ఖమ్మం, మార్చి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అన్నదాతలు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కొనుగోలు చేసేందుకు జిల్లా పౌరసరఫరాల సంస్థ సిద్ధమవుతోంది. మరికొద్ది రోజుల్లో యాసంగి పంటలు కోసేందుకు రైతాంగం సమాయత్తమవుతోంది. ఈ తరుణంలో పౌరసరఫరాల శాఖ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు, రైతుల ద్వారా ధాన్యం కొనుగోలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఖమ్మం జిల్లాలో ఈ యాసంగిలో 2,44,127 ఎకరాల్లో రైతులు వరిసాగు చేశారు. దిగుబడిపై ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఇటీవల కురిసిన వర్షాలు రైతాంగానికి కొంత నిరాశ కలిగించే విధంగా ఉన్నాయి. దీంతో దిగుబడి ఏ విధంగా ఉన్నా ప్రభుత్వం కొనుగోలు చేసే ధాన్యానికి గిట్టుబాటు ధరతోపాటు బోనస్‌ను ఈసారైనా సకాలంలో వేయాలని రైతులు ఆశిస్తున్నారు.
ఖమ్మం జిల్లాలో ఈ సంవత్సరం 6,32,288 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో అత్యధికంగా 3,55,662 మెట్రిక్ టన్నులు సన్నరకం, 2,76,626 మెట్రిక్ టన్నులు దొడ్డురకం దిగుబడి వస్తుందనే అంచనాతో ఉన్నారు. ఐకేపీ గ్రూపులు, పీఏసీఎస్, డీసీఎంఎస్, మెప్మాల ద్వారా దొడ్డురకం, సన్నరకం ధాన్యం కొనుగోలు చేసేందుకు మొత్తం 331 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
జిల్లావ్యాప్తంగా ఈసారి అధికారుల అంచనాకు మించి యాసంగిలో వరిసాగు కావడంతో కొనుగోలు చేయడం కూడా అదే రీతిలో ఉండాలని అధికారులు భావిస్తున్నారు. ఈ యాసంగిలో 2,28,434 ఎకరాల్లో వరి సాగవుతుందని యాసంగి ప్రారంభానికి ముందు వ్యవసాయశాఖ అంచనా వేసింది. అయితే, సాగు సమయానికి జిల్లాలో 2,44,127 ఎకరాలు సాగైంది. చెరువులు, కుంటల్లోనే కాకుండా స్థానిక సాగు వనరులను పరిగణనలోకి తీసుకొని రైతులు ఈసారి వరి వైపు మొగ్గుచూపారు.
రూ.500 బోనస్‌ను ప్రభుత్వం ఈసారైనా సకాలంలో ఇస్తుందన్న ఆశతో అనేకమంది రైతులు యాసంగిలో వ్యయ ప్రయాసలకోర్చి వరిని పండించారు. దొడ్డురకం కన్నా సన్నరకం ధాన్యమే అత్యధిక ఎకరాల్లో రైతులు సాగుచేశారు. 97,651 ఎకరాల్లో దొడ్డురకం; 1,46,476 ఎకరాల్లో సన్నరకం ధాన్యం సాగుచేశారు. రైతులు వేసిన సన్నరకం, దొడ్డురకం వరి ఆధారంగా 2,76,626 మెట్రిక్ టన్నుల దొడ్డుధాన్యం; 3,55,662 మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. యాసంగిలో దిగుబడయ్యే వరి ధాన్యంలో స్థానిక అవసరాలు, విత్తనాలకు గాను రైతులు సుమారు 7,113 మెట్రిక్ టన్నులు నిల్వ ఉంచుకునే అవకాశం ఉందని, మిగిలిన 6,25,175 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ ఏడాది యాసంగి సీజన్లో సన్న, దొడ్డురకం కలిపి 3,80,637 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని జిల్లా పౌరసరఫరాల సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. వర్షాకాలంలోనూ, యాసంగిలోనూ ఈసారి పెద్ద ఎత్తున వరి సాగైంది. జిల్లాలో ఏప్రిల్ మొదటివారం నుంచి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. అయితే నేలకొండపల్లి, సత్తుపల్లి, కల్లూరు వంటి ప్రాంతాల్లో ముందుగానే కోతలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున వాటికి అనుగుణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు.
జిల్లాలో ఐకేపీ, పీఏసీఎస్, డీసీఎంఎస్, మెప్మా గ్రూపుల ద్వారా 331 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని పౌరసరఫరాల సంస్థ నిర్ణయించింది. కొనుగోలు కేంద్రాలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించింది. కొనుగోలు కేంద్రాలకు కావాల్సిన కాంటాలు, ట్యాబ్‌లు, ప్రింటర్లు, పవర్ బ్యాంకులు, గన్నీబ్యాగులు తదితర సామగ్రిని సమకూర్చుకోవాలని ఏజెన్సీలకు ఇప్పటికే అధికారులు సూచించారు. త్వరలోనే జిల్లాలో వరికోతలు ముమ్మరమయ్యే అవకాశం ఉండడంతో ఏప్రిల్ 1 నుంచి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు.
మార్చి నెలాఖరు నాటికి కొన్నిచోట్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో కలిపి నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా 3,80,637 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని నిర్ణయించుకున్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెద్ద ఎత్తున ప్రారంభిస్తున్నా కొనుగోళ్లలో పారదర్శకత పాటించడంతోపాటు కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో నగదు జమయ్యేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.