ఖమ్మం/ ఖమ్మం కల్చరల్/ రఘునాథపాలెం, జనవరి 2: పవిత్ర ధనుర్మాసం సోమవారం ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భక్తులు అత్యంత భక్తి ప్రపత్తులతో జరుపుకున్నారు. జిల్లా వ్యాప్తంగా సర్వాంగ సుందరంగా ముస్తాబైన వైష్ణవాలయాల్లో స్వామి ఉత్తర ద్వార దర్శనంతో భక్తులు పునీతులయ్యారు. ఈ రోజున విష్ణుమూర్తిని ముక్కోటి దేవతలతో పాటు భక్తగణం ఉత్తర ద్వారంలో దర్శించుకోవడంతో పుణ్యకాలం ప్రారంభమవుతుందని పురాణోక్తి. ఈ మేరకు బ్రహ్మీముహూర్తాన భక్తులు పలు వైష్ణవాలయాలకు తరలివెళ్లి స్వామిని ఉత్తర ద్వారంలో దర్శించుకుని తరించారు.
తెల్లవారుజామున 4 గంటల నుంచే పలు ఆలయాల్లో భక్తులు పోటెత్తారు. రామాలయం, వేంకటేశ్వరస్వామి ఆలయం, ఆంజనేయస్వామి ఆలయాల్లో ఆలయ కమిటీలు, భక్త బృందాలు ఉత్తర ద్వార దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో భక్తులు దర్శనం చేసుకుని పూజలు చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రాచీన దివ్యక్షేత్రం శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, కమాన్‌బజార్, మామిళ్లగూడెంలోని వేంకటేశ్వరస్వామి ఆలయాలు, రంగనాయకుల గుట్ట, ప్రభాత్టాకీస్ రామాలయాల్లో అధిక సంఖ్యలో భక్తులు స్వామిని ఉత్తరద్వార దర్శనం చేసుకున్నారు. వైష్ణవ ఆలయాల్లో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా తిరుప్పావై పాశురాలను భక్తులు అనుసంధానం చేశారు.
ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని రఘునాథపాలెం మండలంలో ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. రఘునాథపాలెం, పాండురంగాపురం, వీ వెంకటాయపాలెం, కోయచలక, చింతగుర్తి, చెరువుకొమ్ముతండా, ఖానాపురం యూపీహెచ్ కాలనీ, ప్రాంతాలోని ఆలయాల్లో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. పాండురంగాపురం, వీ వెంకటాయపాలెం గ్రామాల్లోని సీతారామాలయాల్లో, ఖానాపురం యూపీహెచ్ కాలనీల్లో శ్రీ అభయ వేంకటేశ్వర ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్తరద్వారంలో భక్తులకు స్వామివార్ల దర్శన సౌకర్యం కల్పించారు. పాండురంగాపురంలో ఆలయ కమిటీ బాధ్యులు భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా నగరంలోని వీడీవోస్ కాలనీలో ఉన్న రామాలయంలో శ్రీసీతారామచంద్ర స్వామి వారిని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఉత్తరద్వారంలో దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు మంత్రిని ఆశీర్వదించి స్వామివారి పట్టువస్ర్తాలు, తీర్థ ప్రసాదాలను అందించి ఆశీర్వదించారు.