Organ Donation | రామవరం, పిబ్రవరి 15: తాను చనిపోతూ మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపే ఓ అద్భుత కార్యక్రమం అవయవదానం. అందుకు హైద్రాబాద్ కామినేని దవాఖానా వేదికైంది. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీ వాసి కిషోర్ లాల్ (58) సింగరేణి కొత్తగూడెం ఏరియాలో డీఎల్ఆర్ కార్మికుడిగా కోల్ లోడింగ్ పనిచేస్తూ జీవిస్తున్నాడు. బీపీ పెరిగి మెదడులో రక్తస్రావం జరిగి ఈ నెల 10న హైద్రాబాద్‌లోని కామినేని దవాఖానలో చేర్పించారు. కొన్ని రోజులుగా అతనికి వెంటిలేటర్‌పైన వైద్య చికిత్స అందించారు. ఆయినా చికిత్సకు ఆయన స్పందించక పోవడంతో కిషోర్ లాల్ బ్రెయిన్ డెడ్ అయినట్లు గుర్తించారు. కిషోర్ లాల్ కుటుంబ సభ్యులకు అవయవదానంపై కౌన్సిలింగ్ ఇచ్చారు. అవయవదానం చేసేందుకు కిషోర్ లాల్ కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు.
కిషోర్ లాల్ అన్న రాంప్యారి, వారి కుటుంబసభ్యులు అవయవదానానికి అంగీకరించడంతో కామినేని దవాఖాన వైద్యులు జీవన్ దాన్ కింద దరఖాస్తు చేశారు. ఆ వెంటనే ఏర్పాట్లు చకచకా జరిగిపోయాయి. అవయవ దానం కోసం కిషోర్ లాల్ కార్నియా (కండ్లలోని నల్లగ్రుడ్డు), లివర్, రెండు కిడ్నీలు పనిచేస్తాయని వైద్యులు గుర్తించి వాటిని అతనినుండి సేకరించారు. ఒక సాదారణ కోల్ లోడింగ్ డీఎల్ఆర్ కార్మికుడు అవయవదానం చేయడం పట్ల స్థానికులు, వారి కుటుంబసభ్యులను అభినందించారు. కిషోర్ లాల్ మృతికి సంతాపాన్ని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.