కూసుమంచి, ఏప్రిల్ 14: నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి పాలేరు జలాశయానికి విడుదలవుతున్న నీటిని అధికారులు మంగళవారం బంద్ చేశారు. గత డిసెంబర్ 15వ తేదీన ప్రారంభమైన నీటి విడుదల ఇప్పటివరకు కొనసాగింది. సాగర్ నుంచి నీటి విడుదల బంద్‌కావడంతో పాలేరు నుంచి కిందకు విడుదలవుతున్న సాగునీటిని సైతం ఇరిగేషన్ శాఖ అధికారులు నిలిపివేశారు. వేసవి కాలం తాగునీటి అవసరాలకు మాత్రమే నీటిని వినియోగించాలనే ఆలోచనతో ఇరిగేషన్, మిషన్ భగీరథ, గ్రామీణ తాగునీటి సరఫరా అధికారులు ప్రయత్నాలు చేపట్టారు.
గత వారం రోజులుగా నీటి విడుదలను క్రమంగా తగ్గిస్తూ పాలేరు రిజర్వాయర్ నీటిమట్టం 22 అడుగుల వద్ద ఉండేలా చూస్తున్నారు. ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాకు తాగునీటిని అందించే పాలేరు జలాశయం నీటిమట్టం మంగళవారం నాటికి 22 అడుగులు ఉండగా.. సాగర్ నుంచి 3వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. పాలేరు నుంచి మిషన్ భగీరథకు 135 క్యూసెక్కులు, పాలేరు చానల్‌కు 120 క్యూసెక్కులు, భక్తరామదాసు ఎత్తిపోతలకు 275 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
గత అనుభవాల దృష్ట్యా..
రెండేళ్ల కిందట పాలేరు జలాశయంలో నీటి నిల్వలు పూర్తిగా పడిపోయి నీటిమట్టం 5 అడుగులకు చేరుకుంది. జలాశయం చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా నిల్వలు పడిపోయాయి. జేసీబీలతో కాలువలు తవ్వించి మిషన్ భగీరథకు అతికష్టం మీద నీటిని అందించారు. పాలేరు వద్ద ఏర్పాటు చేసిన ఇన్‌టెక్‌వెల్ ద్వారా ఖమ్మం జిల్లాకు, మాదిరిపురం వద్ద ఏర్పాటు చేసిన ఇన్‌టెక్‌వెల్ ద్వారా మహబూబాబాద్ జిల్లాకు, చందుపట్ల వద్ద ఏర్పాటు చేసిన ఇన్‌టెక్‌వెల్ ద్వారా సూర్యాపేట జిల్లాకు తాగునీటిని అందిస్తున్నారు.
సుమారు 7 లక్షల కుటుంబాలకు పాలేరు నీటిని మిషన్ భగీరథ ద్వారా అందిస్తున్నారు. ఈసారి అలాంటి సమస్య రాకుండా ముందస్తుగానే నీటిని నిల్వ చేసుకుంటున్నారు. మంగళవారం పాలేరు రిజర్వాయర్‌ను సీఈ మంగళపుడి వెంకటేశ్వర్లు, ఈఈ బాణాల రమేశ్‌రెడ్డి, ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు. వరికోతలు అయిపోయినందున సాగునీటికి నీటిని తగ్గించి తాగునీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు చీఫ్ ఇంజినీర్ వెంకటేశ్వర్లు ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు.