జిల్లాలో అక్రమ మైనింగ్ అడ్డూఅదుపూ లేకుండా సాగుతోంది. అందులో అత్యధిక శాతం అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే జరుగుతోంది. మైనింగ్‌లో అక్రమాలను అరికట్టేందుకు గత కేసీఆర్ ప్రభుత్వంలో అప్పటి కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసినప్పటికీ అది ఇప్పుడు మచ్చుకైనా కన్పించడం లేదు. మైనింగ్, రెవెన్యూ, పోలీస్, పీఆర్, రవాణా శాఖలు మామూళ్ల మత్తులో జోగుతుండడంతో జిల్లాలో ఇసుక, గ్రావెల్, గ్రానైట్ తవ్వకాలు, తోలకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. కేవలం అక్రమ మైనింగ్‌ను అరికట్టేందుకే ఏర్పాటైన కార్యాచరణ బృందాలు ఏడాది క్రితం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో అటకెక్కాయి. ఇక వాటిల్లోని ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ అధికారులు కూడా నిద్ర నటిస్తూ చేష్టలుడిగి చూస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన పన్నులు ఖజానాకు చేరడం లేదు. మరోవైపు సహజ వనరులు ధ్వంసమవుతున్నాయని ప్రజల నుంచి ఫిర్యాదులు అందుతున్నా చలనం లేదు.
-మామిళ్లగూడెం, డిసెంబర్ 14
ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలు ఇలా..
గత కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన మైనింగ్ పాలసీలో భాగంగా జిల్లాలో అక్రమ మైనింగ్‌ను నిలువరించేందుకు నాడు జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసింది. జిల్లాలో రెవెన్యూ శాఖ నుంచి అదనపు కలెక్టర్ (రెవెన్యూ)/ఖమ్మం, కల్లూరు ఆర్డీవోలు, పోలీస్ శాఖ నుంచి టాస్క్‌ఫోర్స్ ఏసీపీ/ సీఐ, రవాణా శాఖ నుంచి డీటీవో/ ఎంవీఐ, మైనింగ్ అండ్ జియాలజీ శాఖ నుంచి అసిస్టెంట్ జియాలజిస్ట్/రాయల్టీ ఇన్స్పెక్టర్ సభ్యులుగా ఉంటూ జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు. మండలంలో రెవెన్యూ శాఖ నుంచి తహసీల్దార్, పోలీస్ శాఖ నుంచి ఎస్‌హెచ్‌వో, పీఆర్ నుంచి నుంచి ఎంపీడీవోలతో మండలస్థాయి టాస్క్‌ఫోర్స్ బృందాలుగా ఏర్పాటు చేశారు. ఈ బృందాలు మైనింగ్ అక్రమాలపై తనిఖీలు చేసి.. వాటిని నిలువరించి కేసులు నమోదు చేయాల్సి ఉన్నప్పటికీ ఏడాది కాలంగా కార్యాచరణలోకి దిగిన పాపాన పోలేదు. చివరికి మంత్రులు కూడా సమీక్షించే పరిస్థితి లేదు.
అక్రమార్కులు, అధికార పార్టీ నేతల దోస్తీ..
జిల్లాలో అక్రమ మైనింగ్ చేస్తున్న కొందరు అక్రమార్కులు అధికార పార్టీ నేతల పేరుతో తమ దందాను కొనసాగిస్తున్నారు. తొలుత వీరిపై అధికార పార్టీ నేతలు కక్షసాధింపులకు దిగారు. ఆ తరువాత ఇద్దరూ ఒక్కటై అక్రమాలను చక్కబెట్టుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Khammam2
డిప్యూటీ సీఎం ఇలాకాలో అనంతం..
