కూసుమంచి, జనవరి 30 : మూడు జిల్లాలకు తాగునీరు అందించే పాలేరు రిజర్వాయర్ డెడ్ స్టోరేజీకి చేరుకోవడంతో బుధవారం మధ్యాహ్నం సాగర్ జలాశయం నుంచి పాలేరు రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేయనున్నారు. ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని అందిస్తున్నారు. సోమవారమే సాగర్ డ్యామ్ నుంచి నీరు విడుదల కావాల్సి ఉన్నప్పటికీ అధికారికంగా ఆదేశాలు రాకపోవడంతో మంగళవారం విడుదల చేస్తారని భావించారు.. కానీ బుధవారం మధ్యాహ్నం నీరు విడుదల చేసేందుకు ఆదేశాలు జారీచేశారు. దీంతో సాగర్ నుంచి తొలుత 1,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసి క్రమంగా పెంచుతూ 4వేల క్యూసెక్కుల వరకు నీటిని వదులుతారు. పాలేరు నుంచి మూడు జిల్లాలకు తాగునీటి అవసరాలకు గాను నీటిని విడుదల చేయాలని వారంరోజుల కిందటే మిషన్ భగీరథ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఇరిగేషన్ శాఖను కోరారు. పాలేరు డెడ్ స్టోరేజి అయ్యే వరకు ఆదేశాలు రాకపోవడంతో పరిస్థితి ఒకటి రెండురోజుల్లో చేజారిపోయే ప్రమాదం ఉన్నందున నీటిని విడుదల చేస్తున్నారు. పాలేరు పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగులు, నీటి సామర్థ్యం 2.588 టీఎంసీలు. మంగళవారం సాయంత్రానికి పాలేరు నీటిమట్టం 11.50 అడుగులు అంటే డెడ్‌స్టోరేజికి చేరుకుంది. నీటి సామర్థ్యం 0.90 టీఎంసీలు మాత్రమే ఉంది. మరో అర అడుగు నీటిమట్టం పడిపోతే మిషన్ భగీరథకు తాగునీరు అందదు.
పాలేరు జలాశయం నుంచి మూడు జిల్లాల తాగునీటి అవసరాలకు రోజుకు 126 క్యూసెక్కుల నీటిని తీసుకొంటారు. షట్టర్లు లీకుల ద్వారా 20 క్యూసెక్కులు, పాలేరు రిజర్వాయర్ చుట్టూ ఉన్న మోటర్ల ద్వారా మరో 25 క్యూసెక్కుల నీరు మొత్తం 170 క్యూసెక్కుల నీరు నిత్యం పాలేరు నుంచి విడుదల అవుతున్నది. ఇలా ప్రతి రోజు విడుదల అయ్యే నీటితో రోజుకు 0.20 అడుగుల మేర పాలేరు నీటిమట్టం తగ్గుతుంది. వేసవిలో అయితే ఎండ తీవ్రత వల్ల నీరు ఎక్కువగా ఆవిరి అవుతుంది కాబట్టి రోజుకు కనీసం 200 క్యూసెక్కులపైన నీరు కావాల్సి ఉంటుంది.
సాగర్‌లో బుధవారం వదిలిన నీరు 135 కిలోమీటర్లు ప్రయాణించి గురువారం అర్ధరాత్రికి పాలేరు రిజర్వాయర్‌కు చేరుకునే అవకాశం ఉంది. పాలేరు కింద గల మిషన్ భగీరథ తాగునీటి అవసరాల కోసం వేసవి వరకు తాగునీటి కొరత తీరాలంటే 1.50 టీఎంసీల నీరు కావాల్సి ఉంది. నీరు విడుదలైన తరువాత నీటిని ఎక్కడా వాడకుండా, ట్యాంపరింగ్ జరగకుండా అధికారులు సాగర్ నుంచి పాలేరు వరకు కాలువలపై గస్తీ ఏర్పాటు చేస్తున్నారు. తూములు, షట్టర్లు, మేజర్లు, మైనర్ల కాలువల వద్ద కాపలా ఉంచి నీటిని పాలేరు వరకు వచ్చేలా ఇరిగేషన్ అధికారులు చర్యలు చేపట్టారు.