దేశవ్యాప్తంగా 117 ఆకాంక్ష జిల్లాల్లో నంబర్‌వన్
కేంద్ర జలశక్తి సంఘం ప్రకటన
దేశంలోనే తెలంగాణకు అరుదైన గుర్తింపు
‘పల్లె ప్రగతి’ తీసుకొచ్చిన గుర్తింపు ఇదీ..!
ఆనందోత్సాహాల్లో జిల్లా యంత్రాంగం
భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ) : గ్రామాల పరిశుభ్రతపై ప్రత్యేక కార్యాచరణ.. చెత్త తరలించేందుకు ప్రత్యేక వాహనాలు.. ఊరి బయట డంపింగ్ యార్డులు.. కంపోస్టు ఎరువుల తయారీ.. ఇంటింటికీ మరుగుదొడ్లు.. పూర్తి స్థాయిలో బహిరంగ మల మూత్ర విసర్జన రహిత (ఓడీఎఫ్) గ్రామాలు.. ఫలితంగా గ్రామాలు పరిశుభ్రం..! పట్టణాలు స్వచ్ఛం..! ఇదీ తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన ‘పల్లె ప్రగతి’ కార్యాచరణ ఫలితం.. జిల్లా యంత్రాంగ కృషిని ఇటీవల కేంద్ర జలశక్తి సంఘమూ గుర్తించింది.. 2024- 25 కల్లా ఓడీఎఫ్ ప్లస్ సాధించేందుకు మరిన్ని నిధులు కేటాయించింది.. దేశవ్యాప్తంగా స్వచ్ఛభారత్‌లో భాగంగా 117 ‘ఆకాంక్ష’ జిల్లాలను ఎంపిక చేయగా వాటిలో భద్రాద్రి నంబర్‌వన్ స్థానంలో నిలిచింది.. దేశవ్యాప్తంగా జిల్లాఖ్యాతిని ఇనుమడింపజేసింది.. ఈ నేపథ్యంలో జిల్లా స్వచ్ఛత వైపు నడిచిన తీరు, యంత్రాంగం కృషిపై కథనం.
పథకం అమలు చేస్తే అది ప్రజలకు సంపూర్ణంగా ఉపయోగపడేలా ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి ద్వారా స్వచ్ఛభారత్‌లో బహిరంగ మలమూత్ర విసర్జన(ఓడీఎఫ్) చెత్త సేకరణ, కంపోస్టు ఎరువు తయారీలో దేశంలోని 117 ఆకాంక్ష జిల్లాల్లో భద్రాద్రి కొత్తగూడెం నంబర్‌వన్ స్థానంలో నిలిచింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి వనరుల శాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 4వ తేదీన కేంద్ర జలశక్తిశాఖ నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో స్వచ్ఛభారత్‌లో నంబర్‌వన్ స్థానం దక్కించుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సాధించిన ప్రగతిని నివేదిక రూపంలో అందజేసింది. 2024, 25 కల్లా ఓడీఎఫ్ ప్లస్‌లో మరింత ప్రగతి సాధించేందుకు కూడా మరిన్ని నిధులు కేటాయించింది. దేశవ్యాప్తంగా ఉన్న ఆకాంక్ష జిల్లాలకు రూ.1,42,084 కోట్ల నిధులను కూడా మంజూరు చేసింది. తెలంగాణలో మొదటి స్థానంలో భద్రాద్రి జిల్లా ఉండగా పదో స్థానంలో ఆసిఫాబాద్, జయశంకర్భూపాలపల్లి జిల్లాలు ఉన్నాయి. పథకాలు అమలు చేయడంలో అధికార యంత్రాంగం చూపిన తీరు ప్రశంసనీయంగా నిలిచింది. పథకం ఏదైనా అమలు చేయడంలో కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఇటీవల అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారం అందించి రక్తహీనత లేని పిల్లల జిల్లాగా గుర్తింపు తెచ్చిపెట్టారు. అప్పుడు కూడా కేంద్రం ఆకాంక్ష జిల్లాలో దేశప్రధాని నోట భద్రాద్రి జిల్లా మాటను గుర్తు చేశారు. ఇప్పుడు స్వచ్ఛ భారత్‌లో భద్రాద్రి జిల్లా దేశంలో నంబర్‌వన్ స్థానంలో ఉన్నట్లు ప్రకటించడంతో జిల్లా యంత్రాంగం ఆనందం వ్యక్తం చేస్తున్నది.
వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 2019లోనే ఓడీఎఫ్ గుర్తింపు పొందింది. స్వచ్ఛభారత్‌లో భాగంగా ఈ జిల్లాలో 89,506 వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకున్నారు. 32,791 వ్యక్తిగత, ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో మరో 1,331 ఇంకుడు గుంతలు నిర్మించారు. కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, పాల్వంచ ప్రాంతాల్లో డ్రై రిసోర్స్ కలెక్షన్ సెంటర్(డీఆర్సీసీ)లను ఏర్పాటు చేశారు. వీటితోపాటు 4 ఫికల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్(ఎఫ్ఎస్టీపీ)లను ఏర్పాటు చేశారు. సెప్టిక్ ట్యాంకుల నుంచి సేకరించే వ్యర్థాల ప్రాసెసింగ్‌కు వీటిని ఉపయోగిస్తారు. తద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు నూటికి నూరుశాతం ఓడీఎఫ్ ప్లస్ గుర్తింపు లభిస్తుంది.
ప్రత్యేకత చాటుకున్నకలెక్టర్
చిన్న వయస్సులో టాపర్‌గా ఎంపికైన కలెక్టర్ అనుదీప్.. పథకం ఎలాంటిదైనా అమలు చేయడంలో తన మార్క్ చాటుకుంటున్నారు. కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్ వందశాతంలో రాష్ట్రంలో గుర్తింపు తెచ్చుకున్న కలెక్టర్ దేశస్థాయిలో ఆకాంక్ష జిల్లాలో ప్రగతిలో సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నారు. అంగన్వాడీ పిల్లల ఎదుగుదలలో మంచి పౌష్టికాహారం అందించి ప్రధాని మోదీతో ప్రశంసలు అందుకున్నారు. తాజాగా స్వచ్ఛభారత్ అమలు చేయడంలో దేశంలో నెంబర్‌వన్ స్థానం సాధించడానికి చేసిన ప్రయత్నం సఫలం అయింది.
పల్లె ప్రగతితో మరింత పరిశుభ్రత
పల్లె ప్రగతి పథకం మారుమూల గ్రామాల్లో సైతం పరిశుభ్రతను అలవాటు చేసింది. పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు తెచ్చి పల్లె, పట్టణ ప్రగతిపై సర్కారు ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల కరెంటు లైన్లను కొత్తవి మార్చింది. భవనాలు, పాడుపడిన బావులు, అంతర్గత రహదారుల నిర్మాణాలు చేపట్టి కొత్తశోభను సంతరింపజేసింది. విరివిగా మొక్కలు నాటి పల్లెపకృతి వనాల్లో పచ్చందాల పార్క్‌లు నిర్మించింది. దీంతో గ్రామాలు, పట్టణాలు సరికొత్త శోభను సంతరించుకున్నాయి.
చాలా ఆనందంగా ఉంది
పల్లె ప్రగతి పథకం అద్భుతం. నాడు పచ్చదనం అంతంత మాత్రమే ఉండేది. పల్లె ప్రగతితో ఊరంతా వనంలా మారింది. ఏ దారి చూసినా పచ్చదనమే. స్వచ్ఛభారత్ మిషన్‌లో ఓడీఎఫ్ ప్లస్‌గా మార్చగలిగాం. జిల్లా యంత్రాంగం అందరూ కలిసికట్టుగా పనిచేశారు. రాష్ట్రంలోఎక్కడా లేనివిధంగా చెత్తసేకరణ చేసి కంపోస్టు ఎరువును తయారు చేయించాం. మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన మరుగుదొడ్ల వల్ల రహదారులు, ఇతర పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉన్నాయి. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి, ఇంకుడుగుంతలు ఏర్పాటు చేసుకున్నారు. బృహత్ పల్లెపకృతి వనాలను గుర్తించి మొక్కలు కూడా వేస్తున్నాం.
– దురిశెట్టి అనుదీప్, కలెక్టర్