భద్రాచలం, మార్చి 2: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దివ్యక్షేత్రంలో నిర్వహించే శ్రీరామనవమి, పట్టాభిషేకం ఉత్సవాల టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచినట్లు దేవస్థానం ఈవో శివాజీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 2 నుంచి 16 వరకు ఆలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని, ఏప్రిల్ 10న శ్రీరామనవమి, 11న మహా పట్టాభిషేకం వేడుకలు ఉంటాయని వివరించారు. ఈ ఉత్సవాలను వీక్షించాలనుకునే భక్తుల సౌకర్యార్థం టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. కల్యాణోత్సవానికి రూ.7,500, రూ.2,500, రూ.2 వేలు, రూ.వెయ్యి, రూ.300, రూ.150 విలువ గల సెక్టార్ టిక్కెట్లను, పట్టాభిషేకం కోసం రూ.వెయ్యి విలువ గల సెక్టార్ టిక్కెట్లను అందుబాటులో ఉంచినట్లు వివరించారు. ఆసక్తి గల భక్తులు స్వామివారి కల్యాణం, పట్టాభిషేకం టిక్కెట్లను www.bhadrachalamonline.com ద్వారా పొందవచ్చని తెలిపారు. అలాగే రూ.7,500 శ్రీరామనవమి ఉభయ దాతల టిక్కెట్లు కార్యాలయంలోని ఆలయ టికెట్ల కౌంటర్లో విక్రయానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. భక్తులు దేవస్థానం కార్యాలయం పనివేళల్లో 08743-232428 నెంబర్లో సంప్రదించవచ్చని సూచించారు.