మధిర, జులై 07 : ఆయిల్‌పామ్ సాగు రైతులకు లాభదాయకమని మధిర ఉద్యానవన శాఖ అధికారి ఏ.విష్ణు, మండల వ్యవసాయ అధికారి సాయి దీక్షిత్ అన్నారు. సోమవారం మధిర మండలంలోని సిద్దినేనిగూడెం గ్రామంలో రైతు సురంశెట్టి కిశోర్ భూమిలో ఆయిల్‌పామ్ మెగా ప్లాంటేషన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయిల్‌పామ్ పంట లాభదాయకమన్నారు. ఒకసారి నాటితే 30 సంవత్సరాల వరకు ఆదాయాన్ని ఇచ్చే పంట అన్నారు. కోతుల నుండి ప్రకృతి వైపరీత్యాల నుండి హాని లేని పంట అన్నారు. చీడ పీడలు తక్కువగా ఆశించే పంట అని, మార్కెటింగ్ సౌకర్యం ఉన్న పంట అని వివరించారు.
ప్రభుత్వం రూ.200 విలువ గల మొక్కని రాయితీ మీద రూ.20కే ఇస్తున్నట్లు తెలిపారు. నాలుగు సంవత్సరాల పాటు నిర్వహణ ఖర్చుల కింద ప్రతి ఏడాది ఎకరాకు రూ.4,200 చొప్పున అందజేస్తున్నట్లు చెప్పారు. ఆయిల్‌పామ్ సాగుకు ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం, బీసీలు, చిన్న, సన్న కారు రైతులకు 90 శాతం, ఇతరులకు 80 శాతం రాయితీపై డ్రిప్ పరికరాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ విధంగా, ఆయిల్‌పామ్ మొక్కలకు, తోట నిర్వహణ ఖర్చులకు నాలుగు సంవత్సరాల వరకు, డ్రిప్ ఇరిగేషన్‌కు ఒక ఎకరానికి రూ.50,918 ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ ఫీల్డ్ ఆఫీసర్ రామకృష్ణ పాల్గొన్నారు.