ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, డిసెంబర్ 22 : ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీల సర్పంచులు సోమవారం పీఠాన్ని అధిరోహించారు. ఖమ్మం జిల్లాలో 565 గ్రామ పంచాయతీలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 368 గ్రామ పంచాయతీల్లో పాలకమండళ్లు కొలువుదీరాయి. ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో జరిగిన కార్యక్రమాల్లో సర్పంచులతోపాటు ఉప సర్పంచులు, వార్డు సభ్యులతో స్థానిక ఎంపీడీవోలు, ఎంపీవోలు, గ్రామ కార్యదర్శులు ప్రమాణ స్వీకారాలు చేయించి పదవీ బాధ్యతలు అప్పగించారు. తొలిరోజు సర్పంచ్ అధ్యక్షతన అన్ని పంచాయతీల్లో పాలకవర్గాల సమావేశాలు జరిగాయి.
పల్లె సమస్యలపై చర్చించారు. కొత్త పాలకవర్గం కొలువుదీరడంతో పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఆయా పార్టీల ఆధ్వర్యంలో జరిగిన విజయోత్సవ ర్యాలీలతో గ్రామాలు దద్దరిల్లాయి. మొత్తానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచులు ఇక గ్రామాభివృద్ధిపై దృష్టి సారించనున్నారు. ఖమ్మం జిల్లాలోని మొత్తం 571 గ్రామ పంచాయతీల్లో గత 22 నెలలుగా ప్రత్యేకాధికారుల పాలన కొనసాగింది. ప్రభుత్వం మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించడంతో గ్రామపాలన గాడిలో పడటానికి అవకాశం లభించినైట్లెంది.
సర్పంచుల పదవీ ప్రమాణస్వీకారం అనంతరం నూతన సర్పంచుల అధ్యక్షతన ఆయా గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శులు గ్రామాభివృద్ధికి సంబంధించిన అంశాలను వివరించడంతోపాటు నిధులు, చేయాల్సిన పనులు వంటి అంశాలను సభలో వివరించారు. గ్రామాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, నిధుల లభ్యతపై ఆయా గ్రామ పంచాయతీ తొలి పాలకవర్గ సమావేశాల్లో చర్చించారు. జిల్లాలో 571 పంచాయతీలకు గానూ కోర్టు స్టే దృష్ట్యా ఏన్కూరు మండలంలో నాలుగు గ్రామాలు, పెనుబల్లి మండలంలో ఒక గ్రామానికి ఎన్నికలు నిర్వహించలేదు. అలాగే ఏన్కూరు మండలం నూకాలంపాడుకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ సర్పంచ్ పదవి ఎస్టీకి రిజర్వ్ కావడం ఆ గ్రామంలో ఎస్టీలు ఎవ్వరూ లేకపోవడంతో అక్కడ ఎన్నిక వాయిదా పడింది.
ఎన్నికలు జరగని ఆరు గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలనే కొనసాగుతుంది. మిగిలిన 565 గ్రామ పంచాయతీలకు కొత్త పాలకవర్గాలు సోమవారం కొలువుదీరాయి. గ్రామాల్లో సర్పంచుల పాలన ప్రారంభం కావడంతో పల్లెలు కొత్త కళను సంతరించుకున్నాయి. గత 22 నెలలుగా ప్రత్యేకాధికారుల పాలనలో కనీస సమస్యలు కూడా పరిష్కారం కాకపోవడంతో విద్యుత్, పారిశుధ్యం, తాగునీరు వంటి కనీస సమస్యలు అపరిష్కృతంగా మిగిలాయి. చిన్న వర్షం వచ్చినా ఇళ్ల ముందే మురుగునీరు నిలిచే సమస్య ఉంది. సోమవారం ఆయా సర్పంచులు పదవీ బాధ్యతలు స్వీకరించడంతో బీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ నేతల మద్దతుతో గెలిచిన సర్పంచులకు శుభాకాంక్షలు తెలియజేయడంతోపాటు పదవీ స్వీకార కార్యక్రమంలో పాల్గొని అభినందించి, ఘనంగా సన్మానించారు.
మధిరలో 10 గ్రామ పంచాయతీల సర్పంచుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జెడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచులకు సన్మానం చేశారు. గ్రామ పంచాయతీల్లో ప్రజాప్రతినిధుల పాలన ప్రారంభంకావడంతో గ్రామాల అభివృద్ధికి జనాభా దామాషా ప్రకారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనున్న నిధులకు లైన్ క్లియర్ అయినైట్లెంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రామ పంచాయతీలకు మంజూరు కావాల్సిన నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధుల కోసం ఆయా గ్రామా పంచాయతీలు ఎదురుచూస్తున్నాయి.
జిల్లాలో 368 పంచాయతీల్లో పాలక మండళ్లు ప్రమాణ స్వీకారాలు చేశాయి. పండుగ వాతావరణంలో కొత్త పాలకవర్గం కొలువుదీరింది. ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో జరిగిన ఈ కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యేలు కొన్నిచోట్ల హాజరయ్యారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులకు బాధ్యతలను గుర్తుచేశారు. కొన్నిచోట్ల రెండు, మూడుసార్లు గెలిచిన సర్పంచులు కూడా ఉన్నారు.