చండ్రుగొండ, మే 18 : నెల రోజులుగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టకుండా అధికారులు నిర్లక్ష్యం వహించడంపై అన్నదాతలు ఆగ్రహించారు. కొనుగోళ్ల గురించి ఏమాత్రం పట్టించుకోకపోవడంతో విసుగు చెందిన రైతులు మూకుమ్మడిగా ఆందోళనకు దిగి, ధాన్యం కుప్పగా పోసి నిప్పంటించి నిరసన తెలిపారు. ఈ ఘటన చండ్రుగొండ మండలం దామెరచర్లలో సోమవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
గానుగపాడు సొసైటీ పరిధిలోని దామెరచర్ల గ్రామానికి చెందిన రైతులు కొనుగోలు కేంద్రానికి నెల రోజుల క్రితం ధాన్యం విక్రయానికి తరలించారు. అయితే ధాన్యం కొనుకోలు చేయకుండా అధికారులు, మిల్లర్లు నిబంధనలు, లారీల కొరత అంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం రైతుల ఆందోళనతో దిగొచ్చిన ప్రభుత్వం ట్రాక్టర్ల ద్వారా ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. కానీ, మిల్లర్లు ధాన్యం దిగుమతి చేసుకోకుండా సోమవారం తిరిగి వెనక్కి పంపించారు. దీంతో ఆగ్రహించిన రైతులు విజయవాడ-జగదల్పూర్ జాతీయ రహదారిపై ధాన్యం లోడ్‌తో ఉన్న ట్రాక్టర్లను అడ్డుపెట్టి రాస్తారోకో చేపట్టారు.
అయినా అధికారులు స్పందించకపోవడంతో రోడ్డుపైనే ధాన్యం పోసి నిప్పంటించి తగులబెట్టి నిరసన వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం తెలుసుకున్న కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ, తహసీల్దార్ జగదీశ్వర్ ప్రసాద్‌లు ఘటనా స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడారు. ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో రేపటిలోగా ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేసి, మిల్లులకు తరలిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో రైతులు బీరకాయల వెంకటేశ్వరరావు, సానిక మల్లేశు, అచ్చెన రాము, రైతులు పాల్గొన్నారు.