ఆళ్ళపల్లి, డిసెంబర్ 14 : సరిహద్దు జిల్లాలో సంచరించిన పెద్దపులి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అడుగు పెట్టినట్లు తెలుస్తున్నది. శనివారం తెల్లవారుజామున పులి గాండ్రింపులు వినిపించినట్లు ఆళ్లపల్లి మండలం దొంగతోగు గ్రామస్తులు చెబుతూ ఆందోళన చెందుతున్నారు. గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో అటవీ శాఖ అధికారులు గుండాల రేంజ్ పరిధిలోని దొంగతోగు అటవీ ప్రాంతంలో పులి ఆనవాళ్లు తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. నిన్న, మొన్నటి వరకు ములుగు జిల్లా మంగపేట, తాడ్వాయి, కరకగూడెం అడవుల్లో సంచరించిన పులి.. అక్కడి నుంచి సరిహద్దున ఉన్న గుండాల అటవీ రేంజ్ పరిధిలోకి అడుగు పెట్టడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
ఈ క్రమంలో దొంగతోగు, ముత్తాపురం, సజ్జలబోడు, నడిమిగూడెం గ్రామాల రైతులు శనివారం చేను, పొలం పనులకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. దొంగతోగు గ్రామానికి కిన్నెరసాని అభయారణ్యం దగ్గరగా ఉంటుంది. దీంతో ఈ ప్రాంతంలోనే పెద్దపులి సంచరిస్తున్నట్లు సమాచారం. అయితే అడవిలోకి ఒంటరిగా వెళ్లొద్దని, చేను పనులకు వెళ్లిన వారు త్వరగా ఇళ్లకు చేరుకోవాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. పెద్దపులి రోజుకు 20 కిలో మీటర్ల చొప్పున ప్రయాణించే అవకాశం ఉండడంతో ఒకచోట నుంచి మరో చోటుకు చేరుతుందని, ఈ విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.
పోడు భూములు అడవులకు దగ్గరగా ఉండడంతో రైతులు అటువైపు వెళ్లడానికి జంకుతున్నారు. పశువులను సైతం మేతకు తీసుకెళ్లడానికి కూడా భయపడుతున్నారు. మూడేళ్ల క్రితం ఈ ప్రాంతంలో సంచరించిన పులి జంతువులపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. పులి ఆనవాళ్ల కోసం గుండాల రేంజర్ నరసింహారావు, ఆళ్లపల్లి రేంజర్ కిరణ్కుమార్, రేగళ్ల రేంజర్ జశ్వంత్ ఆధ్వర్యంలో కిన్నెరసాని అభయరణ్యంతోపాటు చుట్టుపక్కల అటవీ ప్రాంతంలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. నీటి వనరులు ఉన్నచోట అమర్చిన సీసీ కెమెరాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. అటవీ ప్రాంతాలను ఆనుకుని నివసించే గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.