ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం గుట్టలు గుట్టలుగా పేరుకుపోయింది. అంతేకాక రహదారులపైనా రాసులు బారులు తీరాయి. ఎంతో వ్యయప్రయాసలకోర్చి అన్నదాతలు పండించిన పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయకుండా తీవ్ర జాప్యం చేస్తున్నది. దీంతో రైతులు నెలల తరబడి పడిగాపులు కాస్తున్నారు. ఎప్పుడెప్పుడు తమ ధాన్యాన్ని కొనుగోలు చేస్తారోనని వేయికండ్లతో ఎదురుచూస్తున్నారు. మరోవైపు అకాల వర్షాలు పడుతుండడంతో ధాన్యాన్ని కాపాడుకోలేక అరిగోస పడుతున్నారు. ఇదే అదునుగా ధాన్యాన్ని తక్కువ రేటుకు కొంటూ రైతులను దళారీలు దగా చేస్తున్నారు. ఇక కొనుగోలు కేంద్రాల్లో సరిపడా గన్నీ బ్యాగులు లేక.. సమయానికి లారీలు రాక.. కాంటాలు జరగకపోవడంతో చేతగాని, చేవలేని కాంగ్రెస్ ప్రభుత్వమంటూ అన్నదాతలు మండిపడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్నదాతల కష్టాలు అన్నీఇన్నీ కావు. వడ్ల అమ్మకానికి వచ్చిన రైతులు నెలల తరబడి అక్కడే పడిగాపులు కాయాల్సి వస్తున్నది. ఏజెన్సీలు, మిల్లర్లు పెట్టే ఇబ్బందులు, కొర్రీలకు రైతులు ఎన్నో అగచాట్లు పడుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.500 బోనస్ పొందే ఆశతో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకెళ్లిన రైతులు పలు రకాలుగా దగాకు గురవుతున్నారు. ప్రభుత్వం సన్నరకం వడ్లను క్వింటా రూ.2,350 చొప్పున కొనుగోలు చేయడంతోపాటు రూ.500 బోనస్ చెల్లిస్తున్నది.
ఈ నేపథ్యంలో తిరుమలాయపాలెం మండలంలో డీసీసీబీ, ఐకేపీ ఆధ్వర్యంలో 8 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. బచ్చోడు కేంద్రంలో నెలల తరబడి కాంటాలు కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు టోకెన్లు ఇచ్చినప్పటికీ మిల్లర్లకు కేటాయింపులు జరగకపోవడంతో లారీలు రాక కాంటాల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నది. ఇదిలాఉంటే.. నాణ్యత లేదని పుట్టి వడ్లకు రైతుల నుంచి రూ.250 ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. క్వింటాకు ఐదు కిలోల వరకు తరుగు తీస్తున్నారు. వడ్లు లారీకి లోడు చేసినందుకు క్వింటాకు రూ.60 చొప్పున వసూలు చేస్తున్నారు.
అనధికారికంగా ఐకేపీ ఏజెన్సీ మహిళలు, కలాసులు కాంటాల పూర్తయిన రైతుల నుంచి అందినంత దండుకుంటున్నారు. గట్టిగా మాట్లాడితే వడ్ల కాంటాల్లో జాప్యం చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో మిల్లర్ల దగా, జాప్యం తట్టుకోలేక అన్నదాతలు దళారులకు తక్కువ ధరకే ధాన్యాన్ని అమ్ముకుంటున్నారు. మండలంలోని తిరుమలాయపాలెం, హైదర్‌సాయిపేట, దమ్మాయిగూడెం, మేడిదపల్లి, బీరోలు, సుబ్లేడు, కాకరవాయి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనూ ఇదే దుస్థితి నెలకొంది.
బ్యానర్ పెట్టారు.. కొనుగోలు మరిచారు..
