సత్తుపల్లిటౌన్, డిసెంబర్ 19 : అధికారుల నిర్లక్ష్యం వల్ల కల్యాణలక్ష్మి చెక్కులు రిజెక్ట్ కావడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఏనాడూ రిజెక్ట్ కాని చెక్కులు ఇప్పుడు రిజెక్ట్ కావడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. గత సీఎం కేసీఆర్ దేశంలోనే ఎక్కడా లేని విధంగా వివాహం చేసుకున్న వధువులకు మేనమామగా రూ.1,00,116 ప్రభుత్వం తరఫున అందిస్తూ.. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ అనే పథకాన్ని ప్రవేశపెట్టి అండగా నిలిచారు. ఈ పథకంలో గతంలో వేలాది మంది వధువులు సత్తుపల్లి నియోజకవర్గంలో లబ్ధిపొందారు. అయితే గత ఏడాది వివాహం చేసుకొన్న వారు కళ్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్నారు.
సత్తుపల్లి మండలం నుంచి దరఖాస్తు చేసుకున్న 13 మందికి ఈ ఏడాది సెప్టెంబర్ 19న కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు మంజూరయ్యాయి. వీటిని సంబంధిత రెవెన్యూ కార్యాలయాలకు పంపించినప్పటికీ వాటిని లబ్ధిదారులకు సకాలంలో అందించలేదు. వాస్తవానికి ఈ చెక్కులు మంజూరైన మూడు నెలలకు.. మూడు రోజుల ముందుగా లబ్ధిదారులు తమ ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది. అయితే అధికారులు నిర్లక్ష్యంతో అందించకపోగా.. గురువారం మధ్యాహ్నం హడావిడిగా సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వాటిని పంపిణీ చేశారు. వెంటనే ఖాతాల్లో జమ చేసుకోవాలని అధికారులు చెప్పడంతో 13 మంది లబ్ధిదారులు బ్యాంకు వద్దకు వెళ్లారు.
దీంతో బ్యాంకు అధికారులు చెక్కుల సమయ కాలం ముగిసిందని చెప్పడంతో లబ్ధిదారులు నిరాశతో తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని ఆందోళన చేపట్టారు. దీనిపై సత్తుపల్లి తహసీల్దార్ యోగేశ్వరరావును వివరణ కోరగా.. సెప్టెంబర్ 19న చెక్కులు మంజూరైనప్పటికీ తమకు రావడంలో జాప్యం జరిగిందని, తమకు అందిన వెంటనే చెక్కులు లబ్ధిదారులకు అందించామని పొంతన లేని వివరణ ఇచ్చారు. ఈ విషయంలో లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తిరిగి చెక్కులు తెప్పించి ఇప్పిస్తామని చెప్పారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ చెక్కుల పంపిణీలో జాప్యం జరిగిందని లబ్ధిదారులు వాపోతున్నారు.