Operation Kagar | జూలూరుపాడు, ఏప్రిల్ 29 : ఆపరేషన్ కగార్ నిలిపివేసి, కర్రెగుట్టలో మోహరించిన కేంద్ర సైనిక బలగాలని వెనక్కి పిలిపించాలని కోరుతూ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో మంగళవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వర్ రావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్కే ఉమర్లు మాట్లాడుతూ.. బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక మావోయిస్టు పార్టీని ఆపరేషన్ కగార్ పేరుతో అంతం చేస్తామని ,మార్చి 2026 నాటికల్లా నక్సల్స్ లేకుండా చేస్తామని ప్రకటించడం సరికాదన్నారు. ఆదివాసీ ప్రాంతాలలో ఆదివాసీ చట్టాలను నిర్వీర్యం చేస్తూ నూతన అటవీ సంరక్షణ నియమాల పేరుతో కొత్త చట్టాలను తీసుకువచ్చి కార్పొరేట్ సంస్థలకి ఆదివాసీల ప్రాంతాలలో ఉన్న ఖనిజ సంపదను అప్పజెప్పడం కోసం ప్రయత్నాలు కొనసాగిస్తుందన్నారు.
ఆదివాసీ ప్రాంతాల్లో 89 రకాల ఖనిజ సంపద ఉన్నదని వాటిని స్వాధీనపరచుకోవడం కోసం దాడులు, అత్యాచారాలు, ఎన్కౌంటర్లు కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. 280 కిలోమీటర్ల వైశాల్యం కలిగిన కర్రెగుట్టను టార్గెట్గా చేసుకుని సైన్యం జల్లెడ పడుతుందని వారు అన్నారు. తక్షణమే కర్రెగుట్ట కు పోయిన సైన్యాన్ని వెనక్కి పిలిపించాలని, శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించిన మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని ప్రజాస్వామికంగా వ్యవహరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి వల్లోజుల రమేష్,మండల నాయకులు కల్తి నరసింహారావు, ఏనుగు సీతయ్య, కూరాకుల నరసింహారావు, బి.గోపి ఎర్రయ్య, కిషన్ తదితరులు పాల్గొన్నారు.