దమ్మపేటరూరల్, ఫిబ్రవరి 21: కల్లింగ్ మొక్కలు వచ్చిన బ్యాచ్‌లకు పరిహారం ఇవ్వాలని పామాయిల్ మొలకలను సరఫరా చేసిన కోష్టారికాలోని కంపెనీకి ఆయిల్‌ఫెడ్ లేఖ రాసినట్లు తెలిసింది. ఒక పక్క లేఖ రాయడం ద్వారా కల్లింగ్ మొక్కలని నిర్ధారించుకున్న తరువాత సైతం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేగళ్లపాడు నర్సరీలో మొక్కలన్నీ మంచివేనని ప్రచారం చేయడం ఆయిల్‌ఫెడ్ యాజమాన్య ద్వంద్వ నీతికి నిదర్శనంగా చెప్పవచ్చు.
రేగళ్లపాడులో దశలవారీగా ఇప్పటివరకు సుమారు 1.5 లక్షల కల్లింగ్ మొక్కలను ధ్వంసం చేసిన విషయం విదితమే. వీటిలో ఇటీవల ధ్వంసం చేసిన 80వేల మొక్కలను అనుమతి తీసుకోకుండా ధ్వంసం చేశారని ఆరోపిస్తూ ఆయిల్‌ఫెడ్ అధికారులతోనూ, ఉద్యాన శాఖ అధికారులతోనూ పలు దఫాలు విచారణలు పూర్తయ్యాయి. విచారణలో తేలిన నిజాలు ఆయిల్‌ఫెడ్, ఉద్యాన శాఖలు బయటకు రానీయలేదు.
ఈ నర్సరీలో ఇంకా యాగాంబి, తంబా రకాలకు చెందిన కల్లింగ్ మొక్కలు సుమారు 3 లక్షలకు పైగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రేగళ్లపాడు నర్సరీ నుంచి మొక్కలు తీసుకెళ్లి పామాయిల్ సాగు చేస్తున్న రైతులు తమకు ఎటువంటి మొక్కలు ఇచ్చారో తెలియక అయోమయంలో ఉన్నారు. లక్షల్లో కల్లింగ్ మొక్కలు వస్తున్నా దీనిపై ఆయిల్‌ఫెడ్, ఉద్యాన శాఖ రైతులకు వివరణ, భరోసా ఇవ్వకపోవడంతో రైతుల్లో పలు అనుమానాలు కలుగుతున్నాయి.
పామాయిల్ నర్సరీలను స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ నిబంధనల ప్రకారం నిర్వహించాలి. ఈ నిబంధనలను తెలంగాణ ఆయిల్‌ఫెడ్ పూర్తిగా తుంగలో తొక్కిందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల సత్తుపల్లి ఆయిల్‌ఫెడ్ కార్యాలయంలో జరిగిన విచారణలో సస్పెన్షకు గురైన ఔట్ సోర్సింగ్ ఉద్యోగి విచారణ అధికారులకు ఎస్వోపీ గైడ్‌లైన్స్‌పై ప్రశ్నలు గుప్పించినట్లు సమాచారం. ఈ గైడ్‌లైన్స్ ప్రకారం 25 శాతానికి మించి దిగుమతి చేసుకున్న బ్యాచ్‌లో కల్లింగ్ మొక్కలు వస్తే ఆ బ్యాచ్‌ను పూర్తిగా తిరస్కరించి మొలకలను సరఫరా చేసిన కంపెనీ నుంచి పరిహారం రాబట్టాల్సి ఉంది. దీనిపై స్పష్టమైన అధికారిక ప్రకటన ఆయిల్‌ఫెడ్, ఉద్యాన శాఖల నుంచి కరువైంది.
విదేశాల నుంచి విత్తనాలు, మొలకలు దిగుమతి చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందాలి. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ ఎగ్జిమ్ కమిటీ నుంచి ఆయిల్‌ఫెడ్ పలుమార్లు అనుమతి పొందింది. సదరు అనుమతి పత్రంలో పేర్కొన్న మొక్కల నుంచి కొన్నింటిని (అనుమతి పత్రంలో పేర్కొన్న మొలకల సంఖ్య) ఐఐవోపీఆర్కు పంపాలి. ఈ నిబంధనలు ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆయిల్‌ఫెడ్ ఏమాత్రం పట్టించుకోకపోవడం ప్రస్తుత దుస్థితికి కారణంగా చెప్పవచ్చు.
ఆయిల్‌ఫెడ్ ఒకటే కాదు.. ఏ కంపెనీ కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆయిల్‌పామ్ రీసెర్చ్ (ఐఐవోపీఆర్)కు నిబంధనల ప్రకారం పంపాల్సిన మొక్కలను పంపలేదు. త్వరలోనే అన్ని సమస్యలను పరిష్కరిస్తాం.
-సుధాకర్‌రెడ్డి, ఆయిల్‌ఫెడ్ జీఎం