భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మన్యానికి మెడికల్ కాలేజీ ఒక పెద్ద వరం. కానీ.. ఆ మెడికల్ కాలేజీ ఇప్పుడు అవినీతి ఆరోపణలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. నెలల తరబడి ప్రతి ప్రజావాణిలో ఫిర్యాదుల పరంపర కొనసాగుతూనే ఉంది. చివరికి ఏసీబీ రైడ్ వరకు వచ్చేసింది. ఇంతకీ మెడికల్ కాలేజీలో అంతపెద్దగా ఏం లుకలుక జరుగుతోందనేది సర్వత్రా ప్రస్తుత చర్చనీయాంశం.
సరిగ్గా రెండేళ్ల క్రితం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో భద్రాద్రి జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు కావడంతో ఏజెన్సీవాసులు చాలా సంతోషపడ్డారు. కానీ.. ఆ సంతోషం కాంగ్రెస్ సర్కారు హయాంలో ఎంతోకాలం నిలువలేదు. అవినీతి కంపును మూట కట్టుకుందంటే అక్కడ ఎలాంటి అక్రమాలు జరుగుతున్నాయో వేరే చెప్పనక్కర్లేదు.
– భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ)
జిల్లాకేంద్రంలోని కొత్తగూడెంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుతో కొత్త ఉద్యోగుల నియామకాలకు అవకాశం కలిగింది. అక్కడ నుంచి అక్రమాల ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అవుట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగులను నియమించుకునే అవకాశం కలగడంతో కొత్తగూడెంలో ఉన్న రెండు ఏజెన్సీలు నియామకాల ప్రక్రియను చేపట్టాయి. ఒక ఏజెన్సీ 220 మందిని నియమించుకోగా.. మరో ఏజెన్సీ 81 మంది ఉద్యోగులను నియమించింది. ఇవన్నీ అధికారుల కనుసన్నల్లోనే జరిగాయి.
అయితే నియామకాల ప్రక్రియపై కొందరు నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. నియామకాలు సక్రమంగా జరగలేదని, సొమ్ములు ఇచ్చిన వారికే ఉద్యోగాలు ఇచ్చారని ఫిర్యాదులు చేయడంతో అప్పటి కలెక్టర్ విచారణకు సైతం ఆదేశించారు. విచారణలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు బహిరంగ అక్రమాలపై నోరు విప్పకపోవడంతో ఆ విచారణ అక్కడితో నిలిచిపోయింది. దీంతో రెండు ఏజెన్సీల ద్వారా నియమించబడిన ఉద్యోగులకు కొన్ని సందర్భాల్లో వేతనాలు రాకపోవడంతో అప్పట్లో కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదులు చేయగా.. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను కలెక్టర్ సరెండర్ కూడా చేశారు. ఆ సరెండర్ సక్రమం కాదని కలెక్టర్‌పై కూడా ఆరోపణలు వచ్చాయి. అది కేవలం పత్రికలకే పరిమితం అయిపోయింది. పై అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో నియామకాల పర్వం నేటికీ ఒక కొలిక్కిరాలేదు.
చిలికిచిలికి గాలివానలా మెడికల్ కాలేజీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల వ్యవహారం చివరికి ఏసీబీ రైడ్ వరకు వచ్చింది. ఉద్యోగుల జీతాల బిల్లులు చెల్లింపుల్లో కాలేజీ పరిపాలనాధికారి చేతివాటం ప్రదర్శించడంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో అక్రమాల పుట్ట ఒక్కసారి కుప్పకూలినట్లయింది. అదేకాక ఉద్యోగుల నియామకాలు సక్రమంగా జరగలేదని కూడా గతంలో కలెక్టర్‌కు ఫిర్యాదులు చేయడంతో దానికి సంబంధించిన వ్యవహారం కూడా ఏసీబీ దృష్టికి చేరింది. అసలు 23 మంది నియామకాలు ఎందుకు ఆపారు? వారి జీతాలు ఎందుకు ఆపారు? అనేది అర్థంకాని విషయంగా మారింది. ఏజెన్సీల వారు మాత్రం మా ఏజెన్సీ నుంచి ఎవరినీ తొలగించలేదని చెప్తుండగా.. కాలేజీ యాజమాన్యం మాత్రం 23 మంది బదులు వేరే వారిని పెట్టుకోవాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్లు చెప్తున్నారు. చివరికి ఆ 23 మంది ఉద్యోగుల నియామకం మిస్టరీగానే ఉంది.
అవుట్ సోర్సింగ్ పోస్టులపై విచారణ అట్లుండగా… మెడికల్ కాలేజీలో మరో 150 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. దానిని ఓపెన్ మెరిట్ ద్వారా భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇవ్వడంతో నిరుద్యోగులు వేల సంఖ్యలో దరఖాస్తులు పెట్టుకున్నారు. అయినా అది నేటికీ పూర్తి చేయకపోవడంతో సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఏజెన్సీల ద్వారా భర్తీ చేస్తే అక్రమాలు జరుగుతున్నాయని వాటిని మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలని నిరుద్యోగులు పట్టుబట్టడంతో చివరికి ఉద్యోగాల నియామకాలు నిలిచిపోయాయి.
అవుట్ సోర్సింగ్ ద్వారా నియమించబడిన ఉద్యోగులు 23 మందిని రిప్లేస్ చేయమని కలెక్టర్ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఆ ప్రక్రియ జరుగుతున్నది. జీతాల బిల్లుల చెల్లింపులు జరిగే క్రమంలో ఏసీబీ రైడ్ చేశారు. ఇతర విషయాలు నాకు తెలియదు.
గత ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో మెడికల్ కాలేజీ మంజూరు చేశారు. ఇక్కడ పేద విద్యార్థులకు మెడికల్ కాలేజీలో సీట్లు వచ్చాయంటే అది బీఆర్ఎస్ పుణ్యమే. అలాంటి కాలేజీని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో భ్రష్టు పట్టిస్తున్నారు. అవినీతిమయంగా మారింది. అర్హులకు రావాల్సిన ఉద్యోగాలు డబ్బులు ఉన్నవాళ్లకి వస్తున్నాయి. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే.
– కాపు సీతాలక్ష్మి, మున్సిపల్ చైర్పర్సన్, కొత్తగూడెం
అవుట్ సోర్సింగ్ నియామకాలు ఏజెన్సీల ద్వారా జరపకుండా ప్రభుత్వమే చేపట్టాలి. లేదంటే అవినీతి రాజ్యమేలుతుంది. అందుకే నిరుద్యోగుల వద్ద రూ.లక్షలు వసూళ్లు చేసి ఉద్యోగాలు ఇస్తున్నారు. గతంలో ఆరోపణల వల్లనే ప్రిన్సిపాల్‌ను బదిలీ చేశారు. అయినా మళ్లీ అవే అక్రమాలు జరుగుతున్నాయి. అవినీతికి పాల్పడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించకూడదు.
– అన్నవరపు కనకయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి