భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకానికి (ఎన్ఆర్ఈజీఎస్) కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. పేరు మార్పు సహా ఈ చట్టానికి అనేక సవరణలు చేసింది. దీంతో పథకం ఉద్దేశమైన వంద రోజుల పనిదినాలు కార్మికులకు దక్కవంటూ కార్మిక సంఘాల నాయకులు మండిపడుతున్నారు. అందుకని ఈ చట్టానికి ఎలాంటి సవరణలూ చేయవద్దని, ఇప్పటికే ఉన్న చట్టాన్ని యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు భద్రాద్రి జిల్లావ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. చట్టానికి చేసిన సవరణల బిల్లుల ప్రతులను వివిధ పార్టీల నేతలు, కూలీ సంఘాల నాయకులు, ఉపాధి కూలీలు దహనం చేస్తూ నిరసనలు వ్యక్తం చేశారు.
గామీణ ప్రాంతాల్లోని రైతు కూలీలకు ఏటా వంద రోజులపాటు కచ్చితమైన ఉపాధిని కల్పించేందుకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని(ఎన్ఆర్ఈజీఎస్) 2005లో అప్పటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది చట్టంగా అమలవుతోంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం చొప్పున ఖర్చు వాటాను భరిస్తూ గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలకు ఏటా నికరంగా వంద రోజులపాటు ఉపాధి పనులను కల్పిస్తోంది. చెరువులు, కాలువల్లో పూడికలు తీయడం, ఆ పూడిక మట్టిని పొలాల్లో పోయడం వంటి పనులు చేయిస్తోంది. అందుకుగాని కూలీలు చేసిన పని ఆధారంగా కనీస వేతనం కూడా అందిస్తోంది.
అయితే, ఈ చట్టానికి కేంద్ర ప్రభుత్వం తాజాగా పలు సవరణలు చేసింది. ముందుగా ఈ పథకం పేరును మార్చింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని (ఎంజీఎన్ఆర్ఈజీఎస్)ను వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్(వీబీ జీ రామ్ జీ)గా మార్చింది. ఇందులో ఇప్పటికే ఉన్న 100 రోజుల గ్యారెంటీ పని దినాలను 125 రోజులకు పెంచినట్లు చెబుతున్నప్పటికీ మిగిలిన పథకంలో చాలా మార్పులు చేసింది. ముఖ్యంగా ఈ పథకానికి వెచ్చించే నిధుల వాటాలో మార్పులు చేసింది. ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం 90 శాతం, రాష్ట్రం ప్రభుత్వం 10 శాతం వాటాల చొప్పున నిధులను భరించేవి. కేంద్రం తెచ్చిన కొత్త చట్టంలో ఇక నుంచి కేంద్ర ప్రభుత్వం 60 శాతం వాటాను మాత్రమే భరిస్తూ.. మిగిలిన 40 శాతాన్ని రాష్ర్టాలకు బదలాయించింది.
దీంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ర్టాలు ఆ 40 శాతం మేర నిధులను ఉపాధి పనులకు వెచ్చించే స్థోమత లేకపోతే ఆ మేరకు కూలీలకు పనిదినాలను తగ్గించాల్సి ఉంటుంది. లేదంటే, కూలీలకు ఆ 40 శాతం మేర వేతనాలు ఇవ్వకుండా ఎగనామం పెట్టే ప్రమాదమూ ఉంటుంది. ఇక వ్యవసాయ సీజన్లో రెండు నెలలపాటు ఈ కొత్త ఉపాధిహామీ పనులను విరామం ఇవ్వనున్నారు. దీంతో ఆ సీజన్లో ఉపాధి కూలీలలందరూ వ్యవసాయ పనులకు వెళ్లి రైతులకు పొలాల్లో పనిచేయాలన్నది కేంద్రం ఆలోచన. దీనివల్ల వ్యవసాయంలో కూలీల కొరత ఇబ్బందులను అధిగమించవచ్చన్న ఆలోచన చేస్తోంది. కానీ, దీనిని కూలీ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.
వ్యవసాయ సీజన్లో కొత్త ఉపాధిహామీ చట్టం వల్ల కూలీలందరూ వ్యవసాయ పనులకు వెళ్లాల్సి వస్తే.. రైతులు తమకు కూలి ధరలను గణనీయంగా తగ్గించే ప్రమాదం ఉందని కూలీలు వాపోతున్నారు. వ్యవసాయ పనులకు సమాంతరంగా ఉపాధిహామీ పనులు కొనసాగితే తమకు ఎక్కడ ఎక్కువ కూలి గిట్టుబాటు అవుతుందో తాము అక్కడికి వెళ్లి పనులు చేసుకుంటామంటూ చెబుతున్నారు. కాగా, భద్రాద్రి జిల్లాలో 2,11,316 మంది ఉపాధిహామీ కూలీలు ఇప్పటికే ఈజీఎస్ పనులు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ఎన్ఆర్ఈజీఎస్ పథకం ద్వారా ఉపాధిహామీ కూలీలకు ఏటా వంద రోజులపాటు నికరమైన పని దినాలు ఉండేవి. కూలీల అభీష్టం మేరకు వారు ఏ సీజన్లోనైనా తమకు కేటాయించిన వంద రోజుల పనులను చేసుకొని ఉపాధి పొందేవారు. ఇప్పుడు తెచ్చిన కొత్త చట్టం వల్ల పనిదినాలు 125కు పెరుగుతాయని చెబుతున్నప్పటికీ వ్యవసాయ సీజన్లో విరామం ఇవ్వడం వల్ల కూలీలు తక్కువ కూలికే రైతుల వద్దకు పనులకు వెళ్లాల్సి వస్తుంది.
-రేపాకుల శ్రీనివాసరావు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు, కొత్తగూడెం
జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం దారుణం. ఎవరితోనూ సంప్రదింపులు జరపకుండానే చట్టంలో మార్పులు తెచ్చి కూలీల నెత్తిన పిడుగు వేసింది. కూలీలకు గ్యారెంటీ హామీని దూరం చేసే కుట్రలపై దశలవారీగా పోరాటం చేస్తాం. రాష్ట్రం 40 శాతం నిధులు ఇవ్వకుంటే ఆ మేరకు కూలీలు ఉపాధి కోల్పోయినట్లేకదా.
-మోర రవి, రైతు కూలీ సంఘం నాయకుడు, పాల్వంచ
ఇప్పటికే నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం.. కార్మికుల హక్కులను హరించింది. ఇప్పుడు ఎన్ఆర్ఈజీఎస్ స్థానంలో వీబీ జీ రామ్ జీ చట్టాన్ని తీసుకొచ్చి కూలీలపై గుదిబండ మోపాలని చూస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపాధిహామీ కూలీలకు అన్యాయం చేయొద్దు. ఉపాధిహామీ కూలీల కడుపు కొట్టాలని చూస్తే కూలీల తరఫున పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం.
-సింధుతపస్వి, బీఆర్ఎస్ నాయకురాలు, పాల్వంచ