honesty | మధిర, ఆగస్టు 3 : మధిర పట్టణంలో విద్యుత్ శాఖలో జూనియర్ లైన్మెన్గా విధులు నిర్వహిస్తున్న బాబురావు అనే ఉద్యోగి నిజాయితీని చాటుకోవడంతో పోలీస్, విద్యుత్ శాఖ అధికారులు అభినందించారు. ఆదివారం మధిర పట్టణం సిద్ధారెడ్డి బజార్ ప్రాంతంలో బాబురావు విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఆ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో, నిర్మానుష్య ప్రదేశంలో ఒక బ్యాగు అతనికి కనిపించింది.
బాబూరావు అనుమానం వచ్చి ఆ బ్యాగును తెరచి చూచాడు. దానిలో డబ్బుతోపాటు బంగారం కూడా ఉండడం గమనించి, తక్షణం ఆ బ్యాగు తీసుకొని పట్టణ పోలీస్ స్టేషన్ నందు సిఐ రమేష్‌కు అప్పగించారు. సిఐ రమేష్ బ్యాగు పోగొట్టుకున్న వారి వివరాలను సేకరించి సంబంధిత బ్యాగు యజమానిని గుర్తించి.. వారిని స్టేషన్‌కు పిలిపించారు.
బ్యాగు పోయిన విధానం తెలుసుకొని, వారికి విలువైన బంగారం, నగదుతో కూడిన బ్యాగును జూనియర్ లైన్మెన్ బాబురావుతోపాటు పట్టణ లైన్ ఇన్స్పెక్టర్ రాజా రత్నం సమక్షంలో యజమానికి బ్యాగు అప్పగించారు. ఈ సందర్భంగా మధిర పట్టణ సీఐ రమేష్ జూనియర్ లైన్మెన్ బాబురావు నిజాయితీకి మెచ్చుకొని, పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో శాలువాతో సన్మానం చేసి అభినందించారు. ఇదే క్రమంలో విద్యుత్ శాఖ వైరా డివిజన్ డీఈ బండి శ్రీనివాసరావు, ఏడీఈ ఎం అనురాధ , మధిర పట్టణ ఏఈఎస్, అనిల్ కుమార్ ఇతర విద్యుత్ శాఖ సిబ్బంది బాబురావుని అభినందించారు.