పాలేరు జలాశయం ఏర్పడిన తరువాత ఈ తరహా నీటి కష్టాలు ఎన్నడూ రాలేదు. రిజర్వాయర్‌లోని నీటిమట్టం రోజురోజుకూ తగ్గుతుండడం అటు అధికారులను, ఇటు ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. ఐదు జిల్లాల్లోని 2,450 గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని అందించే అధికారులు పాలేరు నుంచి నీరు ఇవ్వలేమని, ఎక్కడికక్కడ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని స్థానిక అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో సాగునీటి సంగతి దేవుడెరుగు.. ముందుగా తాగునీరు అందే నమ్మకం కూడా సన్నగిల్లుతోంది.
పాలేరులో ఉన్న కాసింత నీరు కూడా వృథా కాకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి నీటిబొట్టునూ జాగ్రత్తగా వాడుకుంటున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే వేసవిలో తాగునీటి సమస్య మరింత జఠిలమయ్యే ప్రమాదం ఉంది. అధికారులు పాలేరు కాలువకు బూస్టర్ పంపులు ఏర్పాటు చేసి నీటిని తోడి మిషన్ భగీరథకు అందించనున్నారు. మరో 15 రోజులకు సరిపడినన్ని నిల్వలు మాత్రమే పాలేరులో ఉన్నాయి. ఈ పరిస్థితిలో వేసవి గండాన్ని గట్టెక్కించే అంశంపై ఉన్నతస్థాయిలో చర్చ జరుగుతోంది. -కూసుమంచి, మార్చి 14
పాలేరు జలాశయంలో నీరు లేకపోవడంతో జిల్లా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మం జిల్లాలో 17 మండలాల్లో సాగునీటికి, తాగునీటికి, పొరుగున ఉన్న నాలుగు జిల్లాల్లోని ప్రజల తాగునీటికి ఈ పాలేరు జలాశయమే వరప్రదాయిని. కానీ.. ఈ ఏడాది ఇందులో నీరు అడుగంటుతుండడంతో దానిమీద ఆధారపడిన ప్రజల పరిస్థితి దినదిన గండంగా మారింది. నీటిమట్టం ఐదు అడుగుల అట్టడుగు స్థాయికి పడిపోయే వరకు సాగర్ డ్యాం నుంచి నీరు వచ్చే అవకాశాలు లేవు.
దీంతో పాలేరు నుంచి తాగునీటిని అందించడం సాధ్యం కాదని గుర్తించిన ఖమ్మం కార్పొరేషన్ సహా సూర్యాపేట, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాల మిషన్ భగీరథ అధికారులు స్థానికంగానే ఇతర మార్గాల ద్వారా తాగునీటిని అందించే చర్యలు మొదలు పెట్టారు. ఖమ్మం నగరానికి తీర్థాల కూడలి వద్ద మున్నేరు నుంచి తీసుకోవాలని నిర్ణయించారు. ప్రస్తుతానికి పాలేరు నుంచి మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని అందించడానికి రోజుకు 135.45 క్యూసెక్కుల నీటిని తీసుకుంటున్నారు.
పాలేరు పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగులు కాగా.. గురువారం ఉదయానికి 9.2 అడుగులు మాత్రమే ఉంది. 2.558 టీఎంసీలు పూర్తి సామర్థ్యం కాగా.. ప్రస్తుతం 0.779 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. రిజర్వాయర్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఐదు అడుగుల అట్టడుగుస్థాయి వరకు నీటిని తీసుకొని అవసరాలకు వినియోగించాలని అధికారులు నిర్ణయించారు. అటు శ్రీరాంసాగర్ నీటిని పాలేరుకు మళ్లించడానికి అక్కడ కూడా నీళ్లు లేవు. ఇటు ఎగువ ప్రాజెక్టులదీ అదే పరిస్థితి. సాగర్ డ్యాం కేఆర్ఎంబీ పరిధిలోకి వెళ్లడంతో దాని నీటిమీద రాష్ట్ర ప్రభుత్వానికి అజమాయిషీ లేకుండా పోయింది.
పరిస్థితి తీవ్రంగా ఉండడంతో అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నారు. బూస్టర్ పంపులు ఏర్పాటు చేసి అప్రోచ్ కాలువల్లో నీటిని మిషన్ భగీరథ పంపుహౌస్‌కు మళ్లిస్తున్నారు. మరో 2 అడుగుల నీటిమట్టం తగ్గితే అప్రోచ్ కాలువ నుంచి ఇన్‌టేక్ వెల్‌కు పూర్తిస్థాయిలో నీరు అందదు. ఇప్పటికే మినీ హైడల్ ప్రాజెక్టు పక్కనే గల పాత సంప్‌కు అధికారులు జేసీబీతో గాడి కొట్టించి నీటిని మళ్లించారు. మిషన్ భగీరథ కాలువకు కూడా అడ్డంగా ఉన్న పూడికను తీసివేశారు. ప్రధాన, పాత కాలువల గేట్ల నుంచి లీకేజీలు కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
పాలేరు జలాశయం నుంచి మిషన్ భగీరథకు రోజుకు 135.45 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. ఇవి కాకుండా.. ఎండతీవ్రతకు ఆవిరి, చుట్టుపక్కల మోటర్ల వినియోగం వంటి కారణాలతో మరో 26 క్యూసెక్కులు ఖర్చవుతున్నాయి. దీంతో ప్రతి రోజూ 0.25 అడుగుల మేరకు నీటిమట్టం తగ్గుతోంది. ఈ క్రమంలో మరో పది రోజుల్లో నీటిమట్టం పూర్తిగా తగ్గిపోనున్నది. ఈ నెల చివరి వరకు సాగర్ నుంచి కనీసం మూడు టీఎంసీల నీటిని వదిలి పాలేరు వరకు రెండు టీఎంసీలనైనా తెచ్చుకోకపోతే వేసవి గట్టెక్కే పరిస్థితి లేదు.
పాలేరులో ఉన్న నీటిని జాగ్రత్తగా వినియోగిస్తున్నాం. వేసవిలో తాగునీటి అవసరాలకు ఇవ్వాలనే ఆలోచనతో నీటిని ఎక్కడా వృథా కానివ్వడం లేదు. కాలువలపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. కాలువ గేట్ల వద్ద నీరు లీక్ కాకుండా చర్యలు తీసుకున్నాం. నీటిని ట్యాంపరింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
-విద్యాసాగర్, సీఈ, ఇరిగేషన్
మిషన్ భగీరథ కొత్త ఇన్‌టేక్ వెల్ ద్వారా పాలేరులో ఉన్న నీటిని మరో 15 నుంచి 20 రోజులపాటు అందించగలుగుతాం. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేపట్టాం. ఈ నెల చివరి వరకు సాగర్ నుంచి నీటిని ఇవ్వాలని కోరుతున్నాం. ఇందుకు సంబంధించి ఉన్నత స్థాయిలో నిర్ణయం జరగాల్సి ఉంది. ఇప్పటివరకు తాగునీటికి ఇబ్బదులు రాకుండా చూస్తున్నాం. ప్రజలు కూడా తాగునీటిని వృథా చేయొద్దు.
-శ్రీనివాస్, సీఈ, గ్రామీణ తాగునీటి సరఫరా