సిద్దిపేట, జూలై 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘రాష్ట్రంలో ప్రస్తుత కరువు సహజసిద్ధంగా రాలేదు. ఇది పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే. ప్రకృతి తెచ్చింది కానేకాదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెచ్చిన కరువు. ప్రభుత్వం సమయానికి కాళేశ్వరం నీళ్లు ఎత్తకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించింది’ అని బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉపనేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలను ఎత్తి తెలంగాణ రైతులకు అందించారని గుర్తుచేశారు. ఆ రోజుల్లో వానల కోసం దేవుండ్లను వేడుకొనే పరిస్థితి ఉండేది కాదని చెప్పారు. ‘గోదావరి నీళ్లొస్తే చాలు.. చెరువులు నిండేవి, కాలువలు పారేవి, పంటలు పండేవి. గడిచిన ఆరేండ్లలో కరువు అనే మాట రైతు నోట వినిపించలేదు’ అని పేర్కొన్నారు. వేసవిలో కూడా చెరువులు అలుగులు తొకాయని, రెండు పంటలు కాదు.. మూడు పంటలను కూడా రైతులు సాగు చేశారని చెప్పారు.
కన్నెపల్లి బరాజ్ నుంచి తక్షణమే కాళేశ్వరం నీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలనే ప్రధాన డిమాండ్‌తో ఆదివారం సిద్దిపేట జిల్లా అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి రంగనాయక సాగర్ రిజర్వాయర్ వరకు బీఆర్ఎస్ పార్టీ చిన్నకోడూరు మండల కమిటీ ఆధ్వర్యంలో 16 కిలోమీటర్ల దాకా రైతులు చేపట్టిన పాదయాత్రకు విశేషస్పందన వచ్చింది. ఈ పాదయాత్రను ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ప్రారంభించారు. పెద్దకోడూరు నుంచి రంగనాయక సాగర్ వరకు దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర రైతులతో కలిసి హరీశ్‌రావు పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో రైతులనుద్దేశించి హరీశ్‌రావు మాట్లాడారు. వెంటనే కాళేశ్వరం మోటర్లు ప్రారంభించి రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్లను నింపాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కండ్లు తెరువాల్సిన సమయం వచ్చిందని, ఈ యాత్ర బీఆర్ఎస్ పెట్టింది కాదని రైతులు తమ పంటలు కాపాడుకోవడానికి చేసిన పాదయాత్ర అని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకుంటే చిన్నకోడూరు తరహాలోనే ప్రతి మండలంలో రైతులు ఉద్యమాలు చేపడుతారని హెచ్చరించారు. రైతుల కోపాగ్నిని తట్టుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సాధ్యం కాదని స్పష్టంచేశారు.
దేవుండ్ల ఆగ్రహం తప్పదు
లోక్‌సభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలోని ప్రసిద్ధ ఆలయాల దేవుండ్లపై ఒట్లు వేశారని, ఆ తర్వాత వాటిలో ఒక్కమాటనూ నిలబెట్టుకోలేదని విమర్శించారు. ‘అనంతగిరి నీళ్లు ఎత్తకపోతే పోచమ్మ తల్లి చూస్తుంది. రంగనాయకసాగర్ నింపకపోతే రంగనాయకస్వామి చూస్తాడు. మల్లన్నసాగర్ నింపకపోతే కొమురవెల్లి మల్లన్న ఆశీర్వాదం ఉండదు. కొండపోచమ్మ సాగర్ ఖాళీగా ఉంచితే ఆ తల్లి ఆగ్రహాన్ని ఎదురోవాల్సి వస్తుంది’ అంటూ హెచ్చరించారు. 75, 80 ఏండ్ల అనుభవజ్ఞులైన రిటైర్డ్ ఇంజినీర్లు ఈ కరువు పరిస్థితుల్లో వెంటనే కాళేశ్వరం మోటర్లు నడుపాలని, అవసరమైన మరమ్మతులు పూర్తిచేసి నీటిని ఎత్తిపోయాలని సూచించినా, వారి మాటలను పెడచెవిన పెట్టడమే కాకుండా, వారిపై బెదిరింపులకు దిగారని మండిపడ్డారు.