ఉప ముఖ్యమంత్రి ఇలాకాలో మైనింగ్ అక్రమాలు అనంతంగా బయటికొస్తున్నాయి. ఇసుక వనరులు అధికంగా ఉన్న మధిర నియోజకవర్గం నుంచే అక్రమ ఇసుక దందా మొదలైంది. గత కేసీఆర్ సర్కారులో కేవలం ప్రభుత్వ పనులు, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలకే అధికారులు ఇసుక కూపన్లు జారీ చేసేవాళ్లు. కేవలం వాటితోనే అధికారికంగా ఇసుక రవాణా జరిగేది. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి అధికారిక అనుమతులు ఏమీ లేవు. వైరా నది, ఎర్రుపాలెం కట్టలేరు, మధిర ఏరు వంటి ఇసుక వనరుల నుంచి 24 గంటలూ యథేచ్ఛగా తోలకాలు కొనసాగుతున్నాయి. ఇక పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి మండలాల్లో గ్రావెల్, గ్రానైట్ దందాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఇక ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలంలో ఏకంగా గుట్టలే మాయమవుతున్నాయి. తక్కువ విస్తీర్ణంలో అనుమతి తీసుకొని ఎక్కువ విస్తీర్ణంలో తవ్వకాలు చేపట్టి సొమ్ము చేసుకుంటున్నారు. దీనికి తోడు మరికొందరు అక్రమార్కులైతే పొరుగునే ఉన్న ఏపీ రాష్ట్రంలోని వత్సవాయి నుంచి మున్నేటి ఇసుక అక్రమంగా తెలంగాణలోకి తెచ్చి విక్రయిస్తూ అధిక లాభాలు గడిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులనూ ఎగవేస్తున్నారు. ఇటీవల జిల్లా కేంద్రానికి చెందిన ఓ మంత్రి పేరుతో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ఓ అక్రమార్కుడి మూడు వాహనాలూ ఖమ్మం అర్బన్ పోలీసులకు పట్టుబడ్డాయి.
నిండుకున్న డీఎంఎఫ్టీ ఖజానా..
మైనింగ్ అక్రమాలను అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలం కావడంతో జిల్లా మినరల్ ఫండ్స్ ట్రస్ట్ ఖాతాలో నిధులు నిండుకున్నాయి. గత కేసీఆర్ ప్రభుత్వంలో ఏటా సుమారు రూ.200 కోట్ల వరకు నిధులు ఉండేవి. కానీ.. ప్రస్తుత 2023-24లో డీఎంఎఫ్టీ ఖాతాలో రూ.13 కోట్లు మాత్రమే ఉండడం గమనార్హం. ఇక సీనరేజ్లోనూ కేవలం రూ.92 కోట్లే సమకూరాయి. తద్వారా డీఎంఎఫ్టీ నిధుల ద్వారా జిల్లాలో జరగాల్సిన అభివృద్ధి పనులు కుంటుపడ్డాయి.
మైనింగ్ పాలసీపై సమీక్షలూ లేవు
మైనింగ్ అక్రమాలపై జిల్లాస్థాయిలో మంత్రుల ఆధ్వర్యంలోగానీ, కలెక్టర్ ఆధ్వర్యంలోగానీ ఈ ఏడాది కాలంలో ఒక్కసారి కూడా సమీక్ష సమావేశం జరగలేదు. అక్రమ మైనింగ్‌పై ప్రజల నుంచి అనేక ఫిర్యాదు అందుతున్నా చర్యలూ శూన్యమవుతున్నాయి. మీడియా సాధనాలు, సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున కథనాలు వెలువడుతున్నా స్పందన ఉండడం లేదు.
దాడులు ముమ్మరం చేస్తాం..
అక్రమ మైనింగ్‌పై జిల్లావ్యాప్తంగా దాడులను ముమ్మరం చేస్తాం. అనుమతులు లేకుండా జరిపే తవ్వకాలు, తోలకాలపై తీసుకోవాల్సిన చర్యల విషయంలో స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. జిల్లాలో ఎక్కడ అక్రమ మైనింగ్ చేస్తున్నట్లు సమాచారం ఉన్నా, ఫిర్యాదులు వచ్చినా వెంటనే వెళ్లి దాడులు చేస్తాం. దాంతోపాటు నిరంతరం నిఘా ఉంచుతాం.
-సాయినాథ్, ఏడీ, మైనింగ్