ఖమ్మం ఎడ్యుకేషన్, జూన్ 3: మహిళ విద్యావంతురాలైతేనే సమాజం సుభిక్షంగా ఉంటుందని వక్తలు పేర్కొన్నారు. న్యాయపరమైన హక్కులు, చట్టాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం, తెలుగు సాహిత్య అకాడమీ, ఖమ్మం నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఖమ్మంలోని ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న ఖమ్మం బుక్ ఫెయిర్ శుక్రవారం రెండో రోజూ కొనసాగింది. జాతశ్రీ వేదికపై పమ్మి రవి బృందం ప్రదర్శించిన ‘ధూంధాం – ఆటపాట’ సాంస్కృతిక కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయి. ఇంటా బయటా కనపడకుండా పడుతున్న ఒత్తిడి ద్వారా స్త్రీకి కలుగుతున్న అనారోగ్య సమస్యల గురించి డాక్టర్ రామినేని సబిత వివరించారు. న్యాయవాదిగా, లా కళాశాలలో అధ్యాపకురాలిగా విధులు నిర్వహిస్తున్న రత్నాంబ.. ప్రస్తుత పరిస్థితుల్లో బాలికలు, మహిళలు ఎదుర్కొనే సవాళ్లను గురించి వివరించారు. స్త్రీ విద్య ఆవశ్యకత గురించి మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పద్మావతి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఫణిమాధవి, కన్నోజు, రూపరుక్మిణి, సునంద, సుభాషిణి, నిర్వాహకులు రావులపాటి సీతారాం, బెల్లంకొండ ప్రసేన్, అట్లూరి వెంకటరమణ, ఇంజం వెంకటరమణరావు, పోపూరి రవిమారుత్ తదితరులు పాల్గొన్నారు.