మామిళ్లగూడెం, జనవరి 6 : ఓటరు జాబితా పారదర్శకంగా ఉండాలని జిల్లా ఓటరు జాబితా సవరణ-2025 పరిశీలకులు బాలమాయాదేవి అన్నారు. సోమవారం ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో ఓటరు జాబితా-2025పై ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లా అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ముందుగా ఖమ్మం జిల్లా ఓటరు జాబితాపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటర్ల జాబితాను విజయవంతంగా ప్రచురించినందుకు అధికారులను ఆమె అభినందించారు.
ఓటరు జాబితాకు సంబంధించిన వివరాలను పార్టీల ప్రతినిధులకు సాఫ్ట్ కాపీ, హార్డ్ కాఫీలను అందించాలని సూచించారు. అనంతరం అదనపు కలెక్టర్లు మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 98.15 శాతం ఓటరు కార్డుల పంపిణీ పూర్తి చేసి.. కొత్త ఓటర్ల కార్డులు ముద్రణకు పంపించామన్నారు. జిల్లాలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 12,30,572 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. వారిలో స్త్రీ, పురుషల నిష్పత్తి 1,076గా ఉందని తెలిపారు. జిల్లాలో మొత్తం 8,582 కొత్త ఓటర్లను జాబితాలో నమోదు చేశామన్నారు.
అలాగే చనిపోయిన 1,641 మంది, ఇతర ప్రాంతాలకు వెళ్లిన 3,472 మంది, రిపీటెడ్గా ఉన్న 127 పేర్లను తొలగించామన్నారు. జిల్లాలో మొత్తం 27,225 దివ్యాంగ ఓటర్లు ఉన్నారని తెలిపారు. డ్రాఫ్ట్ ఓటరు జాబితాపై వచ్చిన 21,549 దరఖాస్తులలో ఇప్పటివరకు 18,411 దరఖాస్తులను ఆమోదించామని, మరో 3,112 దరఖాస్తులను వివిధ కారణాలతో తిరస్కరించామని తెలిపారు. అనంతరం మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు సంబంధించిన ఓటర్ల జాబితా సవరణపై సమీక్షించారు. సమావేశంలో భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్, ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, మూడు జిల్లాల ఈఆర్వోలు, ఏఆర్వోలు పాల్గొన్నారు.