ఉదయం కోత.. పగలు అంతరాయం
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయానికి 24 గంటలు నాణ్యమైన విద్యుత్తు సరఫరా కావడమే లేదని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనలో రైతు ఎప్పుడు మోటర్ ఆన్చేసినా కరెంట్ ఉండేదని, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని తెలిపారు. తెల్లవారుజామున కరెంట్ కోతలు, పగటిపూట అంతరాయాలు, నిర్ణీత సమయానికి విద్యుత్తు లేక రైతులు పొలాల్లోనే ఉండి ఎదురుచూడాల్సిన దుస్థితి మళ్లీ వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. 24 గంటల కరెంట్ మాట పకనపెడితే, ప్రకటించిన సమయం వరకైనా సరఫరా కావడం లేదని విమర్శించారు. విద్యుత్తు కోతల వల్ల మోటర్లు నడవడం లేదని, పంటలు ఎండుతున్నాయని, రైతు ఆందోళనలో ఉన్నాడని తెలిపారు.
వరదలు రాకముందే సిద్ధంగా ఉండాలి
గోదావరిలో నీటి లభ్యత ఉన్నప్పుడు వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హరీశ్‌రావు సూచించారు. మరో 15 రోజుల్లో ఆగస్టు నెలలో వరదలొస్తాయని, అప్పటికి అన్నారం, సుందిళ్ల బరాజ్‌లను సిద్ధంగా ఉంచాలని హితవు పలికారు. వరద నీరు వచ్చిన వెంటనే ఎత్తిపోసేలా మోటర్లను సిద్ధం చేయాలని కోరారు. ఎల్లంపల్లి వద్ద నీటి నిల్వలు తగ్గితే ఎన్టీపీసీ, సింగరేణి థర్మల్ విద్యుత్తు కేంద్రాలపై కూడా ప్రభావం పడుతుందని హెచ్చరించారు. విద్యుదుత్పత్తి దెబ్బతింటుందని, హైదరాబాద్ తాగునీటి సరఫరాపైనా ప్రభావం ఉంటుందని హెచ్చరించారు. అలాంటి పరిస్థితి రాకముందే ప్రభుత్వం మేలొని కాళేశ్వరం ద్వారా నీటిని ఎత్తాలని డిమాండ్ చేశారు.
కాళేశ్వరంపై రాజకీయాలొద్దు..
‘కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ కక్ష సాధింపు మానుకోవాలని హరీశ్‌రావు ప్రభుత్వానికి సూచించారు. కాళేశ్వరం వల్ల కేసీఆర్‌కు పేరొస్తుందనే కారణంతో ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయొద్దని హితవు పలికారు. రైతుల ప్రాణాలు రాజకీయాల కంటే గొప్పవని పేర్కొన్నారు. మోటర్లు ఆన్‌చేసి నీళ్లు ఎత్తిపోయాలని, ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులను రాజకీయ కక్షతో పకన పెట్టొద్దని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పలు ఘటనలను ప్రస్తావిస్తూ, వాటిపై విచారణ ఎందుకు జరుగలేదని ప్రశ్నించారు. ‘ఎస్ఎల్బీసీప్రాజెక్టు వద్ద జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆచూకీ ఏమైంది? సుంకిశాల పంప్‌హౌస్ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకొన్నా? వాటిపై విచారణ జరుపకుండా, కాళేశ్వరం పేరుతో మాత్రమే విచారణలు చేయడం రాజకీయ కక్ష కాదా?అని ప్రశ్నించారు.
భద్రాచలం పేరిట తప్పదోవ
రామాలయం మునిగిపోతుందని భద్రాచలం పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని హరీశ్‌రావు విమర్శించారు. 2022లో గోదావరిలో 29 లక్షల క్యూసెకుల వరద వచ్చినా భద్రాచలం ఆలయానికి ఎలాంటి ప్రమాదం జరుగలేదని తేల్చి చెప్పారు. ఇప్పుడు అన్నారం, సుందిళ్ల ద్వారా వచ్చే లక్ష క్యూసెకుల నీటితో ఆల యం మునిగిపోతుందని చెప్పడం ప్రజలను తప్పుదారి పట్టించడమేనని విమర్శించారు.
