మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఉంది రైతుల పరిస్థితి. ఒకపక్క అసలే యూరియా దొరక్క నానా బాధలు పడుతుంటే.. మరోపక్క దొరికిన కొద్దిపాటి యూరియా పంపిణీలోనూ అడ్డంకి ఏర్పడింది. పీవోఎస్(పాయింట్ ఆఫ్ సేల్) మిషన్లు పనిచేయకపోవడంతో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
జిల్లాలోని పలు ప్రాంతాల్లో యూరియా కోసం వచ్చిన రైతుల ఆధార్‌కార్డు నెంబర్ ఎంటర్ చేసి థంబ్ పెట్టగా మిషన్ తీసుకోవడం లేదు. దీంతో రోజుల తరబడి రైతులకు పడిగాపులు తప్పడం లేదు. చేసేదేమీలేక కొద్దిమంది రైతులు వెనుదిరిగిపోతున్నారు. మరికొంతమంది క్యూ లైన్ పోతుందేమోనని భయంతో ఎరువుల గోడౌన్ల వద్దనే రాత్రిళ్లు నిద్రిస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు అడుగడుగునా ఎదురవుతున్న కష్టాలు వర్ణణాతీతంగా ఉన్నాయి.
-ఇల్లెందు, ఆగస్టు 26
యూరియా కోసం నానా ఇబ్బందులు పడుతూ పడికాపులు కాస్తున్న రైతన్నలకు కొత్త సమస్య వచ్చింది. అరకొరగా వచ్చిన యూరియా పంపిణీలో పీవోఎస్ (పాయింట్ ఆఫ్ సేల్) మిషన్లు సరిగా పనిచేయడం లేదు. దీంతో గత రెండ్రోజులుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వచ్చిన అరకొర యూరియా పూర్తిస్థాయిలో పంపిణీ జరగలేదు. గతంలో ఎన్నడూ రైతులకు యూరియా కష్టాలు ఇంతగా ఎదురుకాలేదు. కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ఎండ లేదు.. వాన లేదు.. పగలు లేదు.. రాత్రి లేదు.. ఎరువుల గోడౌన్ల చుట్టూ తిరగాల్సి వస్తున్నది.
కొంతమంది రైతులు ఏకంగా ఉదయం సద్ది కట్టుకొని వచ్చి రెండుపూటలు అక్కడే ఉండి సాయంత్రానికి వెళ్తున్నారు. సోమ, మంగళవారం పలు మండలాల్లో యూరియా కోసం వచ్చిన రైతులకు ఈపీవోఎస్ మిషన్‌లో ఆన్లైన్ సమస్య వచ్చింది. దీంతో అక్కడే పడిగాపులు కాశారు. ఇల్లెందులోని వ్యవసాయ మార్కెట్లో ఉన్న సొసైటీ ఎరువుల గోడౌన్ వద్ద సోమవారం ఒక లారీ లోడు రాగా మిషన్ సరిగా పని చేయకపోవడంతో సోమ, మంగళవారం రెండ్రోజులు యూరియా పంపిణీ చేయడంతో రైతులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.
9 రోజులుగా తిరుగుతున్నా..
తొమ్మిది రోజులుగా యూరియా కోసం పొద్దున్నే సద్ది కట్టుకొని ఇంటి నుంచి ఇల్లెందు సొసైటీ ఎరువుల గోడౌన్‌కు వచ్చి పడిగాపులు కాస్తున్నాను. ప్రతిరోజు ఇక్కడే సద్ది తిని యూరియా లేకుండానే ఇంటికి వెళ్తున్నాను. నిన్న మిషన్ పనిచేయడం లేదని చెప్పారు.. ఇప్పుడు పంటలకు యూరియా చాలా అవసరం. రైతులందరికీ అందుబాటులో ఉండేలా చూడాలి.
-భూక్యా మాంగిని, రొంపేడు క్రాస్‌రోడ్డు, ఇల్లెందు