కూసుమంచి, అక్టోబర్ 19 : శాసనసభకు జరిగిన ఏ ఎన్నికల్లోన్నైనా జిల్లాలోని పాలేరు నియోజకవర్గం కీలకంగా మారింది. గత కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాల్లో ముగ్గురు ఎమ్మెల్యేలను క్యాబినెట్ మంత్రులుగా అందించింది ఈ నియోజకవర్గమే. జిల్లాలో ఎక్కువగా రాష్ట్ర క్యాబినెట్లో మంత్రులుగా పనిచేసిన వారు ఇక్కడి నుంచే ఉండడం గమనార్హం. 1962 నుంచి 2019 వరకు జరిగిన శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో క్యాబినెట్ హోదాలో సంభాని చంద్రశేఖర్, తుమ్మల నాగేశ్వరరావు, రాంరెడ్డి వెంకటరెడ్డి వివిధ శాఖలకు మంత్రులుగా పని చేశారు. ఈసారి కూడా పాలేరు నియోజకవర్గంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.
పాలేరు నియోజకవర్గం 1962 నుంచి 2009 వరకు ఎస్టీ రిజర్వుడ్ స్థానంగా ఉన్నది. అయితే నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జనరల్ సీటుగా మారింది. రిజర్వుడ్‌లో ఉన్నా.. జనరల్ సీటుగా మారినా పాలేరుకు జిల్లాలో ప్రత్యేక స్థానం ఉన్నది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు రాష్ట్రాన్ని పాలించిన క్రమంలో పాలేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వారికి తగిన ప్రాధాన్యత, గుర్తింపు లభించింది. కాంగ్రెస్ పార్టీ నుంచి మూడు దఫాలుగా సంభాని చంద్రశేఖర్, రాంరెడ్డి వెంకటరెడ్డి ఒకసారి మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. 2016లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన తుమ్మల నాగేశ్వరరావుకు బీఆర్ఎస్ ప్రభుత్వం మంత్రి పదవిని కేటాయించింది.
1962కు పూర్వ ఖమ్మం జిల్లాలో ఉన్న పాలేరుకు తర్వాత ఎస్సీ రిజర్వుడ్ స్థానంలో 11 దఫాలుగా సార్వత్రిక ఎన్నికలు, ఒకసారి మధ్యంతర ఎన్నికలు జరిగాయి. తర్వాత 2009లో పునర్విభజనతో ముదిగొండ మండలం మధిర నియోజకవర్గంలో కలవగా.. ఖమ్మంలో ఉన్న రూరల్ మండలం పాలేరు నియోజకవర్గంలో కలిసింది. పునర్విభజన తర్వాత తొలిసారి జిల్లాలో పాలేరు నియోజకవర్గానికే మంత్రి పదవి దక్కింది. రాష్ట్రంలో మొదటిసారి అధికారం చేపట్టిన తర్వాత 2016లో మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి మరణించారు. ఈ క్రమంలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో అప్పటికే బీఆర్ఎస్లో మంత్రిగా కొనసాగుతున్న తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నుంచి పోటీ చేసి గెలుపొంది మంత్రిగా కొనసాగారు. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వాల్లో సంభాని చంద్రశేఖర్ మంత్రిగా పని చేశారు. పునర్విభజన తర్వాత మొదటిసారి జరిగిన ఎన్నికల్లో రాంరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా పని చేశారు. పాలేరు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో 1.98 లక్షల ఓట్లు ఉండగా.. ఈసారి 2.32 లక్షల ఓట్లు ఉన్నాయి. అంటే.. 34 వేల ఓట్లు పెరిగాయి. ఎన్నికల సంఘం ఇంకా చేర్పులకు అవకాశం ఇవ్వడంతో ఓటర్లు మరింతగా పెరిగే అవకాశం ఉన్నది.