దుమ్ముగూడెం ప్రాథమిక సహకార బ్యాంకు ఆధ్వర్యంలో కే.లక్ష్మీపురం, మహదేవపురం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్ద బ్యానర్లు పెట్టారు.. కానీ ఇప్పటివరకు ఒక కిలో ధాన్యం కూడా కొనుగోలు చేయలేదు. మండలంలో సుమారు 3వేల ఎకరాల్లో రైతులు వరి పండించారు. తేమ పేరుతో అధికారులు ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో చాలామంది రైతులు ప్రైవేట్ వ్యాపారులకు పంటను తెగనమ్ముకుంటున్నారు. సొసైటీ సీఈవో హిమబిందు మాట్లాడుతూ మండలంలో ఎక్కువగా కమర్షియల్ సీడ్ పండించారని, ధాన్యంలో తేమశాతం తగ్గకపోవడంతో రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకురావడం లేదని తెలిపారు.
20 రోజులుగా కల్లాల్లోనే..
వేంసూరు మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన రైతుల ధాన్యం 20రోజులుగా కల్లాలోనే ఉంది. ఐకేపీ, పల్లెవాడ సొసైటీ పరిధిలో సుమారు 2500 బస్తాల ధాన్యం ఉన్నా నేటివరకు ఒక్క బస్తా కూడా కాంటా వేయలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐకేపీ, సొసైటీ కొనుగోలు కేంద్రాల చుట్టూ రైతులు రోజూ ప్రదక్షిణ చేస్తున్నా ఇదిగోఅదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు. గన్నీ సంచులు లేవని, లారీలు రావడం లేదని, మిల్లర్లు 1638 రకం మాకొద్దంటున్నారని సాకులు చెబుతున్నారే తప్ప పంటను కొనుగోలు చేయడం లేదని రైతులు వాపోతున్నారు. వర్షం వస్తే ధాన్యాన్ని కాపాడేందుకు నానా అగచాట్లు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంటి మీద కునుకు లేకుండా ఎదురు చూస్తున్నామని కన్నీటిపర్యంతమవుతున్నారు.
ధాన్యాన్ని తగలబెట్టేందుకు రైతులు సిద్ధం
కల్లూరు మండలం పుల్లయ్యబంజర ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని తగలబెట్టేందుకు రైతులు సిద్ధమయ్యారు. కొనుగోలు చేయకుండా నెలరోజులుగా అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తేమశాతం వచ్చిన వాటిని సైతం కాంటాలు వేసేందుకు గన్నీ బ్యాగులు లేవని, కాంటా వేసినా ట్రక్‌షీట్ రాయడం లేదని, తరుగు ఎక్కువ తీస్తున్నారని మండిపడ్డారు. ఆర్డీవో రాజేందర్‌గౌడ్, సివిల్ సైప్లె డీఎం శిరీష, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ భాగం నీరజ, ఎస్సై హరిత మంగళవారం ఆ కొనుగోలు కేంద్రానికి వెళ్లి రైతులతో మాట్లాడి సర్దిచెప్పారు.
రోజులు గడుస్తున్నా వడ్లు కొనట్లే..
కొనుగోలు కేంద్రాల్లో చోటులేక ఆర్అండ్బీ రోడ్డు పక్కన వడ్లు పోశాను. వర్షానికి తడుస్తున్నాయి. వడ్లపై కప్పుకోవడానికి పట్టాలు, బస్తాలు ఇచ్చినవారు లేరు. 20 రోజులవుతున్నా కాంటాలు కాలేదు. కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు కాస్తున్నాం. బోనస్ ఏమోగాని మా బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడంలేదు.
-దూదిమెట్ల లక్ష్మణ్, రైతు, బచ్చోడు, తిరుమలాయపాలెం
కష్టాలు పడలేకపోతున్నాం..
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కష్టాలు పడలేకపోతున్నాం. వాననక ఎండనక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కొనుగోలుదారులు అనేక షరతులు పెడుతున్నారు. రోజులు గడుస్తున్నా వడ్లు కాంటాలు వేయడంలేదు. అధికారులెవరూ పట్టించుకోవడం లేదు. లారీలు రావడంలేదు. దీంతో కాంటాలు కాక రైతులు పడిగాపులు కాస్తున్నారు. నేను రెండు పుట్ల వడ్లు తెచ్చాను. నెల రోజులైంది. ఇంకా కాంటాలు కాలేదు.
