ప్రతి రైతుకు పంటల యాజమాన్యం అత్యంత ప్రాధాన్యం. దీని ద్వారా నాణ్యమైన దిగుబడులు సాధించుకోవటం సాధ్యం. పంటల నిర్వహణతో రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనాలు అందుతాయి. అయితే ఆయిల్‌ఫెడ్ అధికారులు ఆయిల్‌పాం మొక్కలు పంపిణీ చేస్తున్నారు కానీ.. తోటల నిర్వహణకు అవసరమైన కనీస అవగాహనను రైతులకు కల్పించడంలో విఫలమవుతున్నారు. ఫలితంగా అంతర పంటలు చేస్తూ రెండేళ్ల దిగుబడులు కోల్పోయి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. యాజమాన్య పద్ధతులపై సూచనలు, సలహాలు ఇవ్వకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తున్న ఆయిల్‌ఫెడ్ అధికారుల తీరుపై రైతులు, రైతు సంఘం నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
– అశ్వారావుపేట, ఏప్రిల్ 15
దీర్ఘకాలిక నికర ఆదాయం అందించే ఆయిల్‌పాం సాగును ఆయిల్‌ఫెడ్ కొన్నేళ్లుగా ప్రోత్సహిస్తున్నది. రైతులను ఇతర పంటల నుంచి ఆయిల్‌పాం సాగు వైపు మళ్లిస్తున్నారు. పంటకు గిట్టుబాటు ధర అధికంగా ఉండటంతో ఇతర పంటలు సాగు చేస్తున్న రైతులు ఆయిల్‌పాం సాగువైపు ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా గత నాలుగేళ్లలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వందల మంది రైతులు 67,615 ఎకరాల్లో అధికారికంగా కొత్తగా ఆయిల్‌పాం తోటలను సాగు చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, తోటల నిర్వహణకు అవసరమైన కనీస అవగాహన రైతులకు కల్పించడంలో ఆయిల్‌ఫెడ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పంట సాగులో యాజమాన్య పద్ధతులు తెలియక అంతర పంటలు సాగు చేసుకుంటూ తోటలకు కావాల్సిన పోషక ఎరువులు అందించడం లేదు. దీనివల్ల పంట దిగుబడి రెండేళ్లు ఆలస్యమవుతున్నది. దిగుబడి ఆలస్యం కావడం వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే నాలుగేళ్లకు రావాల్సిన దిగుబడి మూడేళ్ల నుంచే ప్రారంభమవుతోంది. తోటల నిర్వహణకు ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా ఎకరాకు రూ.4,200 చొప్పున నాలుగేళ్లపాటు సబ్సిడీ అందిస్తున్నది. ఈ రాయితీ సొమ్మును కూడా రైతులు తోటలకు వెచ్చించడం లేదు.
తోటకు అందని ఎరువులు..
ఆయిల్‌ఫెడ్ సంస్థ ఆయిల్‌పాం తోటల నిర్వహణకు ఏటా రూ.4,200 చొప్పున నాలుగేళ్లపాటు రూ. 16,800 రైతులకు రాయితీ ఇస్తుంది. వీటితో తోటలకు అవసరమైన ఎరువులను అందించాలి. కానీ, అవగాహన లేని రైతులు అంతర పంటల సాగుకు ఇచ్చేస్తున్నారు. రెండేళ్లు అంతర పంటల సాగుకు అవకాశం ఉన్నప్పటికీ నాలుగేళ్లపాటు డబ్బుకు ఆశపడి కౌలుకు ఇస్తున్నారు. అంతర పంటలకు ఇచ్చే ఎరువులతోనే సరిపెడుతున్నారు. దీనివల్ల ఆయిల్‌పాం తోటలకు ఎరువులతో కూడిన పోషకాలు అందడం లేదు. అంతర పంటలకు అందించే ఎరువులు ఆయిల్‌పాం తోటల పెంపకానికి పొంతన ఉండటం లేదు. గతంలో ఆయిల్‌ఫెడ్ సంస్థే ఎరువులను రైతులకు పంపిణీ చేసేది. కానీ, కాలక్రమేణ ఎరువులు దుర్వినియోగం అవుతున్నాయని, సకాలంలో అందించలేకపోవటం తోటలకు ఎరువులు అందడం లేదన్న సాకుతో సంస్థ నగదు రూపంలోనే రైతులకు సబ్సిడీ అందిస్తున్నది. అంతర పంటలకు తోటలను ఇచ్చేస్తున్న రైతులు ఎరువులను అందించడం లేదు.
అవగాహన కల్పిస్తే ప్రయోజనం..
తెలంగాణ రాష్ట్రంలో అధిక డిమాండ్ ఉన్న పంట ఆయిల్‌పాం. పంట యాజమాన్యంపై రైతులకు అవగాహన కల్పిస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఆయిల్‌ఫెడ్ సంస్థ సూచన ప్రకారం నాలుగేళ్లకే పంట దిగుబడి రావాల్సి ఉంది. యాజమాన్య పద్ధతులు తెలియక రైతులు తోటలను కౌలుకు ఇవ్వడం ద్వారా ఆరేళ్ల వరకు దిగుబడి కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. రెండేళ్లలో రూ.4 లక్షల వరకు ఆదాయం కోల్పోతున్నాడు. కౌలు ఎకరాకు రూ.30 వేలు వచ్చినా రెండేళ్లలో రైతుకు వచ్చే ఆదాయం కేవలం రూ.60 వేలు మాత్రమే. ఈ లెక్కన సుమారు రైతు రూ.3.40 లక్షల ఆదాయం నష్టపోతున్నాడు. దీనిని గుర్తించి ఆయిల్‌ఫెడ్ అధికారులు రైతులకు తోటల పెంపకంపై కనీస అవగాహన కల్పించాలని రైతు సంఘం నాయకులు సూచిస్తున్నారు. ఇప్పటికే ఆఫ్ టైప్ మొక్కలతో అనేక మంది రైతులు నష్టపోయారని, ఇప్పుడు అవగాహన లేమితో మరికొందరు రైతులు ఆదాయం కోల్పోతున్నారని సూచిస్తున్నారు.
