల్సిన పరిస్థితి తప్పదు. లక్ష్యానికి అనుగుణంగా పామాయిల్ సాగు మందకొడిగా సాగుతోంది. దీని ప్రకారం కొత్త ఫ్యాక్టరీల ఆవశ్యకత రాబోయే ఐదారేళ్ల వరకు ఆయిల్‌ఫెడ్‌కు అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.