కాళేశ్వరం మోటర్లు ఆన్ చేయాలి.
‘రైతుల డిమాండ్ ఒకటే.. కాళేశ్వరం మోటర్లు వెంటనే ఆన్చేయాలి. రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్తోపాటు ఇతర అన్ని రిజర్వాయర్లను నీటితో నింపాలి’ అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. కరువు మరింత తీవ్రం కాకముందే ప్రభుత్వం మేలొనాలని హితవు పలికారు.
కదంతొక్కిన రైతులు
కాళేశ్వరం మోటర్లు ఆన్చేయాలి.. ప్రాజెక్టులు నింపాలనే ప్రధాన డిమాండ్‌తో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు చేపట్టిన పాదయాత్రకు వేలాది మంది తరలివచ్చారు. బీఆర్ఎస్ శ్రేణులు, రైతుల నినాదాలు మిన్నంటాయి. రక్తపిపాసి రేవంత్‌రెడ్డీ ఇక కాసుకో.. నీళ్ల కోసం మా రక్తం దారప్తోస్త.. కాళేశ్వరం నీళ్లివ్వు.. అంటూ రైతులు చేసిన నినాదాలు హోరెత్తాయి. అల్లీపూర్ నుంచి రంగనాయకసాగర్ వరకు పాదయాత్ర చేపట్టిన రైతులు కాంగ్రెస్ సర్కార్‌కు హెచ్చరికను జారీచేశారు. అనంతరం రంగనాయకసాగర్ బండ్‌పై నిల్చొని భారీ ఫ్లెక్సీని ప్రదర్శించారు. ‘మా రక్తం కావాలంటే తీసుకోండి ! మా పంటలకు నీళ్లివ్వండి! సాగు నీరు-రైతుల ప్రాథమిక హక్కు.. కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద వెంటనే మోటర్లు ప్రారంభించి కాళేశ్వర జలాలతో రిజర్వాయర్లన్నింటినీ నింపాలి.. తెలంగాణ రైతుగా తెలంగాణ ప్రభుత్నాన్ని డిమాండ్ చేస్తున్నం.. అనే నినాదాలతో కూడిన భారీ ఫ్లెక్సీపై హరీశ్‌రావు, దేశపతి, నాయకులు వేలేటి రాధాకృష్ణశర్మ, మాణిక్యరెడ్డి, కాముని శ్రీనివాస్‌తోపాటు యాత్రలో పాల్గొన్న రైతులు సంతకాలు చేశారు.
కనికరం లేని రేవంత్: దేశపతి
‘మా ప్రాణాలైనా తీసుకో రేవంత్‌రెడ్డీ.. కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోసి మాకు సాగునీరు ఇవ్వాలని రైతులు వేడుకుంటున్నా సీఎం రేవంత్‌రెడ్డికి కనికరం రావడమే లేదు’ అని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ హయాంలో పచ్చబడ్డ తెలంగాణను కాంగ్రెస్ వచ్చాక సీఎం రేవంత్‌రెడ్డి తెర్లు చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డికి రాజకీయం తప్ప, ప్రజలు, రైతుల ప్రయోజనాలు లెకలేదని పేర్కొన్నారు. కాళేశ్వరం వద్ద కండ్లముందు గోదావరి జలాలు ఆంధ్రాకు తరలిపోతుంటే రేవంత్‌రెడ్డి గుడ్లప్పగించి చూస్తున్నాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పదేండ్లకాలం తన మెదడును రంగరించి ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలు.. రైతుల కరువు తీర్చే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మిస్తే.. రేవంత్‌రెడ్డి దానిని ఉపయోగించకుండా కరువును తెచ్చిపెట్టిండని ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి చిల్లర రాజకీయాలతోనే కన్నెపల్లి వద్ద మోటర్లు ఆన్‌చేసి నీళ్లివ్వకుండా రైతులకు కరువు తెచ్చి పెడుతున్నాడని మండిపడ్డారు. కేసీఆర్‌కు క్రెడిట్ దకకూడదనే సంకుచిత మనస్తత్వంతోనే ముఖ్యమంత్రి నీళ్లను దిగువకు వదులుతున్నాడని ఆరోపించారు.
