99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ పేరిట ఉమ్మడి జిల్లాలో గురువారం ప్రభుత్వం నిర్వహించిన గ్రామ, వార్డు,డివిజన్ సభలు వెలవెలబోయాయి. ముఖ్యంగా కొన్ని మండలాల్లో తగినంత సంఖ్యలో జనం రాకపోవడంతో సభలన్నీ మొక్కుబడిగానే సాగాయి. అధికారులు కూడా సీఎం సందేశం వినిపించేందుకు పరిమితమయ్యారు. గ్రామసభల్లోనూ, పట్టణాల్లోని వార్డు సభల్లోనూ అధికారుల దృష్టికి పాత, కొత్త సమస్యలు వచ్చాయి. ప్రభుత్వ హామీలపై పలు చోట్ల అధికారులను ప్రజలు నిలదీశారు. ఇకపై న్యాయం చేస్తామంటూ హామీలిస్తూ అధికారులు సభలు ముగించారు.
ఉమ్మడి జిల్లాలో ప్రజాపాలన గ్రామసభలు మొక్కుబడిగా సాగాయి. ఆయా పంచాయతీల్లో చెత్తాచెదారాలను తొలగించినా చాలాచోట్ల ఎక్కడి కుప్పలు అక్కడే నిలిచిపోయాయి. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు వార్డుల్లో ప్రధాన మురుగు కాలువల్లో మురుగు పేరుకుపోయింది. పాలకులు, కార్పొరేషన్ అధికారులు పెద్దగా దృష్టిపెట్టకపోవడంతో కాలువలన్నీ మురుగు కూపాలుగా దర్శనమిస్తున్నాయి. మేజర్ పంచాయతీల్లో ఎప్పటిలాగా సిబ్బంది పనిచేసినా మారుమూల ప్రాంతాల్లో మురుగు తొలగలేదు. కొన్నిచోట్లకు చెత్తబండ్లు వెళ్లడం లేదు.
గురువారం నాటి గ్రామసభలకు జనాల హాజరు అంతంతమాత్రంగానే ఉంది. వచ్చిన కొద్దిపాటి మంది కూడా గ్యారెంటీ హామీలు, స్థానిక సమస్యలపై అధికారులను నిలదీశారు. మురుగు, డ్రైనేజీలు వంటి సమస్యలపై ప్రశ్నల వర్షం కురిపించారు. కానీ, అధికారుల నుంచి ఆశించిన సమాధానాలు రాలేదనే విమర్శలొచ్చాయి. లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్, పాల్వంచ మండలాల్లో జరిగిన గ్రామసభల్లో అక్కడి ప్రజలు పాత సమస్యలనే చెప్పుకోవాల్సి వచ్చింది. ఇల్లెందు, టేకులపల్లి మండలాల్లో కూడా గ్రామసభలకు పెద్దగా జనం హాజరుకాలేదు. అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి మండలాల్లో కూడా సభలు వెలవెలపోయాయి.

రుద్రంపూర్‌లో సర్పంచ్ లేకుండానే గ్రామసభ..
సమస్యలు పరిష్కారం కాకపోవడంతో కొన్నిచోట్ల అధికారులందరూ హాజరు కాలేదు. ఆరోగ్య శాఖ, అంగన్వాడీ, పంచాయతీ రాజ్, ఆర్డబ్ల్యూఎస్ వంటి శాఖల అధికారులు మాత్రమే హాజరయ్యారు. ఇతర శాఖల అధికారులు పెద్దగా హాజరుకాలేదు. రుద్రంపూర్ పంచాయతీలో సాక్షాత్తూ సర్పంచే సభకు రాలేదు. దీంతో అక్కడ వివాదాలున్నట్లు ఆరోపణలు వినిపస్తున్నాయి. అయితే, ఆరోగ్య సమస్య వల్లే సర్పంచ్ రాలేదని అధికారులు చెప్పారు. కానీ, పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించకపోవడం వల్లే సర్పంచ్ సహా కొందరు అధికారులు జనానికి ముఖం చాటేసినట్లు తెలిసింది.
సీఎం సందేశం వినిపించేందుకే పరిమితం..
గ్రామసభలకు జనం పెద్దగా హాజరుకాకపోవడం; వచ్చిన ఆ కొద్దిమంది కూడా ప్రభుత్వ హామీలు, పథకాల అమలుపై ప్రజల నుంచి నిలదీతలు ఎదురయ్యే అవకాశం ఉండడం వంటి కారణాలతో అధికారులు కూడా సభల్లో కేవలం సీఎం సందేశాన్ని వినిపించేందుకే పరిమితమయ్యారు. అక్కడక్కడా స్థానిక సమస్యలను అక్కడి ప్రజలు సభ దృష్టికి తెచ్చినా పెద్దగా ఉపయోగం లేకపోయింది. సమస్యలను నోట్ చేసుకున్నామని, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మాటలిస్తూ, దాటవేస్తూ సభలను ముగించారు.
పథకాలపై నిలదీతలు..
ప్రభుత్వ పథకాలు, గ్యారెంటీ హామీలపై పలుచోట్ల గ్రామస్తులు అధికారులను నిలదీశారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల విషయంలో చాలామంది ప్రశ్నల వర్షం కురిపించారు. తమకు ఇందిరమ్మ ఇళ్లు రాలేదంటూ ఆగ్రహం వ్యక్త చేశారు. అయితే, రెండో విడతలో ఇస్తామంటూ అధికారులు దాటవేస్తూ సమాధానాలిచ్చారు. గ్యాస్ సబ్సిడీ పడడం లేదని, కరెంటు జీరో బిల్లులు అమలు కావడం లేదని మరికొంతమంది సభలో అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఇక.. రేషన్‌కార్డులు, తులం బంగారం, కొత్త పింఛన్లు ఎప్పుడిస్తారో చెప్పాలంటూ సభల్లో ప్రజలు ప్రశ్నల వర్షం కురిపించారు. ఆయా సమస్యలను ప్రభుత్వం దృష్టికి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామంటూ అధికారులు సమాధానాలు ఇచ్చారు. అయితే, భద్రాద్రి కలెక్టర్ అంకిత్ హాజరైన చోట మాత్రం గ్రామసభలకు జనం ఆశించిన స్థాయిలో వచ్చారు.
మందుబాబులపై చర్యలు తీసుకోండి..
ఏదులాపురం గ్రామసభలో అంగన్వాడీ టీచర్ ఆవేదన
ఖమ్మం రూరల్, ఏప్రిల్ 2: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి 23వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ పోకబత్తిని అనిత ప్రాతినిథ్యం వహిస్తున్న వార్డులో గురువారం జరిగిన గ్రామసభలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సభకు హాజరైన అదే వార్డు ఇందిరమ్మకాలనీలోని అంగన్వాడీ టీచర్ సరిత మాట్లాడుతూ నిత్యం తమ కేంద్రానికి ఎదురవుతున్న సమస్యను సభ దృష్టికి తెచ్చారు. రాత్రివేళల్లో కొందరు యువకులు, గాంజా, మద్యం సేవించడానికి అంగన్వాడీ కేంద్రాన్ని అడ్డాగా చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెల్లవారి వచ్చేసరికి బీరు బాటిళ్లు, రక్తపు మరకలు కనిపిస్తున్నాయని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను వేడుకుంది.