పెనుబల్లి/ వేంసూరు/ సత్తుపల్లి రూరల్, ఏప్రిల్ 1: అకాల వర్షాలు అతలాకుతలం చేశాయి. అన్నదాతలను నట్టేట ముంచాయి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత నెలలో కురిసిన అకాల వర్షానికి జిల్లావ్యాప్తంగా 30వేల ఎకరాల్లో సాగు చేస్తున్న మొక్కజొన్న, వరి పంటలు దెబ్బతిన్నాయి. మామిడి తోటల్లో కాయలు రాలిపడ్డాయి. పంట నష్టపోయిన రైతులకు పరిహారంగా ఎకరానికి రూ.10 వేల చొప్పున ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇంతలోనే వరుణుడు మరోసారి ప్రకోపించాడు. శుక్రవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి సత్తుపల్లి నియోజకవర్గంలోని మామిడితోటల్లో చేతికి వచ్చిన మామిడి కాయలు రాలిపడ్డాయి. మొక్కజొన్న పంట నేలవాలింది.
ఇటీవలి గాలివాన బీభత్సం, అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నందున కర్షకులెవరూ కలత చెందొద్దని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ధైర్యం చెప్పారు. పంటలన్నింటికీ పరిహారం అందించి సీఎం కేసీఆర్ ఆదుకుంటారని భరోసా ఇచ్చారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పెనుబల్లి, వేంసూరు మండలాల్లో శనివారం పర్యటించిన ఆయన.. ఇటీవలి గాలివానల వల్ల మామిడితోటల్లో నేలరాలిన కాయలను పరిశీలించారు. పెనుబల్లి మండలం కొత్తకారాయిగూడెంలో మామిడితోటల్లో కలియ తిరుగుతూ రాలిన కాయలను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఏ కష్టం వచ్చినా సీఎం కేసీఆర్ అండగా ఉంటున్నారని, ‘నేనున్నా’నంటూ ఆదుకుంటున్నారని అన్నారు. ఇలాంటి వాస్తవాలను గమనించకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
మొన్న మధిర నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించి మొక్కజొన్న రైతులను ఆదుకుకున్నారని, కేంద్రాన్ని సాయం అడగకుండానే ఎకరానికి రూ.10 వేల అందిస్తున్నారని గుర్తుచేశారు. దేశ సంపదను ప్రధాని మోదీ కార్పొరేట్లకు దోచిపెడుతుంటే.. తెలంగాణ రాష్ట్రంలోని రైతులను సీఎం కేసీఆర్ కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నారని అన్నారు. నష్టపోయిన రైతుల వివరాలను కలెక్టర్‌కు, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శికి, ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం అందించామని వివరించారు. నష్టాన్ని అంచనా వేసి రైతులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటుందని, ఎవరూ అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. వేంసూరు మండలం పల్లెవాడ, చౌడవరం, సత్తుపల్లి మండలం రేజర్ల గ్రామాల్లోనూ పర్యటించి మొక్కజొన్న, మామిడి, నిమ్మ తోటల్లో రాలిన పంటలను పరిశీలించారు.
కేంద్ర ప్రభుత్వం రైతు ఆధారిత బీమా సౌకర్యాన్ని కల్పించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం గాలి బీభత్సానికి ఎగిరిపోయిన ఇళ్ల పైకప్పులను కూడా పరిశీలించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు ఎం.విజయనిర్మల, అనసూయ, కొత్తూరు ఉమామహేశ్వరరావు, మీనాక్షి, నరసింహారావు, శ్రీదేవి, మోహన్‌రావు, వెంకట్రావు, వినీల్, అశోక్‌కుమార్, లక్ష్మణరావు, గోపాల్‌రెడ్డి, ప్రసాద్, మారేశ్వరరావు, అప్పారావు, చలపతిరావు, వెంకటేశ్వరరావు, రామ్మోహన్, హైమావతి, రామారావు, వాసు, పుల్లారావు, హరికృష్ణారెడ్డి, శంకర్రావు, సురేందర్‌రెడ్డి, శ్రీనివాసరావు, సురేశ్, వెంకటరెడ్డి, సత్యనారాయణరెడ్డి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం ఆదుకుంటుందనే నమ్మకముంది..
10 ఎకరాల మామిడితోటలో కాయలు పూర్తిగా రాలిపోయాయి. మరో రెండు మూడు రోజుల్లో మొదటి కోత కోద్దామనుకుంటున్న సమయంలో గాలివానతో కాయలన్నీ రాలిపోవడం దురదృష్టకరం. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మా పంటలను పరిశీలించారు. పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులను ఆదుకుంటామన్నారు. ప్రభుత్వం మమ్ములను ఆదుకుంటారనే నమ్మకముంది.
–మాదాల కృష్ణ, రైతు, పెనుబల్లి
నష్టాన్ని అంచనా వేస్తున్నాం..
మామిడితోటల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నాం. నివేదిక రాగానే ప్రభుత్వానికి అందిస్తాం. జిల్లాలో ప్రస్తుతం 19 వేల ఎకరాల్లో మామిడి పంట సాగులో ఉంది. ఇందులో ఎన్ని ఎకరాల్లో ఎంతమేరకు పంట నష్టం జరిగిందో తెలుసుకుంటున్నాం. దానిని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తాం.
–అనసూయ, డీహెచ్‌వో