పాల్వంచ/ కొత్తగూడెం గణేష్టెంపుల్/ మణుగూరు టౌన్/ దమ్మపేట రూరల్, మే 16 : కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను నిరసిస్తూ సీపీఐ, సీఐటీయూ ఆధ్వర్యంలో భద్రాద్రి జిల్లాలోని పలు మండలాల్లో శనివారం వేర్వేరుగా ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. పాల్వంచ పట్టణంలో సీపీఐ పట్టణ, మండల కార్యదర్శులు అడుసుమిల్లి సాయిబాబా, వీసంశెట్టి పూర్ణచందర్రావు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ, ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
మణుగూరులో సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్పాషా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో ఆ పార్టీ రాష్ట్ర సమితి నాయకుడు సలిగంటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. దమ్మపేట సెంటర్లో సీఐటీయూ జిల్లా నాయకుడు రఘు ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. ఆయా కార్యక్రమాల్లో వారు మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఐదు రాష్ర్టాల ఎన్నికల సమయంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచేది లేదని చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఎన్నికలు ముగిసిన తర్వాత ధరలు పెంచి ప్రజలపై మోయలేని భారం మోపిందన్నారు.
మాయమాటలు చెప్పి మోసం చేసిన మోదీ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. వెంటనే పెంచిన ధరలు తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. ఆయా కార్యక్రమాల్లో సీపీఐ, సీఐటీయూ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.