-నందిపాటి రామకృష్ణ, రైతు, బచ్చోడు
రైతులకు న్యాయం చేయాలి
నేను రెండు ఎకరాల వడ్లు కేంద్రానికి తెచ్చాను. 20 రోజులైంది. ఇంతవరకు కొనుగోలు జరగలేదు, కాంటాలు కాలేదు. బస్తాలు లేవు, పట్టాలు లేవు, రెండుమార్లు వర్షానికి వడ్లు తడిచాయి. వడ్లు కొనేవారు అనేక షరతులతో ఇబ్బందులు పెడుతున్నారు. ఏమి చేయాలో తోచడం లేదు. జిల్లా మంత్రులు పొంగులేటి, తుమ్మల, భట్టి చొరవ తీసుకొని రైతులకు ఇబ్బందులు లేకుండా వడ్లు కొనేలా చేయాలి.
-భూక్యా బాలు, రైతు, బచ్చోడుతండా, తిరుమలాయపాలెం
తీవ్రంగా నష్టపోతున్నాం..
ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులం తీవ్రంగా నష్టపోతున్నాం. వ్యవసాయశాఖ అధికారులు సూచించిన విధంగానే 1938 సన్నరకం ధాన్యాన్ని పండించాం.. రాజుగూడెంలో సుమారు 3వేల టక్కీల ధాన్యం కంటాలకు సిద్ధంగా ఉంది. 20 రోజులుగా కాంటాలు వేస్తారని ఎదురుచూస్తున్నాం. ఏ ఒక్కరు కూడా మా మొర ఆలకించడం లేదు.
-తక్కెళ్లపాటి గోపాలకృష్ణ, రైతు, రాజుగూడెం, వేంసూరు
పంట కోసి 20 రోజులు..
మా పంట కోసి దాదాపు 20రోజులు అవుతుంది. అప్పటినుంచి నేను, మా కుటుంబ సభ్యులు ధాన్యం విక్రయించేందుకు కల్లాల్లోనే కుప్పలు పోసి ఎదురుచూస్తున్నాం. ప్రతిరోజు ధాన్యాన్ని ఆరబెట్టడం, పట్టాలు కప్పడం చేస్తున్నాం. గత ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురుకాలేదు. వానొస్తే మేము పడ్డ కష్టం మొత్తం నేలపాలవుతుంది. 1638 రకం ధాన్యాన్ని పండించాను.
-రాయల సత్యనారాయణ, రైతు, రాజుగూడెం, వేంసూరు
అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇబ్బందులు..
ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రంలో గతంలో ఎప్పుడూ ఇలాంటి ఇబ్బందులు రైతులం పడలేదు. కేవలం ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం వల్లనే గోస పడుతున్నాం. గోనె సంచులు వారికి ఇష్టంవచ్చిన వారికి ఇస్తున్నారు. కాంటా వేసిన వారికి ట్రక్‌షీట్ రాయడం లేదు. కొనుగోలు కేంద్రాల్లో అధికారులు రాజకీయం చేస్తున్నారు.
-కిష్టంశెట్టి నరసింహారావు, రైతు, కల్లూరు
రైతులకు ఇబ్బంది కలుగనివ్వం..
పుల్లయ్యబంజర కేంద్రంలోని సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. రైతుల ధాన్యాన్ని వీలైనంత త్వరగా తరలిస్తాం. రైతుల సమస్యలను పరిగణనలోకి తీసుకొని కేంద్రం నిర్వహణపై కలెక్టర్‌కు వివరిస్తాం. ఏదేనా సమస్య ఉంటే రైతులు నేరుగా నా దృష్టికి తీసుకురావాలి. ఎట్టి పరిస్థితుల్లో రైతులకు ఇబ్బంది కలిగించం.
-రాజేందర్‌గౌడ్, ఆర్డీవో, కల్లూరు