చెట్లను కట్టేసి అంతర పంటల సాగు..
అంతర పంటల సాగు పంట దిగుబడి ఆలస్యానికి మరో కారణం. ఆకులను కట్టేయడం, మొక్క మొదలుకు దుక్కి దున్నడం వల్ల మొక్కకు సూర్యరశ్మి అందక, వేరు వ్యవస్థ దెబ్బతినడం వల్ల తోట పెంపకం ఆలస్యమవుతోంది. మొక్క పెరుగుదల సమయంలో ఆకు పొడవు అంత వేరు భూమిలో పెరుగుతోంది. మొదటి ఏడాది ఆకు వైశాల్యం 3.14-4.5 చ.మీటర్లతో 4-6 శాతం భూమి వైశాల్యం ఆక్రమిస్తుంది. ఇది రెండో ఏడాదికి 12.5-19.6 చ.మీటర్ల ఆకు వైశాల్యం 18-25 శాతం, మూడో ఏడాది 28.2-38.5 చ.మీ. ఆకు పొడవు 40 నుంచి 55 శాతం, నాల్గో ఏటా 50.3-55.4 చ.మీ ఆకు వైశాల్యం 70-80 శాతం భూమిని ఆక్రమిస్తుంది. దీనికి అనుగుణంగానే భూమిలో వేరు విస్తరిస్తుంది. కానీ, అంతర పంటల సాగుతో మొక్క మొదటికి దుక్కి దున్నడం వల్ల వేరు పూర్తిగా దెబ్బతింటుంది. ఇది మళ్లీ బతకడానికి సుమారు 3 నెలల సమయం పడుతోంది. ఇలా రెండు అంతర పంటల సాగుతో రెండుసార్లు దుక్కి దున్నితే ఏడాది 6 నెలల కాలం తర్వాత పంట దిగుబడి రావడంలో వెనకబడిపోతుంది. ఫలితంగా నాలుగో ఏడాది కనీసం 4 నుంచి 6 టన్నుల దిగుబడిని రైతు కోల్పోతున్నాడు. ప్రస్తుతం ఉన్న ధర ప్రకారం సుమారు రూ.90 నుంచి 1.40 లక్షల వరకు ఆర్థికంగా నష్టపోతున్నాడు. ఇలా రెండేళ్లలో సుమారు రూ.4 లక్షల ఆదాయం కోల్పోతున్నాడు.
సాగు పద్ధతులు చెప్పలేదు
ఆయిల్‌పాం మొక్కలు ఇచ్చారు గానీ యాజమాన్య పద్ధతులపై అధికారులు ఎలాంటి సూచనలు ఇవ్వలేదు. ఆయిల్‌పాం మొక్కలు నాటిన తర్వాత తోటను అంతర పంటకు కౌలుకు ఇచ్చారు. ఎరువులు కూడా ఏమీ వేయలేదు. అంతర పంటలకు వేస్తున్న ఎరువులే ఆయిల్‌పాం మొక్కలకు పని చేస్తున్నాయి. ఆదాయం కోసం అంతర పంటల సాగు కోసం తోటలను కౌలుకు ఇస్తున్నాం. దీనిద్వారా ఏటా ఎకరాకు రూ.60 వేలు ఆదాయం వస్తున్నది.
– కుప్పాల సీతారాముడు, రైతు, అశ్వారావుపేట
యాజమాన్య పద్ధతులు పాటించాలి
ఆయిల్‌పాం మొక్కలు వేసిన రైతులు కచ్చితంగా యాజమాన్య పద్ధతులు పాటించాలి. ముఖ్యంగా అంతర పంటలు సాగు చేస్తున్న వారు ఎరువులు అందించాలి. ఆయిల్‌పాం మొక్కకు దూరంగా దున్నాలి. ఆకు వైశాల్యం అంత వేరు భూమిలో ఉంటుంది. ఏడాదికి రెండుసార్లు అంతర పంటల సాగు కోసం దున్నడం వల్ల రెండేళ్లు దిగుబడి ఆలస్యం అవుతుంది. తోటల నిర్వహణపై రైతులకు ఇప్పటికే అవగాహన కల్పిస్తున్నాం.
– సబావత్ శంకర్, ఆయిల్‌ఫెడ్ డివిజనల్ ఆఫీసర్, అశ్వారావుపేట
రైతులకు అవగాహన కల్పించాలి..
ఆయిల్‌పాం సాగుచేసే ఎక్కువ మంది రైతులకు యాజమాన్య పద్ధతులపై అవగాహన లేక ఆకులను కట్టేసి అంతర పంటలు సాగు చేస్తున్నారు. అలాగే ఏడాదికి రెండుసార్లు అంతర పంటల కోసం మొక్క మొదటికి దుక్కులు దున్నుతున్నారు. దీనివల్ల పంట దిగుబడి ఆలస్యం అవుతోంది. ఈ విషయంపై చిన్న, సన్నకారు రైతులకు కనీస అవగాహన లేదు. వీళ్లు రెండేళ్లపాటు పంట దిగుబడి కోల్పోతున్నారు. ఆర్థికంగా నష్టపోతున్నారు. ఆయిల్‌ఫెడ్ అధికారులు రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.
– తుంబూరు ఉమామహేశ్వర్‌రెడ్డి, రైతు సంఘం అధ్యక్షుడు, సత్తుపల్లి
