ఎర్రుపాలెం, మార్చి 29 : కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేసే వరకు ప్రజల తరఫున పోరాటాలు చేస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు హెచ్చరించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలతోపాటు ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో శనివారం ఎర్రుపాలెం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలకు ప్రజలు ఆకర్షితులై ఓట్లు వేసి గెలిపించారని, ఇప్పుడు వారిని మోసం చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. ఉన్న పథకాలను కూడా రద్దు చేస్తూ పేద ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. భవిష్యత్లో ప్రజలను సమీకరించి మిలిటెంట్ పోరాటాలు కూడా చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మధిర డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు, జిల్లా కమిటీ సభ్యులు దివ్వెల వీరయ్య, నాయకులు రామిశెట్టి సురేశ్, అంగోతు వెంకటేశ్వర్లు, సగ్గుర్తి సంజీవరావు, నల్లమోతు హనుమంతరావు, దూదిగం బసవయ్య, గామాసు జోగయ్య తదితరులు పాల్గొన్నారు.