15 రోజులపాటు ముమ్మరంగా కొనసాగిన పనులు
589 పంచాయతీల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు
కలెక్టర్ పర్యవేక్షణతో విజయవంతమైన ‘ప్రగతి’ పనులు
మామిళ్లగూడెం, జూన్ 18: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘పల్లె ప్రగతి’ కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా ముగిసింది. కలెక్టర్ వీపీ గౌతమ్ పర్యవేక్షణలో జిల్లాలోని 20 మండలాల్లో పల్లె ప్రగతిలో గుర్తించిన పనులను అధికారులు పూర్తి చేశారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల సహకారంతో గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు జరిగాయి. ఈ నెల 3 నుంచి 18 వరకు ప్రకటించిన ప్రణాళిక ప్రకారం పల్లె ప్రగతిలో గుర్తించిన పనులను 95 శాతం వరకు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 589 పంచాయతీల్లో పల్లెప్రగతి పనులు ముమ్మరంగా కొనసాగాయి.
ప్రధానంగా 2,615.18 కిలో మీటర్ల రోడ్లను శుభ్రం చేశారు. గ్రామాల్లో 1,277.29 కిలో మీటర్ల సైడ్ కాలువల్లో మురుగును ఎత్తి వేశారు. గ్రామాల్లో ఉండే ప్రభుత్వ సంస్థలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీలు, ఆరోగ్య కేంద్రాలు వంటి 3,038 ప్రాంతాలను పరిశుభ్రం చేశారు. గ్రామాల్లో ఉన్న 702 శిథిల భవనాలు, ఇతర కట్టడాలను కూల్చి వేశారు. 2,800 ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించారు. గ్రామాల్లో 1,010 రోడ్లలో ఏర్పడిన గుంతలను పూడ్చి వేశారు. గ్రామాల్లో ప్రజలను చైతన్యం చేసి 604 వ్యక్తిగత ఇంకుడు గుంతలు, 151 సామూహిక ఇంకుడు గుంతలు నిర్మించారు. గ్రామాల్లో వాడకంలో లేని 165 వరకు బోర్లు, సాధారణ బావులను పూడ్చి వేశారు. నూతనంగా నిర్మించిన 20 వైకుంఠధామాలకు విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేశారు. మరో 65 వైకుంఠధామాల్లో నీటి సౌకర్యాన్ని కల్పించారు. గ్రామాల్లో ఉన్న 415 కిలో మీటర్ల మేర ఇరువైపులా మొక్కలను నాటారు. విద్యుత్ సమస్యలను పరిష్కరించేందకు 842 పోల్స్‌కు 3వ వైరును లాగి అక్కడి ప్రజల సమస్యలను పరిష్కరించారు. విరిగిన, వంగిన, తప్పుపట్టిన 788 పోల్స్‌ను తొలగించి వాటి స్థానంలో కొత్త వాటిని వేశారు. 1,140 మీటర్ల సాగిన, వంగిన వైర్లను లాగి విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా గ్రామాల్లో కార్యక్రమాలను పూర్తి చేశారు.