కూసుమంచి, అక్టోబర్ 18: పాలేరు నియోజకవర్గంలో ఎన్నికల సందడి మొదలైంది. జిల్లాలో అత్యధిక సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, సమస్యాత్మక గ్రామాలు పాలేరులోనే అధికంగా ఉన్నాయి. దీంతో పోలీసులు ఆయా గ్రామాలు, పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అధికారులు ఇప్పటికే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కలెక్టర్, జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి వీపీ గౌతం ఆదేశాలతో నియోజకవర్గంలో ఎన్నికల ఏర్పాట్లను రిటర్నింగ్ అధికారి రాజేశ్వరి ఆధ్వర్యంలో రూరల్ ఏసీపీ బస్వారెడ్డి, అధికారులు పర్వవేక్షిస్తున్నారు. సీఐలు, ఎస్సైలు మండలాల వారీగా తహసీల్దార్లు, ఎంపీడీవోలతో సమావేశాలు, తీసుకోవాల్సిన నిర్ణయాలపై సమీక్షలు పూర్తి చేశారు.
పెరిగిన పోలింగ్ కేంద్రాలు
2019 ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గంలో 265 పోలింగ్ కేంద్రాలు ఉండగా ప్రస్తుతం 289కి పెరిగాయి. ఓటర్ల సంఖ్య గతంలో 1.97లక్షలు ఉండగా ఈసారి 2.32 లక్షల మంది ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఈ నెల చివరి వరకు కొత్త ఓటర్ల నమోదు ఉండడంతో ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది. ప్రతి పోలింగ్ కేంద్రాన్ని సంబంధిత పోలీస్ అధికారులు కూసుమంచి, రూరల్ సీఐలు జితేంద్రెడ్డి, రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఎస్సైలు పర్యవేక్షిస్తున్నారు. గతంలో పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడ సమస్యలు ఉత్పన్నమయ్యాయో పరిగణలోకి తీసుకొని ప్రతి కేంద్రాన్ని స్వయంగా పరిశీలించి తగిన ఏర్పాట్లకు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాలు పొలింగ్ కేంద్రం 1 నుంచి 64 వరకు తిరుమలాయపాలెం మండలం, 65 నుంచి 164 వరకు ఖమ్మం రూరల్, 165 నుంచి 230 వరకు కూసుమంచి, 230 నుంచి 289వరకు నేలకొండపల్లి మండలంలో కేంద్రాలు ఉన్నాయి.
సమస్యాత్మకంగా 103 పోలింగ్ కేంద్రాలు
జిల్లాలో అత్యధికంగా పాలేరు నియోజవకవర్గంలోనే సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి. నాలుగు మండలాల్లో 103 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను అధికారులు గుర్తించారు. నియోజకవర్గంలో సమస్యాత్మక గ్రామాలు 53 ఉన్నట్లుగా గుర్తించి వాటిల్లో ఇప్పటికే పోలీసుల సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, సమస్యాత్మక గ్రామాల విషయంలో పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు ఎక్కువ దృష్టి పెట్టారు.
సీ విజిల్ యాప్, సువిధ యాప్‌పై అవగాహన
ఎన్నికల్లో సీ విజిల్ యాప్, సువిధ యాప్‌పై రాజకీయ నాయకుల్లో అవగాహనతోపాటు గ్రామాల్లో పంచాయతీ ఆధ్వర్యంలో ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. సీ విజిల్ యాప్‌తో ఫిర్యాదులు, ఎన్నికల్లో అక్రమాలు, నిబంధన, ఉల్లంఘన వంటి వాటిపై తక్షణ ఫిర్యాదుకు ఎన్నికల సంఘం విడుదల చేసింది. 1950 లేదా 08742-221950 నెంబర్లకు 24 గంటల్లో ఎప్పుడైనా ఫోన్ చెసేలా సీ విజిల్ యాప్‌ను ఏర్పాట్లు చేశారు. యాప్‌ను వినియోగించుకోవాలని అధికారులు పేర్కొంటున్నారు.