కేసీఆర్‌ను తిడితే నీళ్లు రావు. కాళేశ్వరం మోటర్లు ఆన్ చేస్తేనే నీళ్లొస్తయి. కేసీఆర్‌ను విమర్శించడం వల్ల మీ మనసుకు సంతృప్తి కలుగొచ్చు. కానీ, రైతుల పొలాలకు నీళ్లు రావు. రైతుల గుండెల్లో మంట చల్లారదు. కేసీఆర్ కట్టించిన కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయ కక్షతోనే నిర్లక్ష్యం చేస్తున్నారు.
గోదావరి నీటిని కాంగ్రెస్ ప్రభుత్వం కిందికి వదిలేస్తున్నది. దానిని ఆంధ్రప్రదేశ్ వినియోగించుకొంటున్నది. మన నీటిని కాపాడాల్సిన ముఖ్యమంత్రి తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పటికే 70 టీఎంసీలకు పైగా నీటిని దిగువకు వదిలేశారు. ఆ నీటితో ఈ రోజు రంగనాయకసాగర్ రిజర్వాయర్ రెండుసార్లు నిండేది. కానీ ఇప్పుడు రిజర్వాయర్ అడుగున రాళ్లు కనిపిస్తున్నాయి.
– బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు
సీఎం రేవంత్‌రెడ్డి రైతులపాలిట రాక్షసుడిగా మారాడు. కేసీఆర్ పాలనలో తెలంగాణ వ్యవసాయం స్వర్ణయుగంగా వర్ధిల్లింది. ఆనాడు కేసీఆర్ రైతులకు ఆపద్బాంధవుడిగా నిలిచారు. కాంగ్రెస్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో? అప్పటి నుంచి రైతుల పరిస్థితి మళ్లీ వెనకి వెళ్లింది. -హరీశ్‌రావు

కాళేశ్వరం మోటర్లు ఆన్‌చేసి పంటలకు నీళ్లందించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సర్కార్‌పై వేలాది మంది రైతులు కదంతొక్కారు. రెండున్నరేండ్లుగా ప్రాజెక్టుపై కక్షగట్టి.. కరువు ముంచుకొచ్చినా కండ్లు తెరువకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తున్న తీరును పాదయాత్ర ద్వారా ఎండగట్టారు. సిద్దిపేట జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి రంగనాయక సాగర్ రిజర్వాయర్ వరకు బీఆర్ఎస్ చిన్నకోడూరు మండల కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన యాత్రలో 16 కిలోమీటర్లు నడిచివెళ్లి తమ ఆవేదన, ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. దారిపొడవునా ‘రక్తపిపాసి రేవంత్‌రెడ్డీ ఇక కాసుకో.. నీళ్ల కోసం మా రక్తం ధారపోస్తం..కాళేశ్వరం నీళ్లివ్వు’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. రంగనాయకసాగర్ బండ్‌పై నిల్చొని ‘సాగు నీరు-రైతుల ప్రాథమిక హక్కు.. కన్నెపల్లి మోటర్లు ప్రారంభించి రిజర్వాయర్లన్నింటినీ నింపాలి’ అంటూ భారీ ఫ్లెక్సీని ప్రదర్శించారు.

బీఆర్ఎస్ పార్టీ చిన్నకోడూరు మండల కమిటీ ఆధ్వర్యంలో రైతులు, పార్టీశ్రేణులతో కలిసి పాదయాత్ర చేస్తున్న మాజీ మంత్రి హరీశ్‌రావు

రంగనాయక్‌సాగర్ వరకు రైతు పాదయాత్రలో పాల్గొన్న రైతులు, పార్టీ శ్రేణులు