కోటి ఆశలతో స్వాగతం పలుకుతూ జరుపుకునే న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్నంటాయి. పాత ఏడాది 2023కు వీడ్కోలు చెబుతూ.. 2024 సంవత్సరంలోకి అడుగిడుతూ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజలు ఉత్సాహంతో నూతన సంవత్సర సంబురాలు జరుపుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి యువతీ యువకులు కేకులు కట్ చేసి.. డీజే మోతల నడుమ నృత్యాలు చేస్తూ.. కేరింతలు కొడుతూ ఉత్సాహభరిత వాతావరణంలో వేడుకలు చేసుకున్నారు. మహిళలు కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ఇళ్ల ముంగిళ్లను రంగురంగుల రంగవళ్లులతో తీర్చిదిద్దారు. ‘హ్యాపీ న్యూ ఇయర్’ అంటూ ముగ్గులతో రాసి మురిసిపోయారు.
తెల్లవారుజాము నుంచే అలంకరించిన ఆలయాలు, చర్చిలకు వెళ్లి పూజలు, ప్రార్థనలు చేశారు. భక్తులతో ఆలయ, చర్చి ప్రాంగణాలు కిటకిటలాడాయి. కొత్త సంవత్సరంలో అంతా మంచే జరగాలని, వ్యవసాయం బాగుండాలని.. పాడిపంటలతో తులతూగాలని, పిల్లలు చదువులో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుతూ భక్తిభావంతో పూజలు, ప్రార్థనలు చేశారు. మిత్రులు, కుటుంబ సభ్యులు పరస్పరం వాట్సప్, ఇన్స్టా తదితర మాధ్యమాల పోస్టులతోపాటు స్వయంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకున్నారు.